అంతరంగం:కెమెరా కళ్ల కోసమే పెళ్లి

జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన మైలురాయి. ఆలుమగలు పులకించిపోయే జ్ఞాపకం. పెళ్లిళ్లకు దగ్గరి బంధువులు, దూరపు

Update: 2022-08-21 19:15 GMT

ఉత్సవాలలో కొత్త సంస్కృతి చోటు చేసుకున్నది. గతంలో కంటే పెళ్లి తంతులో ఫొటోగ్రాఫర్లే కొత్త కొత్త సీన్‌లు సృష్టిస్తున్నారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్. ఇదైతే పిల్ల పిలగాడు సినిమా హీరో హీరోయిన్ లెక్క సినిమాల్లో వలెనే డ్యాన్స్‌లు, పార్కులలో, ప్రకృతిలో చిత్రిస్తున్నారు. నిజానికి ఒక కళాత్మక భావన మన మధ్య ఒరవడి కన్పిస్తుంది. కానీ, పెళ్లి తంతు నిడివి ఎక్కువ అయి ప్రాసెస్ సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎవరి పెళ్లి జ్ఞాపకాలైనా ఆనందాలే. అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంటాయి. అట్లాగే ఇప్పటివి భవిష్యత్ తరాలకు గమ్మత్తు అనుభూతులు కల్గిస్తాయి. దేని ప్రాధాన్యత దానిదే.

జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన మైలురాయి. ఆలుమగలు పులకించిపోయే జ్ఞాపకం. పెళ్లిళ్లకు దగ్గరి బంధువులు, దూరపు బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. ఈ సంఘటనలను చిత్రాలలో బంధించడం ఫోటోగ్రాఫర్ల పని. వీడియోగా రూపొందించడం డిజిటలైజ్ చేయడం ఒక కళ. ఒక నైపుణ్యత గల విద్య. ఈ రోజులలో పెళ్లిళ్లను తమ కెమెరాలలో రికార్డ్ చేయడం గాకుండా ఫొటో‌గ్రాఫర్లే వివాహాలను నడిపిస్తున్నారు. ఇటీవల ఒక పెళ్లికి పోయిన. అసలు మంత్రాలు చదివే అయ్యగారు నిమిత్తమాత్రుడై, ఫొటోగ్రాఫర్లే 'తాళికట్టు, మళ్లీ కట్టు, ఇద్దరు ఇటే తిరిగి చూడండి. తాళి కట్టిన తర్వాత నొసలు మీద ముద్దిచ్చుకో, కట్ కట్, సరిగ్గా రాలేదు మళ్లీ ముద్దు ఇవ్వు' ఇట్లాంటి మాటలు వినిపించాయి.

పెళ్లిలో జరిగే అన్నిటినీ చిత్రీకరిస్తామనే ఫొటోగ్రాఫర్ల యావ వాళ్లకు బాగానే ఉంటది కావచ్చు. పెళ్లి తతంగం ఆలస్యం అవుతుంది. పిల్లా పిలగాడు తలంబ్రాలు పోసుకునుడును ఓ పావుగంట దాకా చిత్రీకరించారు. మాములుగా అయ్యగారు మంత్రాలు చదివితే ఫొటోలు తదనుసారంగా తీయడం సరిపోతుంది. కానీ, మళ్లీ 'ఇట్ల పొయ్యి తలంబ్రాలు, నీవు స్పీడ్‌గా పోయి, ఆయనను స్లోగా పొయ్యమను' ఇట్లాంటి ఆర్డర్‌లతో పాపం అయ్యగారు కూడా మిన్నకుండిపోతున్నాడు.

రికార్డ్ చేయడం మంచిదే

సంఘటనలు, సన్నివేశాలు, జ్ఞాపకాలు, సభలు, సమావేశాలు భవిష్యత్ కోసం అందివ్వడం మంచిదే. అయినా, సినిమా-డాక్యుమెంటరీ షూటింగ్ లెక్క 'రీటేక్' అనుకుంట, మంచిగా వచ్చేదాకా తీయడం చూసేవారి ఓపికను పరీక్షిస్తుంది. ఇబ్బంది కల్గిస్తుంది. ఈ మధ్య పుస్తకావిష్కరణ సభలు జరిగినప్పుడు కూడా ఇదే పునరావృతం అవుతోంది. పత్రికల ఫొటోగ్రాఫర్ల కోసం పుస్తకం ఆవిష్కరిస్తున్నట్టు పదే పదే పట్టుకొని నిలబడటం జరుగుతుంది. లేదా చివరకు మాట్లాడాల్సిన ముఖ్య అతిధి ఫొటోగ్రాఫర్లు వెళ్లిపోతారని ముందే మైకు పట్టుకొని మాట్లాడుతున్నట్లు నటించడం జరుగుతుంది. ఒక్కోసారి అట్లనే ఆయన ప్రసంగం ముందే కానిస్తున్నారు. నిరాహార దీక్షల దగ్గర, ధర్నాల దగ్గర, ఊరేగింపుల దగ్గర కూడా ఇలానే ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు కన్పించగానే నినాదాలు ఎక్కువ చేస్తున్నారు లేదా వీళ్లే చేయిస్తున్నారు.

సాంకేతికత పెరిగి

గతంతో పోలిస్తే సాంకేతికత విపరీతంగా పెరిగి ఫొటోలలో మనుషులు మరింత అందంగా కనిపిస్తున్నారు. సంఘటనలు, ఉత్సవాలను ఇంటర్నెట్ ఆధారంగా ఉన్న దగ్గరి నుంచి ఏడేడు సముద్రాల ఆవల ఉన్నవాళ్లు ఒకే సమయంలో లైవ్‌లో చూడగలుగుతున్నారు. అందుకు అనువుగా నాణ్యతా ప్రమాణాలతో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నది. అనంతరం రూపొందించే అల్బంలు కూడా గొప్ప కళాత్మకంగా ఉంటున్నాయి. కానీ, నడిచేది నడుస్తుంటేనే చిత్రించాలి కానీ చిత్రీకరణ కొరకు పెండ్లి అన్నట్లు ఉండరాదు. దీంతో గంట రెండు గంటలు జరగాల్సిన పెండ్లి నాలుగు గంటలు జరుగుతుంది. వచ్చిన చుట్టాలకు ఇతర పనులు లేదా అదే రోజు మరో పెళ్లికి వెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. పెండ్లి అనంతరం అక్షింతలు వేసే కార్యక్రమాలలోనూ లైన్‌లో వచ్చిన వీళ్లందరినీ నిలుచోబెట్టి కలిసి తిరిగి తిరిగి ఫొటోలు తీయడంతో ఆ లైనులు కదలవు.

వారి 'సీన్'లే ఎక్కువ

ఉత్సవాలలో కొత్త సంస్కృతి చోటు చేసుకున్నది. గతంలో కంటే పెళ్లి తంతులో ఫొటోగ్రాఫర్లే కొత్త కొత్త సీన్‌లు సృష్టిస్తున్నారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్. ఇదైతే పిల్ల పిలగాడు సినిమా హీరో హీరోయిన్ లెక్క సినిమాల్లో వలెనే డ్యాన్స్‌లు, పార్కులలో, ప్రకృతిలో చిత్రిస్తున్నారు. నిజానికి ఒక కళాత్మక భావన మన మధ్య ఒరవడి కన్పిస్తుంది. కానీ, పెళ్లి తంతు నిడివి ఎక్కువ అయి ప్రాసెస్ సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎవరి పెళ్లి జ్ఞాపకాలైనా ఆనందాలే. అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంటాయి.

అట్లాగే ఇప్పటివి భవిష్యత్ తరాలకు గమ్మత్తు అనుభూతులు కల్గిస్తాయి. దేని ప్రాధాన్యత దానిదే. జరుగుతున్న చరిత్రను రికార్డ్ చేయడం చరిత్రకారుల, పత్రికా రచయితల పని. కానీ, చరిత్రనే చరిత్రకారులు, పాత్రికేయులే 'ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి' అని రూపొందినట్లు కన్పిస్తుంది. ఏది ఏమైనా కెమెరా ఆర్ట్ బలమైన కళ. అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతిని ఉన్నదాని కన్నా మరింత అందంగా చిత్రిస్తుంది. కెమెరా కళాకారులను అభినందించాల్సిందే. 

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

పిల్లలంటే!