అంతరంగం:నిషాబాబుల నయా వేషాలు

పూర్వం ఎప్పుడో ఒకప్పుడు మందు తాగడం ఒక పద్దతిగా ఉండేది. అందుకోసం ఒక సందర్భం ఉండేది. పల్లెటూరిలో

Update: 2022-07-31 18:45 GMT

గతంలో సుట్టాలు, దోస్తుల ఇండ్లలో ఎవరన్నా చనిపోతే అక్కడికి పోయి మాట్లాడి, చనిపోయినతనితో తన సంబంధాన్ని నెమరువేసుకుంటూ పరామర్శ చేసి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. దశదినకర్మ వెళ్లేంత వరకు రోజూ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మందు సీసాలు తీసుకపోయి అందులో ముంచెత్తుతున్నరు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుంది. అంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు సరదాగా తాగినవాళ్లకు ఈ పది రోజులు నిత్యం మందుతో గడపడం కష్టమైన పనే. ఇదొక కొత్త చెడ్డ సంప్రదాయం సమాజంలో తిష్ట వేసుకున్నది.

పూర్వం ఎప్పుడో ఒకప్పుడు మందు తాగడం ఒక పద్దతిగా ఉండేది. అందుకోసం ఒక సందర్భం ఉండేది. పల్లెటూరిలో కల్లు ప్రకృతి పానీయం. కొంత మత్తు వచ్చినా ఆరోగ్యానికి నష్టం చేకూర్చని ద్రావణం. తర్వాత తర్వాత కల్తీ కల్లు అయిపోయింది. అదే కాలంలో సారాయి ఉండేది. ఇప్పుపువ్వుతో చేసేది. సారా తాగడం అంటే కొందరికి చిన్నతనం. కొందరికి పెద్దతనమే.

బ్రాండీ, విస్కీ పట్టణాలలో సంపన్నులు మాత్రమే తీసుకునే సరుకు. చుట్టాలు వచ్చినపుడు, పార్టీలు అయినపుడు సామాన్యులు వాడే సరుకు. ఇప్పుడు మందు సర్వంతర్యామి అయ్యింది. ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ వనరు అయ్యింది. మద్యం సేవించడం సాధారణం కూడా అయ్యింది. తాగించేందుకు ప్రభుత్వాల ప్రోత్సాహం పెరిగిపోయింది. ప్రతి ఊరిలో షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. పట్టణాలు, నగరాలలోనూ వాడవాడకూ షాపులు ఉన్నాయి. వాటి దగ్గర జనాల రద్దీ ఉంటున్నది.

చేటు కలుగుతుందని తెలిసినా

మద్యం మనుషులకు హాని చేస్తుంది. నిరంతరం సేవించినవారి కాలేయం దెబ్బ తింటుంది. ఆర్థికంగా నష్టపోతారు. ఇంటిలో కూడా లొల్లులు అవుతాయి. భార్యాభర్తల లొల్లులలో మందు తాగి వచ్చి కొట్టినవే ఎక్కువ. 'హత్యాచారం'లో మందు ప్రభావమే అధికం. ప్రమాదాల గూర్చి చెప్పనవసరం లేదు. మద్యం సేవించి బండి నడిపి పరలోకగతులు అయిన వారు ఎందరో! మరి ఇన్ని అనర్థాలకు దారి తీస్తున్న మందును ఎందుకు ప్రభుత్వాలు బంద్ చేస్తలేవంటే, ప్రభుత్వాలు నడిచేది కూడా మందు మీద వచ్చే కొంత ఆదాయంతోనే. మరి మందు మానాలని చెప్పేది ఎవరు? ఎవరూ లేరు. మద్యపానం వద్దు అని చెప్పడం, చెబితే వినడం జరిగే పని కాకుండా పోయింది. ఒకప్పుడు అవసరాలరీత్యా మందు పార్టీలు అయితే, ఇప్పుడు పెండ్లిళ్లకు మందు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది.

సంపన్న కుటుంబాలవాళ్లు, తరతరాలుగా ఆస్తులు ఉన్నవాళ్లు, కష్టం లేకుండా సులువుగా పైసలు వస్తుండేవాళ్లు మందు విందులు ఇవ్వడం చూసి మధ్యతరగతివాళ్లు ఇదొక స్టేటస్‌గా అనుకుంటున్నరు. తమ ఫంక్షన్‌లలో మందును ఏర్పాటు చేస్తున్నరు. శుభకార్యాలకు కాకుండా, పని పాటా లేకుండా పార్టీలు చేసుకునేవాళ్లు కొందరు. గతంలో సుట్టాలు, దోస్తుల ఇండ్లలో ఎవరన్నా చనిపోతే అక్కడికి పోయి మాట్లాడి, చనిపోయినతనితో తన సంబంధాన్ని నెమరువేసుకుంటూ పరామర్శ చేసి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. దశదినకర్మ వెళ్లేంత వరకు రోజూ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మందు సీసాలు తీసుకపోయి అందులో ముంచెత్తుతున్నరు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుంది. అంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు సరదాగా తాగినవాళ్లకు ఈ పది రోజులు నిత్యం మందుతో గడపడం కష్టమైన పనే. ఇదొక కొత్త చెడ్డ సంప్రదాయం సమాజంలో తిష్ట వేసుకున్నది.

కూలీల చెంతకు చేరి

పల్లెటూరిలో వ్యవసాయ పనులు చేసేందుకు ఇప్పుడు మనుషులు ఎవరూ దొరకడం లేదు. నాటు వేసేందుకు వచ్చే మహిళా కూలీలను ఆటోలో తీసుకుపోయి, కూలి ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ ఇవ్వడం అనేది నడుస్తున్నదని తెల్సింది. అట్లాగే ఒడ్డు పెట్టే కూలీని పిలుస్తే ఆయన కూలి‌తో పాటు క్వార్టర్ బాటిల్ అదనం. ఇవ్వాల పనులు చేసేవాళ్లకు కూడా ఇలా మందు అదనపు సౌకర్యంగా అందచేయబడుతుంది. చెమటోడ్చి శ్రమ చేసే కార్మికులు కూడా తప్పకుండా ఆ రోజు రాత్రి మందు తీసుకుంటున్నరు.

ప్రభుత్వ కార్యాలయాలలో, కాంట్రాక్టర్ల మధ్య సంఘాల మధ్య, స్నేహితుల మధ్య దావత్‌లు కూడా కామన్ అయిపోయింది. మందుతో పాటు చికెన్, గుడాలు, కార ఇవి విపరీతంగా నడుస్తున్నాయి. 'మందు అనారోగ్యం' అనే ప్రచారం ఎక్కడా లేదు. దాని అనర్థాలు చెప్పేవాళ్లు లేరు. కానీ. అమ్మకం మీద దృష్టి ఉంటుంది. గాంధీ పుట్టిన దేశంలో ఇలా మద్యం ఏరులై పారడాన్ని ఎవరు ఆపగలరు? ఎవరికి వారు నిషేధం విధించుకుంటే తప్ప!

 అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

పిల్లలంటే!