కథా-సంవేదన:జరిమానా
నా దోస్త్ రమణయ్య చనిపోయాడని తెలిసింది. మా ఇంటికి అతని ఇల్లు ఐదు కిలోమిటర్ల దూరం వుంటుంది. నా కొడుకు నౌకరికి పోయిండు. నాకు ఓ మోపెడ్
నా దోస్త్ రమణయ్య చనిపోయాడని తెలిసింది. మా ఇంటికి అతని ఇల్లు ఐదు కిలోమిటర్ల దూరం వుంటుంది. నా కొడుకు నౌకరికి పోయిండు. నాకు ఓ మోపెడ్ వుంది. దాని మీద పోదామని నిర్ణయం తీసుకున్నా. నా కొడుకు వుంటే నన్ను మోపెడ్ మీద పోనివ్వడు. ఎందుకంటే నా వయస్సు 80 సంవత్సరాలు. చచ్చిపోయింది నా దగ్గరి దోస్త్ అతను కూడా నా వయస్సులోనే వుంటాడు. నా దోస్తులు ఒకరు తరువాత ఒకరు చనిపోతూ ఉన్నారు. ఏదో ఒక రోజు నాకు కూడా చావొస్తుంది. అప్పటికి ఎంత మంది దోస్తులు మిగులుతరో తెలియదు. కోడలు పని మీద వుంది. బయటకు పోతున్నానని చెప్పి మోపెడ్ తీసుకొని మా దోస్త్ ఇంటికి బయల్దేరిన. మా దోస్త్ ఇంటికి చేరే సరికి అతని శవాన్ని బయటకు తీసుకొని వచ్చారు. అందరూ ఏడుస్తున్నారు. మా దోస్త్ కొడుకు ఏడుస్తూనే చేయాల్సిన పనులు చేస్తున్నాడు. వయస్సు ఎంత వున్నా తండ్రి తండ్రే కదా! దోస్త్ దోస్తే కదా. నాకు దు:ఖం ఆగలేదు. మా దోస్త్ శవం మీద పడి పడి ఏడ్చినా. ఓ రెండు నిముషాల తరువాత నన్ను పక్కకు తీసుకొని పోయారు. అక్కడికి ముందే చేరుకున్న మరో ఇద్దరు దోస్తులు.
అరగంట తరువాత మా దోస్త్ శవాన్ని దగ్గరలో వున్న ఓ స్మశానానికి తీసుకొని వెళ్ళాం. శవానికి నిప్పు పెట్టిన తరువాత నేను ఇంటికి పోదామని అనుకున్నా. కానీ, నా దోస్తులు 'రమణయ్య కొడుకుని ఇంటి దగ్గర దింపిన తరువాత పోదువు గానీ' అన్నారు. అందరమూ అతడి ఇంటికి పోయాం. కొద్దిసేపు రమణయ్య గురించి మాట్లాడుతూ కూర్చుండిపోయాం. సాయంత్రం ఆరు గంటలకు పోదామని లేచాను. 'ఉండు కాస్సేపు, కొంచెం మందు తాగిద్దాం పిలగానికి' అన్నారు. అనడమే కాదు బయటకుపోయి ఓ రెండు విస్కీ బాటిల్స్ తెచ్చారు. ఆ పిలగాన్ని కూర్చుండబెట్టి తాగి లేచేసరికి ఎనిమిది దాటింది. నా మోపెడ్ తీసుకొని ఇంటిని బయల్దేరాను. దారిలో పోలీసులు ఆపారు.
ఏదో ఊదించారు. మందు ఎక్కువ వుందని చెప్పిండ్రు. నా బండిని తీసుకున్నరు. 'శనివారం లోక్ అదాలత్ వుంటుంది అక్కడికి వచ్చి జరిమానా కట్టి బండి తీసుకొని పో' అన్నారు. చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయిన. నా కొడుకు కోపగించుకున్నాడు. జరిగిన విషయం చెప్పినా. 'ఈ వయస్సులో మోపెడ్ మీద పోవడం తప్పు. తాగి ఇంటికి బయల్దేరడం రెండవ తప్పు' అని నా మీద కేకలు వేసిండు నా కొడుకు.
శనివారం కోర్టుకు పోయినా. జాతర మాదిరిగా వుంది. తాగుబోతుల కేసులు చాలానే వున్నాయి. కేసు ఒప్పుకుంటే కోర్టు చుట్టూ తిరగడం తప్పుతుందని పోలిసులు చెప్పారు. రెండు వేల రూపాయలు జరిమానా కడితే సరిపోతుందని కూడా చెప్పారు. ఏం చెయ్యాలో తోచలేదు. చేసిన తప్పుని ఒప్పుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. చేసింది తప్పే. తప్పు ఒప్పుకోకపోతే కోర్టు చుట్టూ తిరగాలి. ఆ తరువాత కూడా శిక్ష పడదని గ్యారెంటీ లేదు. సరేనని పోలీసులకి చెప్పాను.
కొద్దిసేపటి తరువాత నా కేసుని పిలిచారు. 'తాగి మోపెడ్ నడిపినవా?' అని అడిగారు. అవునన్నట్టుగా తల వూపాను. జరిమానా విధించినట్టు చెప్పారు. ఎంత జుర్మానా వేసారో సరిగ్గా అర్థం కాలేదు. బయటకు వచ్చిన తరువాత పదివేల జుర్మానా అని పోలీసులు చెప్పినారు. తాగినవాళ్ళకి రెండువేలే జుర్మానా వేస్తున్నారు. అదే విషయం పోలీసులని అడిగినా. ఎక్కువగా తాగడంతో ఎక్కువ జుర్మానా వేసినారని చెప్పారు. కోర్టుకి వచ్చేటప్పుడు నా కొడుకును బతిమలాడి ఓ మూడు వేల రూపాయలు తెచ్చుకున్నా. ఏం చెయ్యాలో నాకు తోచలేదు. అన్ని పైసలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో అర్థం కాలేదు. బయట కుప్పకూలి పోయా. ఓ పోలీసాయన వచ్చి జుర్మానా కట్టకపోతే జైలుకి పోవాల్సి వుంటుందని చెప్పిండు. ఇంట్లో కూసోని చేసేది ఏం వుంది? అట్లానే జైలుకి పోతానని అనుకున్నాను.
ఇంతలో మరో పోలీసాయన వచ్చిండు. నా దగ్గర ఎన్ని పైసలున్నయని అడిగిండు. మూడువేలు వున్నాయని చెప్పాను. ఇవ్వమన్నాడు. ఇచ్చాను. అరగంట తరువాత వచ్చి ఏదో కాగితాల మీద సంతకాలు తీసుకున్నడు. ఆయన చెప్పిన చోటల్లా సంతకం చేసిన. కాస్సేపటికి ఆ పోలీసాయన మళ్లీ వచ్చి ఓ కాగితం నా చేతిలో బెట్టిండు. ఏందని అడిగా. జుర్మానా కట్టినట్టు రశీదు అన్నాడు. 'ఇక నువ్వు బోవచ్చు' అన్నాడు. నా బండి గురించి అడిగాను. అది అమ్మే నీ జరిమానా కట్టినం అన్నడు. ఏం మాట్లాడాలో సమజ్ కాలేదు. మెదడు మొద్దుబారిపోయింది. కొడుకూ,కోడలుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కోర్టు జరిమానా విధించినప్పటికన్నా ఎక్కువ బాధ వేసింది. 'రమణయ్య చావు నా చావుకి వచ్చిందని అన్పించింది' రమణయ్య చావు బాధను కలిగిస్తే నా మోపెడ్ చావు నాకు దు:ఖాన్ని కలిగించింది.భోరున ఏడుస్తూ అక్కడే కూలబడ్డాను. తప్పు రమణయ్య చావుదా? ఇంటికి బోయే నన్ను ఆపి తాగించిన స్నేహితులదా? తాగిన తనదా? పోలీసులదా? చట్టానిదా? కోర్టుదా? నాకైతే తెలియదు.
మంగారి రాజేందర్ జింబో
94404 83001