కవిత్వం అంటే ఏమిటి ? కవిత్వం ఎలా రాయాలి? కవిత్వానికున్న లక్షణాలేవి? పూర్వకవుల నుండి ఆధునిక కవుల వరకు కవిత్వ రచనా రీతులను, మెళకువలను కొత్త కవులకు తెలియజేస్తూ, వాటితోపాటు కవితా ప్రపంచపు ధోరణులను వివరిస్తూ, అరటిపండు ఒలిచినంత సునాయాసంగా 'దిక్సూచి'ని కరదీపికగా మలిచారు ప్రముఖ కవి దాస్యం సేనాధిపతిగారు. చక్కని చిక్కని భావ కవిత్వంలో ప్రణయ సంకీర్తనం ఎలా పండించవచ్చో తెలియజేశారు. మహిళావాద కవిత్వం, మానవతావాదంతో, సామాజిక అంశాల మీద అభ్యుదయ భావాలతో ఉత్తమ కవిత్వం ఎలా రాయవచ్చనేది ఈ పుస్తకంలోని 24 వ్యాసాలలో వివరంగా తెలియచేసారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిలక్ ప్రణయ, భావ కవితలు హృదయాలను ఎలా ఆకట్టుకుంటాయో కండ్లకు కట్టినట్లు చూపించారు. 'లవ్ సాంగ్స్ ఆఫ్ విద్యాపతి' అనే ఆంగ్ల అనువాద పుస్తకాన్ని డా.ఎన్.గోపీ మూలం దెబ్బతినకుండా 'విద్యాపతి ప్రణయ గీతాలు' పేరిట తెలుగులో అనువదించిన తీరును వర్ధమాన కవులకు సోదాహరణంగా తెలియజేయడంలో దాస్యం సేనాధిపతి గారి ప్రతిభ ఎంతో శ్లాఘనీయం.
అనేక కవులను ఉదహరించి
.శ్రీశ్రీ, డా. దాశరథి, ప్రజాకవి కాళోజీ, అలిశెట్టి ప్రభాకర్ కవితలను ఔచిత్యంగా ఉదహరించి కవులలో నవచైతన్యపు ఊర్మిని నింపే ప్రయత్నం చేశారు. డా.సి.నారాయణరెడ్డి, డా.నందిని సిధారెడ్డి తెలంగాణ భాష, యాసలో దాగిన కవితా మాధుర్యాన్ని తెలియపరిచి, ప్రాంతీయ వాడుక భాషలో కూడా ఉత్తమ కవిత్వం ఎలా రాయవచ్చో చెప్పారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, కత్తి పద్మారావు, జన్ను లక్ష్మి ,ఇంకా ఎంతోమంది కవుల కవితలను, సందర్భోచితంగా ఉదహరించిన తీరు అమోఘం. కవిత్వమంటే ఆషామాషీ పని కాదు, రెండు పొట్టేళ్ల కొట్లాట అసలే కాదు, కవిత్వానికి ఏ వస్తువు అనర్హం కాదనే
మాటలను నిజం చేస్తూ..చక్కని పదబంధాలతో కవితకు ఎలా పుష్టి చేకూర్చవచ్చో వివరించారు. శ్రీదాస్యం లక్ష్మయ్య నేతృత్వంలో నడుపబడే 'నేటి కవిత' వాట్సాప్ సమూహంలోని సీనియర్ కవుల కవితలను విశ్లేషించి, సమన్వయించి చెప్పడంలో దాస్యం సేనాధిపతి గారి కృషి కొనయాడతగినది. విమర్శకులుగా ఎదిగి దాదాపు 1200 పుస్తకాలకు సునిశిత సమీక్షలు, విశ్లేషణావ్యాసాలు రాసిన అనుభవంతో.. రచించిన ఈ 'దిక్సూచి' కవులను దినదిన ప్రవర్దమానంగా ఎదిగేలా చేయడమే కాకుండా, పచ్చని కవిత్వాన్ని పండించే కవితా హాలికులుగా కవితా బీజాంకురాలను మొలకెత్తిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎంతో శ్రమకోర్చి వారు రచించిన ఈ పరిశోధనాత్మక, ప్రయోగాత్మక కరదీపిక కవితా ప్రామాణికాల దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రతులకు:దాస్యం సేనాధిపతి9440525544పేజీలు 198, వెల 200/-
సమీక్షకులు
సావిత్రి రంజోల్కర్, నవీమొంబై
98334 97812