Anxieties : యుక్త వయసులో వెంటాడుతున్న యాంగ్జైటీస్.. కారణం అదేనా?
Anxieties : యుక్త వయసులో వెంటాడుతున్న యాంగ్జైటీస్.. కారణం అదేనా?

దిశ ఫీచర్స్ : పిల్లలకేం ఫికర్.. ఆడుతూ పాడుతూ మస్తుగుంటరని మనమే అంటుంటాం. చాలా వరకు ఇదే నిజమని కూడా పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడైతే దాదాపు బాల్యం అంతా అట్లనే ఉండేది. చదువులు, పనులు, కుటుంబ పరిస్థితులు ఎట్లున్నా ఎక్కువ భాగం ఆటా పాటల్లో మునిగిపోయేటోల్లు. గల్లీ పోరగాల్లతో, స్కూల్లో దోస్తులతో కలిసి మెలిసి ఆడుకునేది. ఫోన్లకు, టీవీలకు తక్కువగా అతుక్కుపోయి దిమాక్ ఖరాబ్ చేసుకునే పరిస్థితి చాలా తక్కువ. కానీ ఇప్పుడట్ల కాదు. ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు మెరుగు పడినా.. మరోవైపు మనుషుల జీవన విధానంలో మార్పులు, ఒడిదుడుకులు కామన్ అయిపోతున్నాయి. ఒకప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి పెద్దల్లో కనిపించే సమస్యగానే ఉండేది. అది కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనూ ఒత్తిడి, ఆందోళలను వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మూడింట ఒకవంతు అదే సమస్య
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, అధిక భారంతో కూడిన చదువులు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం వంటివి యుక్త వయస్కుల్లో మానసిక ఆందోళనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అవుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిపుణుల ప్రకారం..13 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది యాంగ్జైటీ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే దానిని మేనేజ్ చేయడానికి లేదా ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఎందుకలా జరుగుతోంది?
కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు, సాధారణ పరిస్థితులను కూడా ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల, పలు విషయాలపట్ల అవగాహన లేకపోవడంవల్ల కూడా టీనేజర్లలో యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి. అట్లనే విధ్యా విధానంలో శాస్త్రీయత లోపించడం, అవసరమైన చదువులకంటే.. అదనపు ఒత్తిడిని పెంచే చదువులే ఉండటం కూడా టీనేజర్లలో మరో రకంగా ఆందోళనకు కారణం అవుతున్నాయనే విమర్శలు సైతం ఉన్నాయి. అలాగే సామాజిక సమస్యలు, కుటుంబాల్లో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక సమస్యలు, తల్లిదండ్రుల విడాకులు వంటివి కూడా పరోక్షంగా టీనేజర్లలో ఆందోళనకు కారణం అవుతున్నాయి.
ఏం చేయాలి?
ఆందోళనను రేకెత్తించే కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఒక పరిష్కారమైతే, ఒత్తిడి, ఆందోళనకు కారణం అయ్యే పరిస్థితులను, సందర్భాలను ఎదుర్కోవడానికి సద్ధ పడటం, వాటిలో నిమగ్నమై పరిశీలించడం ద్వారా కూడా క్రమంగా యుక్త వయస్కులు తమను తాము సవాలు చేసుకోవాలని, తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని ఒకేసారి ఎక్కువ ఛాలెంజింగ్ విషయాల జోలికి వెళ్లవద్దు. మీ కాన్ఫిడెన్స్‌నుపెంపొందించుకోవడానికి, సాధించగల గోల్స్ ఏర్పర్చుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇలా యాంగ్జైటీ - ప్రేరేపిత పరిస్థితులకు ఎదురీదడమనేది నేటి యువతకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆందోళనకర పరిస్థితులను మేనేజ్ చేయడానికి, వాటిని దీటుగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
వీటిపై ఫోకస్ చేయండి
ఎప్పుడూ ఆందోళన కలిగించే విషయాలే ఆలోచించడం వల్ల మీరు ఇబ్బంది పడుతుండవచ్చు. ముఖ్యంగా రాబోయే పరీక్షలు, ప్రెజెంటేషన్‌లు అందుకు కారణం కావచ్చు. అలాంటప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ముందు మీలో ఆనందం కలిగించే లేదా ఆసక్తికరమైన కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వడం, తరచుగా కాకుండా అప్పుడప్పుడూ మీకు నచ్చే వీడియోలు లేదా కామెడీ సిరీస్ చూడటం, ఇష్టమైన సంగీతం వినడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడం వంటివి కూడా యుక్త వయసులో పెరుగుతున్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలను తగ్గిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.