డ్యాన్సర్స్ బాడీ హీట్ నుంచి శక్తి ఉత్పత్తి.. వేడిని ఎలా సంగ్రహిస్తారంటే?

స్కాట్లాండ్‌ గ్లాస్గోలోని డ్యాన్స్ ఫ్లోర్ డ్యాన్సర్స్ బాడీ హీట్ నుంచి పునరుత్పాదక శక్తిని సృష్టిస్తూ వార్తల్లో నిలిచింది. అక్కడ అతిపెద్ద డ్యాన్స్ పార్టీలను నిర్వహించే SWG3.. ఏడాది పొడవునా రాత్రిపూట వేలాది మంది ప్రజలు కలిసి నృత్యం చేయడానికి ఆహ్వానిస్తుంది.

Update: 2022-10-18 10:11 GMT

దిశ, ఫీచర్స్: స్కాట్లాండ్‌ గ్లాస్గోలోని డ్యాన్స్ ఫ్లోర్ డ్యాన్సర్స్ బాడీ హీట్ నుంచి పునరుత్పాదక శక్తిని సృష్టిస్తూ వార్తల్లో నిలిచింది. అక్కడ అతిపెద్ద డ్యాన్స్ పార్టీలను నిర్వహించే SWG3.. ఏడాది పొడవునా రాత్రిపూట వేలాది మంది ప్రజలు కలిసి నృత్యం చేయడానికి ఆహ్వానిస్తుంది. జియోథర్మల్ ఎనర్జీ స్టార్టప్ టౌన్‌రాక్ ఎనర్జీతో భాగస్వామ్యం కలిగిన SWG3.. 'బాడీహీట్' అని పిలువబడుతున్న యూనిక్ డ్యాన్స్‌ఫ్లోర్ ద్వారా డ్యాన్సర్ల శరీరంలోని వేడిని శక్తిగా మారుస్తూ, సీజన్‌కు అనుగుణంగా అక్కడి వాతావరణాన్ని చల్లగా లేదా వేడిగా ఉండేలా చేస్తుంది.

స్మాల్ డ్యాన్స్ స్టెప్స్ వేయడం ప్రారంభించినప్పుడు డ్యాన్సర్ బాడీ నుంచి 250W శక్తి ఉత్పత్తి చేయవచ్చని టౌన్‌రాక్ ఎనర్జీ వ్యవస్థాపకుడు డేవిడ్ టౌన్‌సెండ్ చెప్పారు. అదే పెద్ద DJ పెట్టి ప్రతీ ఒక్కరినీ కిందకి మీదకి దూకేలా చేస్తే.. 500-600W ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. టౌన్‌రాక్ ఎనర్జీ డ్యాన్సర్‌ల ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని సంగ్రహించడం ద్వారా పనిచేస్తుందని, ఈ బాడీ హీట్‌ను సంగ్రహించి.. సుమారు 500 అడుగుల లోతులో ఉన్న 12 బోర్‌హోల్స్‌లోకి పంపుతారని తెలిపారు. ఆ తర్వాత ఈ వేడిని బ్యాటరీగా పనిచేసే లార్జ్ అండర్‌గ్రౌండ్ రాక్ క్యూబ్‌కి పంపిస్తారు. ఇక్కడ నిల్వచేయబడిన శక్తి.. వేడి లేదా వేడి నీటిని వేదికకు సప్లయ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ విధంగా శరీర ఉష్ణోగ్రతను కలెక్ట్ చేసి.. అక్కడి వాతావరణాన్ని చల్లబరచడం లేదా వేడిగా మార్చడం జరుగుతుంది.

కాగా ఈ ప్రాసెస్ ద్వారా ఫ్యూయల్ బిల్స్‌ ఆదా చేస్తూ 'బాడీ‌హీట్‌'లో పెట్టిన పెట్టుబడిని తిరిగిపొందవచ్చని SWG3 మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్-బ్రౌన్ తెలిపారు. భూఉష్ణ బావి(జియోథర్మల్ వెల్)ని తయారు చేయాలంటే వందల కోట్లలో ఖర్చవుతుందని, దీనికి బదులుగా కస్టమర్స్‌లో ఉన్న వేడిని సేకరించి భూమిలో నిల్వచేయడం బెస్ట్ ప్లాన్‌గా పేర్కొన్నారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, బాడీహీట్ డ్యాన్స్‌ఫ్లోర్ దాని మూడు గ్యాస్ బాయిలర్‌లను వదిలించుకోవడానికి సహాయపడుతుందని, దాని వార్షిక కార్బన్ అవుట్‌పుట్ 70 మెట్రిక్ టన్నుల వరకు తగ్గుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత స్కాట్లాండ్, UKలో మాత్రమే కాకుండా.. యూరప్ అంతటా ఇలాంటి వేదికలను తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని SWG3, టౌన్‌రాక్ కంపెనీలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి :

రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి 6 మార్గాలు 

Tags:    

Similar News