కవి కలం నుంచి వచ్చే మాట ఏదైనా, తన అంతరంగంలో వెలుగుతున్న భావాన్ని బాహ్య ప్రపంచంతో పంచుకోవాలనేదే! ఇదే సహజ కవి లక్షణం. ఆ దిశగా కవిత్వంపై ఉన్న, ఖచ్చితమైన వస్తువును ఎంపిక చేసుకునే తత్వం లాంటి భావాలతో సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలను తన కవి కోణంలో చూస్తూ తన వంతు బాధ్యతగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కవిత్వం రాస్తున్న కరీంనగర్ వాస్తవ్యురాలు తోట నిర్మలారాణి.
తను మూడవ కవితా సంపుటి ‘అద్దం నా చిరునామా కాదు’ ఇటీవలే వెలువరించినది. నిజానికి తను రాసిన ఓపెన్ సీక్రెట్ కవితలోని ఒక పాదాన్ని తీసుకొని ‘అద్దం నా చిరునామా కాదు’ అని పుస్తకానికి పేరు పెట్టి ఒక సందిగ్ధకరమైన ఆలోచనను వ్యక్తం చేసినప్పటికీ స్త్రీ అస్తిత్వాన్ని తెలియజేసే క్రమంలో స్త్రీ ధరించే దుస్తులను వేషధారణ బట్టి ఒక సరుకుగా, సుఖాన్ని ఇచ్చే వస్తువుగా చూడటాన్ని కవయిత్రి కవితలో వ్యతిరేకించి వివరించినది.
తన కవితా సంపుటిలోని అమ్మనై పుట్టినందుకు కవితలో...ఇల్లంతా తీపికబురని సంతోషంలో తేలిపోతుంటే నాసికను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాసనల్లో వరుస వాంతులతో ముద్దమింగలేని మూడంకెనయ్యాను. సీమంతమని ముత్తైదులు సింగారం చేస్తుంటే నడుము మీది బిందె ముందుకు జారిన భారంతో ఓపలేని ఆయాసమయ్యాను. ఇలా స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపింది కవయిత్రి.
ఆకతాయి కవితలో... గుండె నిండా తడి అక్షయపాత్రను మోస్తూ తిరిగే నిండు గర్భిణి కానుపవగానే పాపాయి కన్నీటి చుక్కనూ వెలిగించే రంగుల దీపమవుతుంది! అంటూ కవయిత్రి సృష్టికి మూలమైన అమ్మ గొప్పతనాన్ని, బిడ్డపై పెంచుకున్న ప్రేమానురాగాన్ని అనుబంధాలను తెలియజేస్తూ... సాధారణంగా నేటి కాలంలో స్త్రీలు సమాజంలో ఎదుర్కొన్న వివిధ రకాల సమస్యలను తెలియజేసే క్రమంలో ఒక్కో కవయత్రి ఒక్కో కోణంలో ఆవిష్కృతం చేస్తుంటారు.
ఇక్కడింకా అమావాస్యే అలుముకొని ఉంది. కళ్ళగంతల న్యాయం వెలుగుకి సంకెళ్లు వేస్తే చైతన్యంలోపలే పాదుకుంటుంది. ఇక్కడింకా అమావాస్యే విలయతాండవం చేస్తుంది క్షమాభిక్షకు అర్థం మార్చేసిన రాజ్యం అత్యాచారాలను జెల్లకిడిస్తే తలదాచుకోవడానికి అమ్మ గర్భమూ దొరక్క ఆడతనం పురిటిల్లోనే వణుకుతుంది... న్యాయవ్యవస్థ ఎన్ని చట్టాలను రూపొందించినప్పటికీ తరతరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు నేటికీ ఇంకా మనకు కనబడుతూనే ఉన్నాయి. సాంప్రదాయ బంధాలలో తల్లిగా, సోదరిగా,భార్యగా ఇలా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న స్త్రీకి రక్షణ కరువైందని ఆవేదనగా నిర్మల తన కలం వినిపిస్తుంది.
చిన్నచిన్న మొత్తాలతో బతుకుదెరువు కోసం వారానికి ఒక్కసారి శనివారమంగడిలో జరిగే బతుకు తెరువు జీవన చిత్రం. పొద్దుగుంకేదాకా ఆకలి -అవసరం పోటీపడి వేలం పాట పాడుతుంటాయక్కడ బతుకుదెరువులన్నీ భేరసారాలై బేజారవుతాయక్కడ... పొట్ట తిప్పలకు సజీవ సాక్షంగా హరేక్ మాల్ ఏక్ జిందగీ అంటూ చెమట చుక్కలు కలిపి గీసిన బతుకు చిత్రమిది! వారానికోసారి అంగడి అంగీ తోడుక్కొని పట్నాన్ని పలకరించిపోయే శ్రమైక జీవన సౌందర్యం!... అంటూ శనివారమంగడి! కవితలో రిక్కాడితే గాని డొక్కాడని జీవితం లో నుంచి బతుకు పోరాటాన్ని కొనసాగించే నేపథ్యంలో కుటీర పరిశ్రమలో తయారుచేసిన, వర్తకం ద్వారా తదితర ప్రాంతాల నుంచి సంత మార్కెట్లో కళాత్మకమైనటువంటి వస్తువులు, తదితరములు అన్నీ శనివారం నాడు అక్కడ దర్శమిస్తాయని వివరించింది.
బాధ్యతాయుతంగా భిన్న స్వరం తో అనేక అంశాలపై కవిత్వాన్ని రాస్తూ... అద్ధం నా చిరునామా కాదు కవితా సంపుటిలో అన్యధా శరణం నాస్తి, సహదేవు సగటు మనిషి, గాజు బొమ్మ, ఇంటెన్సివ్ కేర్, ఎంతెంత దూరం!, సద్దుల పండుగ, ఓపెన్ సీక్రెట్, అవతారం, ఎవరికి జెప్పుకోవాలి, సంగమం, రాజీ అనబడు జైలు, నీది కాని దాహం, బీడు పడ్డ బీడీ బతుకులం, ప్రియమైన శత్రువు, వెతుకులాట ఇలా 50 వరకు వివిధ అంశాలపై కవితలు పొందుపరచబడ్డాయి. తను రాస్తున్న స్త్రీవాదమా, అస్తిత్వవాదమా, రాజకీయమా, ప్రాపంచిక దుఃఖమా అంటే.... చిట్టచివరగా తను చెప్పేది ఒక్కటే సగటు మనిషికి జరుగుతున్న అన్యాయాన్ని, ఒత్తిడిని వ్యతిరేకించడమేనని అదే కవి బాధ్యత అంటుంది నిర్మల.
తొణకని ఆత్మవిశ్వాసంతో మానవత్వపు జాడలకు తీరం చూపుతూ అద్దం నా చిరునామా కాదు. కవితా సంపుటిని సాహితీ లోకానికి, పాఠక లోకానికి అందించిన కవయిత్రి తోట నిర్మలారాణి కలం నుండి మరిన్ని కావ్యాలు వెలుబడాలని శుభాకాంక్షలందజేస్తున్నాను.
ప్రతులకు
సంపుటి: అద్దం నా చిరునామా కాదు
పేజీలు:120
లభ్యం: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
సమీక్షకులు
-డా. చిటికెన కిరణ్ కుమార్
9490841284