పిల్లలతో ఉన్న మజాయే వేరు

Update: 2022-05-22 18:30 GMT

రెండు మూడేండ్ల పసి పిల్లలతో కల్సి మనమూ పిల్లలమైతే ఆ మానసిక ఆనందమే వేరు. పిల్లల నవ్వులు, పిల్లల చిన్నిచిన్ని మాటలు, పిల్లల చూపులు, పిల్లల ప్రతీ చేష్టకూ ఒక సంకేతం ఉంటది. ఒక అర్థం ఉంటది. ఒక కోరిక ఉంటది. ఆ కోరిక నెరవేర్చకపోతే అలగడం. నిరసన వ్యక్తం చేయడం ఉంటది. కోపం ఎక్కువైతే వస్తువులు విసిరివేయడమూ ఉంటది. దీనిని కుటుంబ సభ్యులు వారి సైకాలజీతో పట్టుకోవాలి. పసిపిల్లల సంజ్ఞలు పట్టుకోవడం తల్లులకే ఎక్కువ తెలుస్తుంది. అటాచ్‌మెంట్ ఉన్న తండ్రులకు కొంత తెలుస్తుంది. ఇదివరకు తల్లులైన వాళ్లకూ తెలుస్తుంది. పిల్లలను ఆడించడం కూడా అందరికీ కాని పని. ఇది కొందరు ఓపిక వంతులకు, దాంతోనే పిల్లల ఆనందాన్ని షేర్ చేసుకున్నవాళ్లకు సాధ్యం అవుతుంది.

ఇప్పటి తరం పిల్లలు వేరు. పూర్తిగా అన్ని తెల్సినవాళ్లలాగే పెద్దల అనుకరణను అవలీలగా పట్టుకుంటున్నరు. సంవత్సరం లోపు పిల్లలు తల్లి, తండ్రి, తాత, అమ్మతో పాటు కుటుంబాన్ని గుర్తుపడతరు. చిన్నగా నవ్వుతరు. ఎత్తుకోవాలంటే రెండు చేతులు పైకి చూపిస్తరు. లిఫ్ట్ దగ్గరకు, వాకిలి, గేట్, పూల మొక్కల దగ్గరికి తీసుకుపోవాలంటే అటు చేయి చూపించి 'ఊ.. ఏ' అంటారు. దాన్ని అర్థం చేసికొని తీసుకపోవాలి. అట్లనే మాటలు నేర్పడం కూడా పెద్ద పని. ఆడపిల్లలకు తొందరగా మాటలు వస్తున్నయి. మగ పోరగాండ్లు రెండేడ్ల దాకా తక్కువనే పలుకుతున్నరు. పిల్లలకు ఆనందం కల్గితే నవ్వే నవ్వును ఎన్నిసార్లు చూసినా ఆనందమే. ఎవరికైనా బీపీ ఉంటే వెంటనే దిగిపోవుడే. పిల్లలు తమకు ఇష్టమైనవాళ్లనే ఎత్తుకొమ్మంటరు. నచ్చనివాళ్లు, కొత్తవాళ్ల దగ్గరికి అస్సలు పోరు. వాళ్లకు ఎందుకు నచ్చుతదో, ఎందుకు నచ్చదో వాళ్లకే తెలుస్తది. కొందరు కొత్తవాళ్లు వచ్చి చెయ్యి చాపితే పిల్లలు తల్లి మొకం చూసి, తానూ వాళ్లను చూసి నవ్వుతూ పలకరిస్తుందా? 'పో నానీ, అంకుల్ పో' అంటుందా? అని గమనిస్తరు. తల్లి మాటలను బట్టి వాళ్ల నిర్ణయం ఉంటది.

అన్నం తినిపించడం

పిల్లలకు అన్నం తినిపించడం ఒక పెద్ద కథ. సాధారణంగా తినరు. పూర్వ కాలంలో చందమామను చూపెడుతూ 'అగో అగో' అని పిల్లాడు నోరు తెర్వంగానే నోట్లో అన్నం ముద్దపెట్టేవాళ్లు. ఈ కాలం అలా కాదు, ఏదైనా వీడియోలో పాట చూపించాలి. అప్పుడు వాళ్లకు నచ్చిన పాటలు వింటూ మనసు అటు లగ్నం చేస్తే ఇటు నోట్లో ముద్ద పెట్టాలి. కొందరు పిల్లలకు ఆరుబయట, మరికొందరు అటుఇటూ తిప్పుతూ వినిపిస్తారు. తల్లి పాలైతే వాళ్లే పట్టి పట్టి తాగుతారు కానీ, ఆవుపాలు, బోర్న్‌విటా పాలు తాగాలంటే బహు కష్టం.

వాళ్లు ఎట్ల తాగుతరో గమనించి తాగించడమే. ఈ తరం పిల్లలు కూడా సెల్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నరు. నిజానికి ఆ రేడియేషన్‌కు దూరం ఉంచాలి గానీ, అది కాని పని అవుతుంది. ఏడాదిన్నర పిల్లడు కూడా గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోలు చూస్తున్నడు. తనకు తెల్సిన ఫొటో కనపడగానే నవ్వుతడు. 'నాని.. తాత' అనుడు కన్పిస్తది. దాని పక్కనే వీడియో గుర్తు కనిపిస్తే దాన్ని నొక్కి చూసే నేర్పు కూడా వచ్చింది, టీవీలో పిల్లల పాటలు చూడటం వాటినే వినడం వల్ల తల్లులు ఏదైనా పని చేసుకునే వీలు కల్గుతుంది.

అనేక సంకేతాలు

పిల్లలకు ఒక భాష ఉంటది. ఆ భాషను పట్టుకుంటే వాళ్లతో మరింత ఆడుకోవచ్చు. వాళ్లకు కొన్ని సంజ్ఞలు ఉంటయి. సంకేతాలు ఉంటయి. వాటిని పట్టుకోవాలంటే పెద్దలకూ పిల్లల మనసు ఉండాలి. ఈ తరం పిల్లలు ఎక్కువగా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నరు. ఇప్పుడు 9,10 సంవత్సరాల వయసున్న బాలలకు తప్పకుండా డాన్స్ వస్తుంది. కదిపి చూస్తే డీజే టిల్లు పాట మీద నడుం ఊపుతరు. ఎందుకంటే ఇంటింటికీ టీవీ వచ్చి అన్నీ నేర్పిస్తున్నది. కుర్‌కురేలు తినిపిస్తది. నూడిల్స్ తినిపిస్తది. బిస్కెట్లు తినేందుకు ప్రేరణగా అందమైన అడ్వర్‌టైజ్‌మెంట్ చూపిస్తది.

తినే వస్తువులలో మైదా పిండి ఉంటది. ఆహారం నిల్వ ఉంచే రసాయనాలు ఉంటయి. దాంతో ఆరోగ్యం చెడిపోతది. పిల్లలకు పడనివి ఏవీ కూడా పెట్టకుండా ఉండలేని స్థితి వచ్చింది. అవే కావాలని మారం చేస్తారు. పండి బొర్లుతరు. ఈ బాధకు అవి కొనిస్తాం. తర్వాత అల్లరి చేస్తే ఏదైనా సాధించుకోవచ్చునని అవగతం అయిపోతది. గతంలో పిల్లలు ఎట్ల పడితే అట్లనే పెరిగేవారు. ఈ తరం అతి సుతారంగా, గావురంగా పెరుగుతున్నరు. గావురం పెరగాల్సిందే గానీ, మరీ సున్నితత్వం అవుతుంది.

ఇప్పటి ప్రపంచమే విభిన్నం

పిల్లలను పెంచడం అనేది గొప్ప ఓపిక. నిజానికి అదొక కళాత్మకత. పిల్లలు ఉన్న ఇల్లు ఆనందాల పొదరిల్లు. వాళ్లు పుట్టి బోర్ల పడటం, అలగడం, చిన్న చిన్న అడుగులు వేయడం, నవ్వడం, ఏడ్వడం, దశలు దశలు దాటుకుంటు మానవునిగా ప్రయాణం మెదలుపెడతరు. ఈ అన్ని దశలలోనూ మనం ఎలా పెరిగాం? ఎట్లా మనల్ని పెంచితే ఇంతవాళ్లం అయ్యామనే సోయి కూడా ఉంటది. ఇప్పుడు తాతల పాత్రలో ఉన్నవాళ్లు అంటే 1980, 90 ప్రాంతాలలో తండ్రుల పాత్ర పోషించినవాళ్లు తమ పసి పిల్లలను ఇంత ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలను చూసి ఆ గ్యాప్ పూరిస్తున్నరు.

ఆ తరంలోని పనులు, ఒత్తిడిలు వేరు. ఈ తరం అంత యంత్ర, సాంకేతిక, నాగరికత వేరు. అదీగాక అంతకు ముందు తరంవాళ్ల పిల్లలకు తండ్రుల పట్ల కొంచెం గ్యాప్ ఉన్న కుటుంబాలు ఉంటయి. ఇప్పుడున్న పసితనంకు అదీ లేదు. అంతా కల్సి ఆడుకోవడం, మారం చేసి సాధించుకోవడం. అంటే ఇప్పటి ప్రపంచం వేరు, అప్పటి ప్రపంచం వేరు. ఇప్పటి పిల్లలు డ్యాన్స్ పాటలతో పాటు అందరీకి చిత్రకళ మీద ఆసక్తి ఎక్కువ ఉంది. ప్రతి పాఠశాలలో బొమ్మలు వేయడం కలర్స్ నింపడం, సోషల్ వర్క్ నేర్పడం ఎక్కువ చేస్తున్నరు. ఏది ఏమైనా పిల్లలతో ఆడుకుంటే పిల్లలమై పోవచ్చు.

(మా మనవడు హాలుడుకు అంకితం)


అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

పిల్లలంటే!