Youth : బాబోయ్ బాధ్యతలు మోయలేం..! చిన్న విషయాలకే ఆందోళన చెందుతున్న యూత్!!
Youth : బాబోయ్ బాధ్యతలు మోయలేం..! చిన్న విషయాలకే ఆందోళన చెందుతున్న యూత్!!
దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా ఉంటారనేది అతని లేదా ఆమె మాటలను బట్టి అంచనా వేయలేం అంటున్నారు నిపుణులు. చేసే పనులను బట్టి, నిర్వర్తించే బాధ్యతలను బట్టి మాత్రమే కచ్చితమైన నిర్ణయానికి రాగలమని చెబుతున్నారు. నిజానికి మన చుట్టూ సమాజంలో ప్రజలు తమ తమ బాధ్యతల్లో నిమగ్నమవడం గమనిస్తుంటాం. అయితే ఇంట్రెస్ట్ లేకనో, ఎక్స్‌పీరియన్స్ లేకనో, పలువురు తమ బాధ్యల నిర్వహణలో విఫలమౌతుంటారు. సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ‘‘వామ్మో బాధ్యతలు నెరవేర్చడం చాలా కష్టం’’ అని ఆందోళన చెందుతుంటారు. కాగా ప్రస్తుతం ఈ కేటగిరీలో జెన్ జీ(Gen Z )లే అధికంగా ఉంటున్నారని ఉంటున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదెలాగో చూద్దాం.
64 శాతం మందికి అది కష్టమే..
చాలా మంది మాటల్లో యాక్టివ్‌గా ఉంటారు. సలహాలు, సూచనలు బాగానే ఇస్తుంటారు. పనిలో, కుటుంబ పోషణలో, సవాళ్లను అధిగమించడంలో, తమ వంతు బాధ్యత నిర్వర్తించడంలో మాత్రం తడబడుతుంటారని, కొందరు భయపడి తప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఏజ్ గల జెన్ జీ(Gen Z)లలో ఇలాంటి వారు 64 శాతం మంది ఉండగా, 27 నుంచి 43 ఏండ్ల మధ్య గల మిలీనియల్స్‌లో సుమారు 38 శాతం మంది ఉంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ నిర్వహణలో సక్సెస్ సాధించలేక వీరు ‘బర్నవుట్’ అవుతున్నట్లు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు.
అవగాహన ఉన్నా అంతే..
రియల్ వరల్డ్ ఎక్స్ పీరియన్స్ ఉంటున్నప్పటికీ, ఆయా విషయాల్లో బాధ్యతల నిర్వహణకు వచ్చే సరికి మాత్రం ‘బాబోయ్ మేం మోయలేం’ అంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఆసక్తిక విషయం ఏంటంటే.. వరల్డ్ వైడ్ యువతను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికీ చాలా మందికి టై కట్డడం, చెక్కు రాయడం, బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం, లీవ్ లెటర్ రాయడం వంటి సింపుల్ చిన్న పనుల నిర్వహణ కూడా కష్టంగా ఉంటోందట. ఇక ఇండియాలో అయితే 30 ఏండ్లు దాటినా.. ఇంకా పేరెంట్స్‌పైనే ఆధారపడుతున్న యువతీ యువకులు చాలా మందే ఉంటున్నారు.
ఏయే బాధ్యతల్లో వైఫల్యం?
ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీలను (Gen Z) తీసుకుంటే 17 శాతం మందికి ఇప్పటికీ చెక్ రాయడం రావడం లేదని, 22 శాతం మందికి టాక్స్ ఎలా ఫైల్ చేయాలో తెలియదని సర్వే పేర్కొంటున్నది. ఇక 29 శాతం మిలీనియల్స్‌కు తమ పిల్లలకు డైపర్ మార్చడం కూడా రావడం లేదు. 46 శాతం మందికి బడికి వెళ్లే తమ పిల్లలకు టై కట్టడం రాక ఇబ్బంది పడుతున్నారు. ఇంకొందరైతే వర్క్ ప్లేస్‌లో ఉంటే రెస్పాన్సిబిలీటీస్ తీసుకోవాల్సి వస్తుందని వర్క్ ఫ్రమ్‌హోమ్ లేదా మూన్ లైట్ జాబ్స్ వైపు మొగ్గుతున్నారు. 41 శాతం మందికి దుస్తులు చినిగినప్పుడు సూదితో కుట్టుకోవడం అస్సలు తెలియడం లేదని, 63 శాతం మందికి సొంత కారు ఉన్నా.. డ్రైవింగ్ వచ్చినా అందులో ఆయిల్ చేంజ్ చేయడం మాత్రం రాదని సర్వే పేర్కొన్నది. సుమారు 48 శాతం మందికి టైర్ మార్చడం, 42 శాతం మందికి జంప్ స్టార్ట్ చేయడం అస్సలు తెలియదట.
డబ్బు నిర్వహణ, కుటుంబ పోషణ
ప్రతీ ఐదుగురిలో ఒకరు తమకు 30 ఏండ్లు వచ్చే నాటికి అంతా తెలుసనే అతి విశ్వాసంతో ఉంటున్నారు. బాధ్యతలు మోయాల్సి వచ్చే సరికి మాత్రం విఫలం అవుతున్నారు. మిలీనియల్స్‌లోనూ దాదాపు 25 శాతం మంది ఇలాగే భావిస్తున్నారు. ప్రతీ ముగ్గురు అడల్ట్స్‌లో ఇద్దరు డబ్బు నిర్వహణ, కుటుంబ పోషణ, ఖర్చు వంటి బాధ్యతలను తలకు మించిన భారంగా ఫీలవుతున్నారని సర్వే పేర్కొన్నది. 49 శాతం మంది భవిష్యత్ కోసం పొదుపు చేయడం, 46 శాతం మంది తమకు నచ్చిన ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని భావిస్తున్నారు. జెన్ జీలలో 35 శాతం మంది భోజనాన్ని ప్లాన్ చేయడం లేదా వండుకోవడం కష్టతరమైన బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. 46 శాతం మంది నూడుల్స్, మ్యాగీ వంటివి చేసుకోవడం కూడా బద్ధకంగా భావిస్తూ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. 26 శాతం మంది మ్యారీడ్ పీపుల్ బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు, వైఫల్యం కారణంగా తాము పెళ్లి చేసుకోకుంటే బాగుండేదని భావిస్తున్నారు. మొత్తానికి బాధ్యతల నిర్వహణను ఎక్కువమంది భారంగానే ఫీల్ అవుతున్నారు.