Divorce Parties : విడాకులూ ఓ వేడుకే..!
Divorce Parties : విడాకులూ ఓ వేడుకే..!
దిశ, ఫీచర్స్ : జంటల మధ్య విడాకులు, ప్రేమికుల మధ్య బ్రేకప్‌లు సహజంగానే బాధాకరమైన అంశాలుగా పరిగణిస్తుంటారు. ఎంతో కాలంగా కలిసున్న వారు విడిపోయే ముందు అనుభవించే మానసిక వేదన వారిని కృంగదీస్తుంది. పైగా ఇలాంటి సందర్భాన్ని చాలా మంది దురదృష్టంగా భావిస్తుంటారు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితిలో మార్పు వస్తోంది. వివాహాల మాదిరే విడాకులను కూడా సెలబ్రేట్ చేసుకునే కొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. మన దేశంలో ఇది తక్కువే కానీ, విదేశాల్లో ‘డివోర్స్ రింగ్’, డివోర్స్ పార్టీ, ఫ్రీడమ్ పార్టీల పేరుతో విడాకులను సెలబ్రేట్ చేసుకునే పోకడలు ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల ఈ ధోరణి పెరిగిపోతోంది.
ప్రముఖ అమెరికన్ మోడల్, నటి ఎమిలీ రతాజ్ కోవ్‌స్కీ( Emily Ratajkowski) ఆ మధ్య తాను ధరించిన ‘డివోర్స్ రింగ్స్’ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఆమె తన ‘టోయ్-ఎట్-మోయి స్టైల్’ ఎంగేజ్ మెంట్ రింగ్‌ను రెండు వేర్వేరు ఉంగరాలుగా డిజైన్ చేయించుకోవడమే కాకుండా తన డివోర్స్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అభిమానులతో పంచుకోవడంతో ‘డివోర్స్ రింగ్స్’, ‘డివోర్స్ పార్టీస్’పై సోషల్ మీడియాలో క్రేజీ డిస్కషన్స్ జరిగాయి. ఇటీవల డివోర్స్ పార్టీస్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఏయే దేశాల్లో జరుపుకుంటారు?
భారత దేశంలో విడాకులను వేడుకగా సెలబ్రేట్ చేసుకోవడాన్ని చాలామంది తప్పు పడతారు. కానీ విదేశాల్లో ఇది మంచి పరిణామంగా భావిస్తారు చాలామంది. ఇబ్బంది పడుతూ కలిసుండే బదులు, నచ్చని భాగస్వామితో విడిపోవడం సంతోషకరమైన సందర్భంగా పరిగణిస్తారు. దీంతో తాము సమస్యల నుంచి బయటపడి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నామనే సూచికగా కొందరు ఫ్రీడమ్ పార్టీ లేదా డివోర్స్ సెలబ్రేషన్ పేరుతో వేడుక జరుపుతారు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్‌లలో డివోర్స్ పార్టీస్ అనేవి ప్రజాదరణ పొందిన వేడుకలుగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే భారత దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్రీడమ్ పార్టీలు జరుపుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు జరుపుకుంటారు?
‘డివోర్స్ రింగ్స్’ధరించడం లేదా ఫ్రీడమ్ పార్టీలు జరుపుకోవడాన్ని కొందరు తప్పుపట్ట వచ్చు. కానీ వాస్తవానికి ఇది తెలివైన మార్పు అంటున్నారు పలువురు నిపుణులు. విడాకులను స్వీకరించడం, వాటిని వేడుకగా జరుపుకోవడాన్ని సమర్థిస్తున్నారు. భాగస్వామి నుంచి వేధింపులు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్, హింస వంటివి ఎదుర్కొంటూ కూడా వివాహ బంధానికి కట్టుబడి ఉండేకంటే.. విడాకులు తీసుకొని సంతోషంగా ఉండటాన్ని ఎందుకు తప్పుపట్టాలి? పైగా ఇది చైతన్యానికి నిదర్శనం అంటున్నారు ఫెమినిస్టులు. బ్యాడ్ రిలేషన్ షిప్స్‌కి డివోర్స్ కేక్‌కట్ చేయడం, రింగ్స్ ధరించడం వంటివి ఈరోజుల్లో ఆశ్చర్య పడాల్సిన విషయాలేం కావని, స్వాగతించాల్సిన మార్పేనని పలువురు పేర్కొంటున్నారు. పైగా ఈ నయాట్రెండును స్వీయ ప్రేమ, నిబద్ధత, ఆత్మగౌరవానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. అయితే విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ దానిని సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ లేదు. ఎవరిష్టం వారిది. కొందరు జరుపుకోరు కూడా. కాకపోతే జరుపుకునే వారిని కూడా గౌరవించాలంటున్నారు నిపుణులు.
వేడుక.. మూలాలు
డివోర్స్ పొందడాన్ని ఒక సంతోషకరమైన వేడుకగా జరుపుకునే భావన గురించి ఈ మధ్య ట్రెండ్ అవడంవల్ల చాలా మందికి తెలుస్తోంది. కానీ వాస్తవానికి 1990ల నుంచే యూఎస్‌లో, ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాల్లో ఈ సంప్రదాయం పుట్టొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషాధిక్యత భావజాలం నుంచి తాము విముక్తి పొందాం అనేందుకు సూచికగా డివోర్స్ పొందిన మహిళలు ఫ్రీడమ్ పార్టీ పేరుతో విడాకుల వేడుకునే జరుపుకునే వారు.
విస్తరిస్తున్న ట్రెండ్
నిశ్చితార్థంలో లేదా పెళ్లిలో వధూ వరులు ఉంగరాలు మార్చుకోవడం ప్రిసద్ధ సంప్రదాయంగా వస్తోంది. పైగా ఈ రెండు వేడుకలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ విడాకులను కూడా వేడుకగా జరుపుకోవడం, డివోర్స్ రింగ్స్ ధరించడం కూడా ఇటీవల ఒక సరికొత్త ట్రెండ్‌గా విస్తరిస్తోంది. ఒకప్పుడు భార్యా భర్తలు లేదా ప్రేమికులు విడిపోవడం బాధాకరమైన అంశంగా పరిగణించేవారు. ఇప్పుడది సంతోషకరమైన వేడుకకు నిదర్శనంగా మారుతోంది. ఈ క్రమంలోనే ‘డివోర్స్ రింగ్స్’ ధరించే సరికొత్త ట్రెండ్ పలువురిని ఆకర్షిస్తోంది. 2024లో విడాకులను వేడుకగా జరుపుకోవడం చాలా దేశాల్లో కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కెట్లోకి ఎంగేజ్‌మెంట్ రింగ్స్, వెడ్డింగ్ రింగ్స్ మాదరి, డివోర్స్ రింగ్స్ వచ్చాయంటే ఈ సెలబ్రేషన్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇక కలిసి జీవించలేం అనుకున్నప్పుడు విడిపోవడానికి నిర్ణయించుకున్న ఆధునిక జంటలు పరస్పర అంగీకారంతోనే డివోర్స్ లేదా ఫ్రీడమ్ పార్టీలు జరుపుకుంటున్నారు.