చిన్న వయస్సులోనే గుండెపోటు.. అది కూడా మహిళల్లోనే ఎక్కువ.. అసలు కారణాలు ఇవే..

గుండెపోటు సాధారణంగా ఏజ్‌ బార్ అయిన వారిలో, అది కూడా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని అనుకుంటాం. కానీ ఇది మాత్రమే నిజం కాదు. ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు, యువతను వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారిందని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-04-25 06:23 GMT

దిశ, ఫీచర్స్ : గుండెపోటు సాధారణంగా ఏజ్‌ బార్ అయిన వారిలో, అది కూడా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని అనుకుంటాం. కానీ ఇది మాత్రమే నిజం కాదు. ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు, యువతను వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. ఏటా ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి.

పదేండ్లలో 35 శాతం పెరుగుదల

గత పదేండ్ల కాలంతో పోల్చితే 35 నుంచి 40 ఏండ్లలోపు వయస్స గలవారిలో గుండెపోటుకు గురైన వారి సంఖ్య 35 శాతం పెరిగినట్లు ఇటీవలి ఒక అధ్యయనంలోనూ వెల్లడైంది. అయితే గుండెపోటు లక్షణాలు పురుషుల మాదిరిగా కాకుండా మహిళల్లో కాస్త భిన్నంగా ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శారీరక, మానసిక ఒత్తిళ్లు వంటివి మహిళల్లో గుండెపోటుకు దారిస్తున్న ప్రాథమిక ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఒత్తిడి, ధూమపానం వల్ల కూడా ..

ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో హార్ట్‌ ఎటాక్ ప్రాబ్లమ్స్ పెరగడానికి గల పలు కారణాల్లో ఒత్తిడి, ధూమపానం కూడా ఉంటున్నాయి. అలాగే ఒకప్పటిలా మహిళలు ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం లేదు. తమకాళ్లపై తాము నిలబడాలని, కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులతో పోల్చితే ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు ఆఫీసు వర్క్ మధ్య అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీ, జాబ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్‌ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. కొందరిలో గుండెపోటుకు దారితీస్తున్నాయి. అదరుదుగా కొందరికి స్మోకింగ్ చేసే అలవాటును కూడా ఉంటుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే శరీరంలో ట్రైగ్లిజరైడ్ పెరిగి, రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి గుండెపోటు వచ్చే చాన్స్ పెరుగుతుంది.

హార్మోన్ల ప్రభావం

మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలివల్ల పలువురు మహిళల్లో చాలా వరకు తగ్గిపోతోందని నిపుణులు చెప్తున్నారు. ఈ సందర్భంలో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే మహిళలు అప్పుడప్పుడు హార్మోనల్ టెస్టులు చేయించుకోవాలని, సమతుల్యంగా ఉండేలా కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుండెపోటు వచ్చే ముందు ఏం జరుగుతుంది?

గుండెపోటు వచ్చే ముందు లక్షణాలను బట్టి అలర్ట్ కావచ్చు. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ లక్షణాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం, వికారం, వాంతులు, మైకం, తల తిరగడం, వెన్ను లేదా దవడ నొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టడం, కడుపులో ఉబ్బరం, గందరగోళం విపరీతమైన అలసట, అధికంగా వాంతులు కావడం వంటి లక్షణాలతో ప్రారంభమై మహిళల్లో హార్ట్‌ ఎటాక్ రావచ్చు. అందుకే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవల్స్ తక్కువగా ఉన్న మహిళలు ఈ సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని, వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News