జీవితంలో ఆనందాల అనుభూతులు అనేకం ఉన్నా, వాటిని తిరిగి చేరుకొని తలమీద పోసుకోవడమే ఒక సంబురం. అయితే, జీవితం మొత్తం ఆనందాలే ఉంటాయా? అంటే విషాదాలూ ఉంటాయి. కానీ, వాటిని అవసరమైన రీతిలో మననం చేసుకుంటాం. మారుతున్న కాలానుగుణంగా జీవించడం నేర్చుకుంటేనే జీవనోత్సవం. కొందరు ఎప్పుడూ 'మా కాలంలో గిట్లుండే' మా చిన్నతనంల అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు కుటుంబం ఎక్కడెక్కడో ఉంటున్నారని మదనపడుతుంటారు.
ఆ కాలంలో అందరూ ఒకే వృత్తిలో ఉండేవారు కాబట్టి తల్లి, తండ్రి, కొడుకులు, కోడండ్లు కలిసి ఉండేవారు. ఇప్పుడు వృత్తులు, ఆ వృత్తుల తావులు వేరు. అలా వేరైనప్పుడు వేరు వేరుగా జీవిస్తారు. ఈ రోజుల్లో ఎవరి అభిరుచికి అనుగుణంగా వాళ్లు జీవించే స్థితి. నేడు ఒకే కుటుంబంలో ఉంటే నియంతృత్వ ధోరణికి అలవాటుపడిపోతది. వర్తమానంలో జీవించడం అంటే మారుతున్న జీవనశైలిని అందుకోవాలి దాని వెంబడి నడవాలి. లేకపోతే ఎప్పుడో ఉత్తరాలు రాసుడు, ల్యాండ్ ఫోన్ కాడ ఆగిపోతే మెయిల్లు, వీడియో కాల్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఎక్కడ ఉండేవి. కాలం మారేకొద్ది ఎదుగుతున్న మనిషి కాస్తా వాటికి టచ్‌లో ఉండాల్సిన అవసరం ఉన్నది.
ఏడాదికోసారి ఎంజాయ్
ఇటీవల కాలంలో పుట్టినరోజు వేడుకలకు కేక్ కటింగ్‌లు చాలామంది జరుపుకుంటున్నారు. ఇప్పుడున్న యాభై ఆరవేయేళ్ల తరంవారికి పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడం తెలీదు. వారి మనుమలు, మనుమరాళ్లు జరుపుకుంటుంటే చూస్తున్నారు. జీవితం ఉత్సవంగా జీవనం పర్వదినంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలంటే సాంప్రదాయబద్ధంగా వచ్చే పండుగలతో పాటు పుట్టినరోజును బంధువులను ఆహ్వానించి జరుపుకోవడం అవసరం. ఎందుకంటే పుట్టిన రోజు అంటే ఒక్క సంవత్సరం తగ్గిపోతున్నట్లు. అందుకే దీనికి సెలెబ్రేషన్స్ అవసరం. అలాగే పెళ్లిరోజును కూడా ఎవరి స్థాయిని బట్టి వారు జరుపుకోవచ్చు. ఇలాంటి వాటికి బంధువులను పిలిచి పండుగగా జరపడం వలన కుటుంబాల మధ్య స్నేహితుల మధ్య కలుసుకునే సందర్భాలు ఎక్కువ అవుతాయి.
ఈ వేడుక వలన అప్పుడెప్పుడో నలభై యాభై ఏళ్లనాడు పెళ్లి చేసుకునే సమయంలో లేని డిజిటల్ ఫోటోలు, ఖరీదైన కార్లు, ఆ జోష్‌ను ఏడాదికోసారి చూడవచ్చు. దీనికి ఉదాహరణ ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగిన 60 ఏండ్ల జంట ప్రీ వెడ్డింగ్ విడియో. గతంలో జరిగిన పెండ్లిళ్లకు ఇప్పటికి చాలా తేడా ఉంది. నేడు విద్యా, ఉద్యోగ, సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చిన ఉపాధి వలన కొంత మధ్య తరగతివారు సంపన్నుల జాబితాలో చేరడం, పూర్వం ఎప్పుడో అబ్బో అంత ఖర్చు నాకేందుకు అన్న ధ్యాస లేకుండా పెళ్లి రోజును, పుట్టినరోజునూ ఒక ఉత్సవంగా జరుపుకోవడమే జీవన సంరంభం.
కుటుంబ కలహాలు తగ్గుతాయి
అయితే, పుట్టిన తర్వాత, పెళ్లి తర్వాత ఏం సాధించినం అని ఈ వేడుక, ఖర్చు అనే వాదన కూడా ఉంటది. సాధించేందుకు వృద్ధిలోకి వచ్చేందుకు డబ్బు సంపాదనకు కొలమానం ఏమీ లేదు. ఎంత మంచివాడిగా బతుకుతున్నాము అనేదే ముఖ్యం. అసలు మనిషి తన కోసం తాను బతుకుతూ పరుల కోసం కొంచెం ఆలోచించడం, మంచి పనుల కోసం కోసం కొంచెం సమయం వెచ్చిచ్చడంతో లోపల ఉన్న మాలిన్యాలను రూపుమాపుకోవడం అత్యంత అవసరం. కుటుంబాల మధ్య అహంకారాలు, ఆస్తుల మధ్య మనసు నొప్పించే సంఘటనల ద్వారా వచ్చిన గ్యాప్‌ను ఇలాంటి వేడుకలు అధిగమిస్తాయి. అత్యంత ధనికుడు జరుపుకునేస్థాయిలో జరుపుకోవాలనే ఆరాటం వలన అప్పులు చేసుకోవడం కన్నా ఆనందంగా జీవించడం అనే గీటురాయిని ఏర్పాటు చేసుకోవాలి. అనవసర దుబారా ఖర్చులు తగ్గించి మనసును హృదయాన్ని ఉత్సాహ పరిచే పండుగలను జరుపుకోవాలి.
ఇటీవలి కాలంలో కొన్ని పెండ్లిళ్లలో మద్యం కూడా విందులో భాగం చేస్తున్నారు. ఇది చాలా అనారోగ్యం, అధిక వ్యయం ఇలాంటి వాటిని ఆచరించే సమయంలో మనమూ కొలమానం వేసుకోవాలి. వర్తమానంలో కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చి చేరుతుంటాయి, వాటిల్లో ప్రీ వెడ్డిండ్ షూట్, మంగళస్నానాలు, డ్యాన్స్‌లు ఇవన్నీ అవసరమైన వారికి అవసరం కావోచ్చు. అవసరం లేనివారు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ధనంతో ముడిపడి ఉన్న వ్యవహారం. ఏదైనా స్నేహపూరిత జీవితం కొనసాగిస్తేనే ఆనంద జీవన మకరందం. మనిషి మనిషి ప్రేమించాలి. చెట్టును ప్రేమించాలి. గుట్టను ప్రేమించాలి, పిట్టను ప్రేమించాలి. ఆఖరికి భూమిని ఆకాశాన్ని ప్రేమించాలి. ప్రకృతి ప్రకృతిగా జీవించడంతోనే జీవన సుగంధం వెల్లివిరుస్తుంది. ఎప్పుడూ సృజనాత్మక దిశలో ఆలోచించాలి. అందులోనూ తార్కిక దృష్టి హేతువు అందేదాన్ని ఆచరించాలి. ఉత్సవాలు పండుగలు సంప్రదాయాలు కొనసాగించడం వలన మనస్సు ఉల్లాసం అవుతుంది.
అనవరం దేవేందర్
94407 63479