నిన్న కులం కావచ్చు
నేడు మతం కావచ్చు
రేపు జాతి కావచ్చు
దురహంకార రూపం ఏదైతెనేమి?
ప్రేమిస్తే
తలలు తెగిపడుతున్న చోట
నెత్తురు నదిలా పారుతున్న చోట
బాధిత ప్రేమి'కుల' చిరునామా
ఎల్లప్పుడూ వెలివాడే కదా!
తెగిపడిన తలల సాక్షిగా
పారిన నెత్తుటి సెలయేరు సాక్షిగా
ఆకాశంలో శాంతి రాగం ఆలపిస్తున్న
తెల్లని శాంతి పావురమొకటి
నరమేధాన్ని చూసి గుండెలు బాదుకుంది
నరికిన కొద్దీ చిగురిస్తున్న
వెలివాడ ప్రేమ త్యాగాలను చూసి
మరింత గట్టిగా స్వేచ్ఛా రాగాన్ని గానం చేస్తుంది
పోతూ పోతూ రెండు రెక్కలను
అమర ప్రేమికుల రక్తంతో తడుపుకుంది
వెళ్తూ వెళ్తూ అలసిన రక్తపు మరకల రెక్కలు
ప్రేమకు ప్రతిరూపమైన
పాలరాతి తాజ్ మహల్ మీద వాలినాయి
ఇప్పుడది...
పాలరాతి తాజ్‌మహల్ కాదు
ప్రేమికుల రక్తంతో తడిసిన
ఎరుపు రంగు తాజ్‌మహల్
ఎరుపు రంగు తాజ్‌మహల్
విను
ఉస్మానియా యూనివర్సిటీ
(నాగరాజు అమరత్వం సందర్భంగా)
95503 95232