Hobbies Benefits : అభిరుచులే ఆనందం.. జీవితమంతా సంతోషం!

Hobbies Benefits : అభిరుచులే ఆనందం.. జీవితమంతా సంతోషం!

Update: 2024-10-29 07:29 GMT

దిశ, ఫీచర్స్ : మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలా..? అయితే కొన్ని ప్రత్యేక అభిరుచులు కూడా అందుకు దోహద పడతాయంటున్నారు మానసిక నిపుణులు. సాధారణంగానే ప్రతి ఒక్కరికీ రొటీన్ అంశాలతోపాటు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలన్న ఉత్సుకత ఉంటుంది. అదే మీలోని ప్రతిభను వెలికి తీస్తుంది. అనవసర ఆలోచనలను, ఆందోళనలు దూరం చేస్తుంది. అందుకే తమకంటూ ఏదో స్పెషాలిటీ ఉండే హాబీస్ అలవర్చుకుంటారు చాలా మంది. అయితే వ్యక్తులను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దదాం.

పెయింటింగ్, డ్యాన్సింగ్, మ్యూజిక్, రీడింగ్, అల్లికలు, ఆటలు, వ్యాయామాలు ఇలా ఏదో ఒక హాబీ కలిగి ఉన్నప్పుడు మరింత హెల్తీగా ఉంటారని పరిశోధనలు సైతం వెల్లడించాయి. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. వయస్సు రీత్యా అవి పలు అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అలాంటి వాటికి చెక్ పెట్టడంలో అభిరుచులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే యువతీ యువకుల్లోనూ పలు రకాల హాబీస్ వారిలో అదనపు జ్ఞానానికి, క్రియేటివిటీకి సహాయపడతాయి.

రొటీన్‌కు భిన్నంగా మీకు ఇష్టమైన అభిరుచులు కలిగి ఉండటం మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి స్ట్రెస్, యాంగ్జైటీ, డెమెన్షియా వంటి రుగ్మతలను దూరం చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రధానంగా న్యూరో ప్లాసిసిటీని పెంచడం ద్వారా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు నాడీ వ్యవస్థలో మార్పులకు కారణం అయి, కొత్త విషయాలను నేర్చుకోవడంలో, నైపుణ్యాలు అలవర్చుకోవడంలో అభిరుచులు కీలకపాత్ర పోషిస్తాయి. మ్యూజిక్‌లో ప్రావీణ్యం సంపాదించిన ఒక వ్యక్తి మేథమెటిక్స్‌లో కూడా రాణించారనుకుందాం. దాని వెనుక కచ్చితంగా ఆసక్తితోపాటు అభిరుచు ఉంటుంది.

తరచుగా ఇష్టమైన పనులు చేయడంవల్ల బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే జీవరసాయనాలు, హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అందుకే మీరు ఏదైనా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంటేనో, తరచుగా ఆందోళన చెందుతుంటేనో దానిని డైవర్ట్ చేయడానికి నిపుణులు ఏదో ఒక విషయంపట్ల అభిరుచి పెంచుకోవాలని సూచిస్తుంటారు. అంటే అభిరుచి కలిగి ఉండటంవల్ల మీరు ఒక పనిని ఇష్టపడి చేస్తారు. దీంతో మెదడు కూడా చురుకుగా మారుతుంది.

అభిరుచిని కలిగి ఉండటమే కాదు, మీరు ఇష్టంగా చేసే పనిని మనస్ఫూర్తిగా ఆస్వాదించినప్పుడు మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి అధిక రక్తపోటును, శరీరంలో వాపును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా నిద్రను ప్రోత్సహించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎండార్ఫిన్లు సహాయపడతాయి. సాధారణ వ్యక్తులకంటే కూడా ఏదో ఒక హాబీ కలిగి ఉన్న వ్యక్తుల్లో ఒత్తిడి, ఆందోళ వంటివి 10 శాతం తగ్గుతాయని అధ్యయనాల్లోనూ వెల్లడైనట్లు నిపుణులు చెప్తున్నారు. ఇంకెందుకాలస్యం.. అభిరుచిని అలవర్చుకోండి..! జీవితంలో ఆనందంగా ఉండండి!!

Tags:    

Similar News