Beauty Tips: ఫేస్‌కి వీటిని అస్సలు వాడకండి..!

చాలామంది ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు.

Update: 2024-11-24 12:34 GMT

దిశ, ఫీచర్స్: చాలామంది ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు స్కిన్‌ కోసం రకరకాల ఫేస్ క్రీములు, బాడీ లోషన్‌న్లు వంటి సౌందర్య ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే, వీటిలో కొన్నిటిని ముఖానికి అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఈ విషయం తెలియక చర్మానికి వాటిని రాసుకుని ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అసలు ముఖానికి వాడకూడని పదార్థాలేంటో ఇక్కడ చదివేయండి.

ముఖాన్ని మెరిపించుకోవడం కోసం ఫేస్ ప్యాక్ చేసుకుంటారు చాలామంది. ఇందులో భాగంగా నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. మరికొందరు దీని వల్ల ప్రయోజనం ఉందని నేరుగా ముఖానికి రాసుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు స్కిన్‌ని మరింత సున్నితంగా మార్చుతాయి. దీని వల్ల ఎండలోకి వెళ్లినప్పుడు చర్మంపై దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. దీనికి బదులుగా టమాటను ఉపయోగించడం మంచిది. టమాటలో విటమిన్- సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం రంగును మెరిపించడంలో సహాయపడుతుంది.

చలికాలంలో పొడిబారిన చర్మానికి తేమని అందించడం కోసం బాడీ లోషన్‌లు ఉపయోగిస్తుంటారు. చేతులు కాళ్లతో పాటుగా ముఖానికి కూడా దీనిని వాడుతారు. దీని వల్ల బాడీ లోషన్‌లోని జిడ్డుదనం ముఖ చర్మంలోని చేరి, మొటిమలు రావడానికి కారణం అవుతుంది. అందుకే బాడీ లోషన్లను ముఖానికి రాయకూడదు. ఫేస్‌కి ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులు ఉంటాయి. వాటిలో రసాయనం లేని ఉత్తమమైన క్రీములను ఎంచుకోవడం మంచిది. ముఖంపై మొటిమలు వస్తే, కొందమంది వెంటనే టూత్‌పేస్ట్‌ను వాటిపై రాస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. మొటిమలపై టూత్‌పేస్ట్ రాసినప్పుడు మెలనిన్ ఉత్పత్తి అధికమవుతుంది. దాని వల్ల ఆ మొటిమలు మచ్చలుగా మారుతాయి. కొన్ని గాఢమైన టూత్‌పేస్ట్‌లు అప్లై చేయడం వల్ల చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ ఉంది.

మేకప్ ఉత్పత్తులను కూడా చర్మ తత్వాన్ని బట్టి సరైనది ఎంచుకోవడం మంచిది. లేకుంటే ముఖ సౌదర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కొందరు ముఖంపై అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్స్ పద్దతిని ఉపయోగిస్తారు. వీటిని కూడా చర్మాన్ని బట్టి ఎంచుకోవాలి. లేకుంటే చర్మంపై మంట, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తాయి. లేదంటే ఇంట్లో ఉండే పదార్థాలతో వ్యాక్స్‌ను తయారు చేసుకుని, ఉపయోగించడం మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Tags:    

Similar News