సోషల్ మీడియా.. నకిలీ ఎక్స్‌పర్ట్స్!!

మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా చాలామంది జీవితంలో భాగమైపోయింది. వేగంగా సమాచారాన్ని అందిపుచ్చుకోవడం, పలు విషయాలపై అవగాహన పెంచుకునేందుకు తోడ్పడుతోంది.

Update: 2023-01-04 04:23 GMT

దిశ, ఫీచర్స్: మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా చాలామంది జీవితంలో భాగమైపోయింది. వేగంగా సమాచారాన్ని అందిపుచ్చుకోవడం, పలు విషయాలపై అవగాహన పెంచుకునేందుకు తోడ్పడుతోంది. అయితే అదే సందర్భంలో కీడు కూడా జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదిక పదునున్న కత్తివంటిది. కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేసుకుంటే మేలు జరుగుతుంది. కానీ కత్తి అనుకోకుండా గుచ్చుకున్నా, దానితో ఎవరైనా దాడి చేసినా హాని జరుగుతుంది. అంటే ఒక వస్తువును ఉపయోగించే తీరును బట్టి మంచి-చెడు ఉంటాయి. నేడు సోషల్ మీడియా కూడా అంతే. అందులోనూ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. కానీ ఎవరు, ఎలా, ఎలాంటి కంటెంట్‌ను ఉపయోగించుకుంటే అలాంటి ప్రభావాలు, ఫలితాలు కనిపిస్తాయి.

సోషల్ మీడియాలో నకిలీ నిపుణులు..

ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్, టిక్‌టాక్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అన్ని రకాల కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. కానీ నకిలీ కంటెంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో స్వయం ప్రకటిత మేధావులు, డేటింగ్ నిపుణులు, రిలేషన్‌షిప్ సలహాదారులు, థెరపిస్టులు పుట్టుకొస్తున్నారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను తమ స్వార్థానికి వాడుకుంటున్నారు.

సబ్జెక్ట్ పరమైన కోర్సులు చదవకుండానే, అలాంటి అర్హతలు సంపాదించకుండానే రిలేషన్‌షిప్ నిపుణులుగా చలామణి అవుతూ.. తోచిన సలహాలిస్తూ.. ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అందుకే ఇలాంటి సలహాలు పాటించి.. జీవితాన్ని అంధకారం చేసుకునే ముందు ఆలోచించాలని సోషల్ మీడియా యూజర్స్‌కు సూచిస్తున్నారు నిపుణులు. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సమాచారం అంతా కరెక్ట్ అనే ధోరణి తగదని హెచ్చరిస్తున్నారు.

బిల్డప్స్.. ట్రిక్స్..

ఎంతోమందిని అలరించే అద్భుతమైన సోషల్ మీడియా వేదికల్లో ఇన్‌స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ బాగా గుర్తింపు పొందాయి. క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు జీవనోపాధి కలిగిస్తున్నాయి. అందుకే విభిన్నమైన పోస్టులు, కంటెంట్‌తో ఫాలోవర్స్‌ను పెంచుకోవాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అవగాహన లేమితో ఉన్నా సరే.. మోటివేటర్స్‌గానో, డేటింగ్ నిపుణులుగానో ప్రకటించుకుంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. కాగా ఇలాంటి వారి బిల్డప్ మామూలుగా ఉండదు అంటున్నారు మోటివేటర్ రిషబ్ మెహగా. నకిలీ నిపుణులు సోషల్ మీడియా వేదికగా రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తుంటారు. పైగా తామిచ్చే సలహాలకు, ఆడియో, వీడియాలు వినేందుకు, చూసేందుకు రేట్లు కూడా ఫిక్స్ చేస్తుంటారు.

ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా సొమ్ముచేసుకుంటుంటారు. ఇక ఇందుకోసం వేలు, లక్షలు ఖర్చుపెట్టి చివరకు మోసపోయిన బాధితుల సంఖ్య దాదాపు అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికలలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటోంది. సైబర్ క్రైమ్ నిపుణులు, పోలీసులు కూడా మీడియా ముఖంగా ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్తుండటం మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. కానీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం సోషల్ మీడియానే సర్వస్వంగా బతుకుతున్న వారు అవగాహనా రాహిత్యంతో మళ్లీ మళ్లీ మోసపోతుండటం శోచనీయం.

ఫాలోవర్స్‌‌ను చూసి మోసపోవద్దు..

స్వయం ప్రకటిత థెరపిస్టులకు సోషల్ మీడియాలో కొదువ లేదు. పైగా వీరికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారు. కేవలం ఇది మాత్రమే చూసి విజిటర్స్.. నిజంగానే వారు గొప్ప నిపుణులు అనుకుంటే పొరబడినట్లే. ఫాలోవర్స్ పెరగడానికి నిపుణులే అయ్యుండనవసరం లేదు. వీక్షకుల మనసును కదిలించే ఏవైనా ట్రిక్కులు ప్రయోగిస్తే ఫాలోవర్స్ పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నవారందరూ అర్హత కలిగిన నిపుణులు అని ఊహించుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే వాస్తవాలపై ఆధారపడటం మంచిదని చెబుతున్నారు. ఫాలోవర్స్ లేదా వీక్షకులు అడిగే ఏ ప్రశ్నకైనా తమదైన శైలిలో ఠక్కున సమాధానం చెప్తుంటారు. సలహాలు ఇస్తుంటారు. అవి పాటించడంవల్ల రొటీన్‌లో భాగంగా కొందరికి గుడ్ ఇంప్రెషన్ ఏర్పడవచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు.

కాపీ కంటెంట్.. నకిలీ ఎకౌంట్స్..

ఫాలోవర్స్‌ను పెంచుకుని డబ్బులు సంపాదించుకునే క్రమంలో చాలా ఎకౌంట్స్‌లో కాపీ కంటెంట్ కనబడటం గుర్తించే ఉంటారు. ఇలాంటి పేజీలను ఫాలో అయి.. టైమ్ వేస్ట్ చేసుకోవడం సరైనది కాదంటున్నారు నిపుణులు. పైగా మరికొందరు నకిలీ అకౌంట్ సృష్టించి ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆన్‌లైన్‌లో ఏదైనా కొనేటప్పుడు.. పేమెంట్ చేసేటప్పుడు.. ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవడం మంచిది. సో.. బీ కేర్ ఫుల్ !

Read More...
                      భయపెడుతున్న సీతాకోక చిలుక


Tags:    

Similar News