'ఎన్నీల ముచ్చట్లు' నగరంలో గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుండంతో తెలంగాణలోని అన్ని వర్గాలవారికి తెలిసిపోయింది. ఈ పున్నమికి ఎవరి ఇంటి మీద కవిత్వం? అని వాట్సప్ గ్రూప్‌లో ఎదిరిచూస్తారు. ఇక ఎవరి ఇంటి మీదనైతే ఎన్నీల ముచ్చట్లు ఉంటాయో ఆ కవి దానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. హోస్ట్ అంటే భోజనాలు ఏమీ ఉండవు. మక్క గుడాలు, సర్వపిండి, సమోసాలు, ఉప్మా ఇట్లాంటి ఉపాహారమే ఉంటుంది. ఒక యాబై నుండి డెబ్బై మంది వరకు కవులు తప్పని సరిగా వస్తారు. ఈ ముచ్చట్ల వలన కొంతకాలం కవిత్వం పట్ల అభిరుచి ఉండి రాసి ఆగిపోయినవాళ్లు, గృహిణులు, ఉద్యోగులు ఎంతో మంది తిరిగి సాహిత్యంలోకి పున: ప్రవేశం చేశారు.
కరీంనగర్‌లో నిండు పున్నమినాడు పండు వెన్నెలలో అక్షరాలు కవిత్వ వాక్యాలై పరవళ్లు తొక్కుతున్నయి. ప్రతి పౌర్ణమి రోజు నగరంలో ఒక కవి రచయిత లేదా సాహిత్య అభిమాని ఇంటి డాబా మీద కవులు సమావేశం అవుతారు. కవిత్వం చెప్పుకుంటారు. ఇది గత తొమ్మిది సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతున్న కవిత్వ కార్యాచరణ. దీని పేరు 'ఎన్నీల ముచ్చట్లు' తెలుగు సాహిత్యంలో పండు వెన్నెల కవిత్వం ఒక మైలురాయి. ఒక్క కరోనా కాలంలో మినహా గత 107 నెలలుగా కవులు వారివారి ఇండ్లలోనే కలుసుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో మాత్రం జూమ్ వేదిక మీద జూమ్ ముచ్చట్లు అయినవి. 21 ఆగస్టు 2013 రాఖీ పున్నమి రోజున మొదలైన ఎన్నీల ముచ్చట్ల ప్రస్థానం నగరంలోని దాదాపు అందరు కవులు, రచయితల ఇండ్ల మీద కవి సమ్మేళనాలు జరిగాయి.
సమ్మేళనం అంటే సభా వేదిక, స్టేజీ ఏమీ ఉండదు. ఆ ఇంటి వాతావరణానికి అనుగుణంగా ఇంటి డాబా పైన అందరూ కిందనే గుండ్రంగా కుర్చుంటారు. సభాధ్యక్షుడు ముందుగా కొత్తగా వచ్చిన జూనియర్ కవి నుంచి కవిత్వం చదివేందుకు ఆహ్వానిస్తారు. తాను తన కొత్త కవిత చదవాలి. ఆ తర్వాత ఒక సీనియర్ కవి దానిపై అవసరమైన విశ్లేషణ కూడా చేస్తారు. ఇదంతా మరో నెల పున్నానికి పుస్తకంగా వస్తుంది. చిన్న బుక్‌లెట్‌లాగా ఆర్భాటం లేకుండా నలుపు తెలుపులో వస్తుంది. ఇట్లా దాదాపు 25 సంచికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి కొంతకాలం వచ్చాయి. తర్వాత ప్రత్యేక సంపుటాలు అంతకు ముందు ఎన్నీల ముచ్చట్లు కవిత్వం కలుపుకొని వచ్చినయి. ఎన్నీల ముచ్చట్ల పున్నమికి ప్రత్యేక అతిథులుగా రాష్ట్రం నుంచి ఎంతోమంది సాహిత్యకారులు వచ్చి నవ కవులను ప్రోత్సహించారు. ఈ ఎన్నీల కవిత్వం ప్రభావం ముంబాయి, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాలలో పడింది. కొంతకాలం అక్కడా కొనసాగింది.
అంశం ఏదైనా సరే
'ఎన్నీల ముచ్చట్లు' కవిత్వం ఏ అంశం మీదనైనా చెప్పుకోవచ్చు. ప్రత్యేక సంచికలు బాల సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బుద్ధుని జయంతి, వనరుల విధ్వంసం, తెలంగాణ ఆవిర్భావం, సినారె స్మృతి, వడ్నాల కిషన్ స్మృతిగా వచ్చాయి. కొన్ని సంచికలు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వైతాళికుల మీద వెలువడ్డాయి. అట్లా పీవీ నరసింహారావు, శ్రీ భాష్యం విజయసారథి, బొమ్మదేవర హేమాకుమారి, నలిమెల భాస్కర్, బోయినపల్లి వెంకటరామారావు, జీవగడ్డ విజయ్‌కుమార్ మీద ఆయా సందర్భాలలో వెలువడ్డాయి.
గత రెండేండ్లుగా ఎన్నీల ముచ్చట్లు- 2020, ఎన్నీల ముచ్చట్లు -2021 పేర వార్షిక కవిత్వం పుస్తకాలు వెలువడుతున్నాయి. కరీంనగర్‌లో 'ఎన్నీల ముచ్చట్లు' నిర్వహణ తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ తీసుకుంటే, పుస్తక ప్రచురణ 'సాహితీ సోపతి' తీసుకుంటుంది. తెరవే, సాహితీ సోపతి బృందంలో చేస్తున్న ఈ వినూత్న సాహిత్య కార్యక్రమం డాక్టర్ నలిమెల భాస్కర్, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, బూర్ల వేంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, కూకట్ల తిరుపతి, సి.వి కుమార్ మార్గ నిర్దేశనం చేస్తున్నారు.
'ఎన్నీల ముచ్చట్లు' నగరంలో గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుండంతో తెలంగాణలోని అన్ని వర్గాలవారికి తెలిసిపోయింది. ఈ పున్నమికి ఎవరి ఇంటి మీద కవిత్వం? అని వాట్సప్ గ్రూప్‌లో ఎదిరిచూస్తారు. ఇక ఎవరి ఇంటి మీదనైతే ఎన్నీల ముచ్చట్లు ఉంటాయో ఆ కవి దానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. హోస్ట్ అంటే భోజనాలు ఏమీ ఉండవు. మక్క గుడాలు, సర్వపిండి, సమోసాలు, ఉప్మా ఇట్లాంటి ఉపాహారమే ఉంటుంది. ఒక యాబై నుండి డెబ్బై మంది వరకు కవులు తప్పని సరిగా వస్తారు.
ఈ ముచ్చట్ల వలన కొంతకాలం కవిత్వం పట్ల అభిరుచి ఉండి రాసి ఆగిపోయినవాళ్లు, గృహిణులు, ఉద్యోగులు ఎంతో మంది తిరిగి సాహిత్యంలోకి పున: ప్రవేశం చేశారు. కళాశాల విద్యార్థులు, బాలబాలికలు కూడా ఇందులో చేరి ఈ తొమ్మిది ఏండ్లలో కవులుగా ఎదిగి కవిత్వ సంపుటాలు వెలువరిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రోత్సహ వాతావరణం దొరుకుతుంది. కవిత్వం అంటే కేరాఫ్ చిరునామా కరీంనగర్ అయింది. అది సినారె వల్లనో లేదా అలిశెట్టి వల్లనో కానీ కరీంనగర్ కవిత్వం కనపడని పత్రిక ఉండటం లేదు ఈ పరంపరను ఎన్నీల ముచ్చట్లు ముందుకు తీసుకపోతుంది. (16 మే బుద్ధ పౌర్ణమి రోజు 9 వ వార్షిక 'ఎన్నీల ముచ్చట్ల' పండుగ కరీంనగర్ జ్యోతిబా పూలే (సర్కస్ గ్రౌండ్స్) మైదానంలో జరుగుతుంది.)
అన్నవరం దేవేందర్
94407 63479