అంతరంగం:నృత్యకళా వెలుగు ఆచార్య రజనిశ్రీ
ఆచార్య గాజుల రజనిశ్రీ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాట్యాచార్యులు. గత వారం మే 28న ఆయన 15వ వర్ధంతి .రిగింది. తెలంగాణ తెలుగు కళారంగం ఆయనను స్మరించుకోవాల్సిన సమయం ఇది. 63 ఏండ్ల జీవితంలో 50 ఏండ్లు కళారంగానికే అంకితం చేసిన ధన్యుడు.
ఆచార్య గాజుల రజనిశ్రీ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాట్యాచార్యులు. గత వారం మే 28న ఆయన 15వ వర్ధంతి .రిగింది. తెలంగాణ తెలుగు కళారంగం ఆయనను స్మరించుకోవాల్సిన సమయం ఇది. 63 ఏండ్ల జీవితంలో 50 ఏండ్లు కళారంగానికే అంకితం చేసిన ధన్యుడు. రజనిశ్రీ కవి, రచయిత, నాట్యాచార్యుడు, నృత్యకళాకారుడు, నటుడు, దర్శకుడు. ఏక కాలంలో అన్నిరంగాలలో ఆరితేరిన తపస్వి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రజనిశ్రీ 1944లో సిరిసిల్లలో జన్మించారు.
వీరి తల్లిదండ్రులది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి.చేనేత కుటుంబానికి చెందిన వారు బతుకుతెరువు కోసం సిరిసిల్లలో కొంతకాలం పని చేశారు. ఆరుగురు సంతానంలో రజశ్రీ అక్కడే జన్మించారు. ప్రాథమిక విద్యను హుస్నాబాద్‌లోనే అభ్యసించారు. అక్కడే ఉద్యోగం చేశారు. నృత్య కళారంగంలోనూ అక్కడే స్థిరపడ్డారు. హుస్నాబాద్, హన్మకొండలో ఆయన విద్యాభ్యాసం సాగింది. తోటపల్లిలోనే 1964లో ఉపాధ్యాయునిగా ఆయనకు మొదటి పోస్టింగ్. అటు తర్వాత వివిధ గ్రామాలలో పని చేసి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో జనవరి 31 ,2002లో ఉద్యోగ విరమణ చేశారు. రజనిశ్రీ ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్తులలో సాంస్కృతిక చైతన్యం వెల్లువెత్తేది.
ఇంతింతై వటుడింతై
రజనిశ్రీకి బాల్యం నుంచే కళల పట్ల, సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఆయన ఇష్టాన్ని గమనించి హుస్నాబాద్‌కు చెందిన గంగం తిరుపతిరెడ్డి 1955లో హైదరాబాద్ ఆకాశవాణిలో పాటలు పాడించారు. ఇదే క్రమంలో ప్రఖ్యాత సాహితీవేత్త మలయశ్రీ పరిచయంతో సాహిత్య అభిరుచి మొదలైంది. ఆయనలో ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. ప్రఖ్యాత నాట్యాచార్యుడైన నటరాజ రామకృష్ణ దగ్గరికి వెళ్లి ఆయన శిష్యరికంలో ఆంధ్ర నాట్యం నేర్చుకున్నారు. తాను పనిచేసిన హుస్నాబాద్ పోతారం (ఎస్), కట్కూర్, తోటపల్లి పాఠశాలలలో విద్యార్థులకు ఆంధ్ర నాట్యం నేర్పించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో ప్రదర్శనలు ఇస్తూ పర్యటించారు. పండిట్ అంజిబాబు వద్ద కథక్ నృత్యాన్ని నేర్చుకున్నారు. జానపద పాటల మీద సొంతంగా నృత్యరూపకాలు రూపొందించి ప్రదర్శించేవారు. ఈ నృత్యంలో ఎందరో శిష్యులు ప్రశిష్యులు తయారై నేడు జాతీయస్థాయిలో కీర్తి గడిస్తున్నారు. మలయశ్రీ ప్రభావంతో నాటకాల రచన ప్రారంభించారు.
నటనలోనూ మేటిగా ప్రఖ్యాతి పొందారు. వేమన నాటికలో దేవదాసి పాత్రను పోషించి వందల ప్రదర్శనలు ఇచ్చారు. నాటక దర్శకులు పార్థసారథితో కలిసి పని చేశారు. నాటక రంగంలో ఎన్నో పౌరాణిక, సాంఘిక, చారిత్రిక నాటకాలలో స్త్రీ వేషధారణతో అందరి ప్రశంసలు అందుకున్నారు. 'శ్రీకృష్ణ తులాభారం'లో సత్యభామ, రుక్మిణి, నళిని, 'సత్య హరిశ్చంద్ర'లో చంద్రమతి, 'రామాంజనేయ యుద్ధం'లో శాంతిమతి, అల్లూరి సీతారామరాజులో సీత, వరూదినీ ప్రవరాఖ్యలో వరూధిని పాత్రలు పోషించారు. 1970-80 దశకంలో రజనిశ్రీ అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తన దర్శకత్వంలో పల్లె పడుచు, పాలేరు, విధివ్రాత, పునర్జన్మ నాటికల వందల ప్రదర్శనలు ఇచ్చారు. బ్రహ్మంగారి నాటకంలో నటించారు. రజనిశ్రీ స్వయంగా వరూధిని ప్రవరాఖ్య, మోహినీ భస్మాసుర, నరకంలో న్యాయస్థానం, నాకు చదువు వచ్చింది, చీకటి తెరలు నాటకాలు రచించి దర్శకత్వం వహించారు.
ఎందరెందరో శిష్యులు
రజనిశ్రీకి నృత్యం, నాటకం కాకుండా కవిత్వ రచనలో, లలిత గీతాల రచనలలో ప్రావీణ్యం ఉన్నది. 'రజనిశ్రీ చైతన్య గీతాలు' పేరుతో పాటల పుస్తకం వెలువరించారు. నాట్యకళా వైభవం పుస్తకాన్ని రచించారు. 'కరీంనగర్ జిల్లా కళాకారుల చరిత్ర' పుస్తకాన్ని 2005 తన 50 ఏళ్ళ కళా జీవితోత్సవం సందర్భంలో రచించి వెలువరించారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కళారంగంలో ఆనాటికి ఉన్న అందరి వివరాలు సేకరించి ముద్రించారు. 1981లో కళాజ్యోతి కల్చరల్ అసోసియేషన్, 1997లో హుస్నాబాద్ లో 'నటరాజ నృత్య కళాక్షేత్రం' స్థాపించి ఎందరినో నటులను నృత్యకళాకారులను తీర్చిదిద్దారు. ఆయన ఇల్లు ఒక కళాక్షేత్రం. ఇల్లంతా నృత్యాల సందడి. తన చుట్టూరా ఎల్లవేళలా కళాకారులే ఉండేవాళ్లు.
రజనిశ్రీకి తెలంగాణలోనే గొప్ప కళాకారుడిగా, నాట్యాచార్యులుగా పేరుగాంచారు. సమయపాలన, గురువుల పట్ల గౌరవభావం, శిష్యుల పట్ల ప్రేమపూర్వక వాత్సల్యం, క్రమశిక్షణ ఉత్తమ సంస్కారం ఇంకా కొత్తగా నేర్చుకోవాలనే ఆకాంక్షలు ఎంత ఎదిగినా నా వెల్లడయ్యేవి. జీవితం మొత్తం కళాసాహిత్య సాంస్కృతిక విద్యా రంగానికి అంకితం చేసిన గొప్ప మనిషి రజనిశ్రీ. తన సహధర్మచారిణి శ్రీమతి సత్యవతి నిరంతరం ఓపికతో తోడ్పాటు అందిస్తేనే ఇంతలా ఎదిగానని రజనిశ్రీ ఎన్నోమార్లు స్వయంగా ప్రకటించారు. ఆయనకు ముగ్గురు కుమారులు. జీవీ శ్యాంప్రసాద్ కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్, గాజుల హరీశ్‌కుమార్ హైదరాబాద్ హైకోర్ట్ న్యాయవాది, క్రాంతికుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జీవితంలో స్థిరపడ్డారు. రజినిశ్రీ పేరిట వారి కుమారులు సాహిత్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు. 2007 మే 28న పరమపదించారు. రజనిశ్రీ కళాజీవితం యావత్ సృజనకారులకు స్ఫూర్తిదాయకం.
అన్నవరం దేవేందర్
94407 63479