జయహో...నవ్య, షేజల్, తుల్జా, తులసీ

antarangam

Update: 2023-07-02 19:30 GMT

మగహాకారం అన్నిచోట్ల విస్తృతంగా వ్యాపిస్తున్నది. చట్టాలకు అందకుండా న్యాయానికి లొంగకుండా తన దుర్మార్గపు కత్తికి పదును పెడుతూనే ఉంది. ముందే అది అహంకారం దానికి మదం, అధికారం తోడైతే అడ్డు అదుపు లేకుండా మహిళలను వేధిస్తున్నది. మహిళల వేధింపులకు సంఘటితంగా ఎదుర్కొనేందుకు పౌర ప్రజా సంఘాలున్నాయి. చట్టాలు, పోలీసు వ్యవస్థ ఉన్నదన్న భయం లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సంఘటనలను పక్షం రోజుల నుంచి చూస్తున్నాము.

న్యాయం, ధర్మమే కాకుండా మీడియాకు మిక్కిలి సోషల్ మీడియా కూడా ఎప్పటికప్పుడూ వేధింపులకు గురి అవుతున్న మహిళలకు గొంతుగా నిలుస్తున్నాయి. చాలాచోట్ల బయటకు రాకుండా లైంగిక వేధింపులు, అణిచివేతలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల మాత్రమే ధైర్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడం తర్వాత దోషులను బయటకు లాగడం, శిక్ష పడేట్టుగా కొట్టడం అన్నది కొన్ని చాలా చోట్ల జరుగుచున్నదే. ఇలాంటి లైంగిక వేధింపుల సంఘటనల్లో ముందుగా మగవాళ్ళ దిక్కే ఆలంబనగా నిలుస్తాయి. స్త్రీలు ఆధారాలు, సాక్ష్యాలు, రికార్డ్‌లతో తెగింపు పోరాటం చేస్తే గానీ ముందుకు సాగదు.

జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా..

జానకీపురం సర్పంచ్ నవ్యను లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం పలు వీడియోల్లో స్పష్టంగా తెలిసింది. ఉన్నది ఉన్నట్లు చెప్పుతున్నది. ఆ వేధింపులకు గురిచేస్తున్నది ‘పవర్’ లో ఉన్న శాసనసభ్యులు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. అయినా ఆ పార్టీలోని మహిళా విభాగాలు ఏం చేస్తున్నాయి అర్థంగాని ప్రశ్నగానే ఉంది.

అలాగే, ఒక వ్యాపార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిని అయిన షేజల్ కూడా లైంగిక వేధింపులకు గురైంది. పలుమార్లు మీడియాలో వివరాలు ఇచ్చింది. తనను ఎట్లా వేధిస్తున్నాడో వివరంగా తెలిపింది. అయితే ఇక్కడ ‘పవర్’లోని శాసనసభ్యుడే ఇంకేముంది కేసు ముందుకు సాగక తాను ఢిల్లీలో ఉంటూ హైదరాబాద్‌లో ఉన్న ఆ నాయకుడిని శిక్షించాలని నిరాహార దీక్షలు చేస్తున్న సరియైన న్యాయం జరగడం లేదు. వీళ్లంతా తమకు జరిగిన అన్యాయానికి వ్యక్తులుగా శక్తి వంచన లేకుండా తిరుగుబాటు చేస్తున్నారు.

మరో సందర్భంలో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ప్రజా సమస్యలను, వివక్షను, అన్యాయాలను స్వతంత్రంగా వెల్లడిస్తున్న తులసి చందుకు బెదిరింపులు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడం తాను ఎవరి పక్షం కాదు ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్టు విశ్లేషించి చెప్పడమే తప్పా ఎవరికీ వ్యతిరేకంగా కాదు అని అన్నా కూడా, ఒక ‘స్త్రీ’ అని చూడకుండా వేధింపులకు గురి చేయడం అయినా తాను ధైర్యంగా వ్యతిరేకంగా నడుస్తుంది. ఈ సందర్భంలో తులసికి ప్రజా సంఘాలు, పౌర మేధావుల జర్నలిస్ట్ సంఘాల మద్దతు లభిస్తుంది.

దోషులకు శిక్ష పడేందుకు..

మరొక సందర్భంలో తుల్జా భవాని రెడ్డి అనే మహిళ ఒక విచిత్రమైన స్థితి. తన తండ్రి తనకు తెలియకుండా ప్రభుత్వ భూమిని తన పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయడం దాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తుంది తుల్జారెడ్డి. ఇక్కడ తన తండ్రి ‘పవర్’‌లో ఉన్న శాసనసభ్యుడే కావడం గమనార్హం. తన పేరు మీద ఉన్న ఆస్తిని తాను ప్రజాపరం చేయడానికి సిద్దమై తండ్రికి వ్యతిరేకంగా నోరు విప్పడం అభినించదగ్గ విషయం.

స్త్రీలు తమ ఆత్మగౌరవం కోసం న్యాయం కోసం దోషులకు శిక్ష పడటం కోసం బహిరంగంగా ముందుకు రావడం చూస్తుంటే వ్యక్తులుగా వీరు.. వ్యవస్థలను అధికారులను ఎదిరించడం అభినందించదగ్గ అంశం. ఒక్క తులసీ చందుగా కాకుండా మిగితా నవ్య, షేజల్‌ల పోరాటం గురించి లైంగిక వేధింపులకు వ్యతిరేకమైనది. అధికార పార్టీలోని మహిళ నాయకులుగానీ పార్టీ గాని ఈ విషయంలో చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇక తుల్జా భవానీ రెడ్డి విషయంలో అంతర్గతంగా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నామో గానీ తండ్రి చర్యను నిరసిస్తూ తన పేర ఆస్తిని ప్రజాపరం చేయాలనుకోవడం మూల పరిమాణం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొన్ని పోరాట సంఘాలు మౌనంగా ఉన్నట్లు కన్పిస్తున్నా, వ్యక్తులుగా ఈ మహిళలు చేసిన పోరాటాలకు జయహో..

అన్నవరం దేవేందర్

94407 63479 

Tags:    

Similar News

పిల్లలంటే!