Anti bucket list : యాంటీ బకెట్ లిస్ట్..! మీ కోరికలను నెరవేర్చే కొత్త పద్ధతి ఇదే!
Anti bucket list : యాంటీ బకెట్ లిస్ట్..! ఈ నయా ట్రెండ్ ఏమిటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : బకెట్ లిస్ట్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పదం ఇది. వ్యక్తులు తమ రోజువారీ పనులు, ఆసక్తులు, కోరికలు నెరవేర్చుకోవాలని భావించే కోరికలకు సంబంధించిన జాబితాగా పేర్కొంటారు. అయితే ప్రస్తుతం దీనికి వ్యతిరేకంగా మరో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఇందులో భాగంగా వ్యక్తులు జీవితంలో తాము చెయ్యాలి. చెయ్యకూడదు అనుకొని నిర్ణయించుకునే పనుల జాబితానే యాంటీ బకెట్ లిస్ట్ (Anti bucket list ) అంటున్నారు. అంటే ఇక్కడ ఒక క్లారిటీతో ఉండటమే ముఖ్యమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
ఏదైనా ఒక విషయంలో మీరు నిర్ణయం తీసుకునే ముందు అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల ఏది అవసరం, ఏవి అవసరం లేదు? ఏది చేయాలి? ఏది చేయకూడదు అనే క్లారిటీ వస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో మరో సందర్భంలో ముందు చేసిన పొరపాట్లు చేయకుండా ఉంటారు. నిజానికి ఒక అవసరం లేని అలవాటును లేదా ప్రమాదకరమైన దానిని మానుకోవడంవల్ల మీ జీవితం మరింత బాగుంటుందని అనుకున్నప్పుడు దానిని లిస్టులో చేర్చాలని, అలా చేర్చాక ఇంకెప్పుడు దానిజోలికి పోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే మీరు బకెట్ లిస్టులో మీ కోరికలు నోట్ చేసుకున్నట్లే. యాంటీ బకెట్ లిస్టులో చేయకూడదు అనుకొనే కోరికలను నోట్ చేసుకోవాలి. అలాంటి కొన్ని ఉదాహరణలేవో నిపుణులు వివరిస్తున్నారు.
* ఖర్చులు తగ్గించుకోవడం : ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డ్ (Credit card) యూజ్ చేస్తున్నారు. అయితే ఉంది కదా అని వెనుకా ముంందు ఆలోచించకుండా కొందరు అనవసర ఖర్చులు చేస్తారు. తర్వాత అప్పులు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటారు. దీనిని నుంచి బయటపడాలంటే మీరు క్రికెడ్ కార్డును ఎక్కువగా యూజ్ చేయకూడదని భావిస్తే గనుక దానిని యాంటీ బకెట్ లిస్టులో రాసుకోండి. ఆ తర్వాత కట్టుబడి ఉండండి. దీంతో మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
* వ్యసనాలు గుర్తించడం : ఈరోజుల్లో మొబైల్ ఫోన్, టీవీ, పలు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ వ్యసనంగా మారుతున్నాయి. అలాగే ఆల్కహాల్, ధూమపానం, జంక్ ఫుడ్, బెట్టింగ్ వంటి వ్యసనాలతో పలువురు ఇబ్బంది పడుతుంటారు. వీటిని యాంటీ బకెట్ లిస్టులో చేర్చితే మీరు బయటపడే అవకాశం ఉంటుంది.
* భయాలు వదులుకోవడం : మీరు స్కూబా డైవింగ్, స్కై డైవింగ్, ఫాస్ట్ డ్రైవింగ్, బైక్ రేసింగ్ వంటి విన్యాసాలు వంటివి చూసి భయపడి ఉండవచ్చు. అది మీలో ఆందోళన కలిగించి ఉండవచ్చు. అలాగే ప్రమాదానికి గురై కూడా ఉండవచ్చు. కాబట్టి ఇక నుంచి వాటికోసం రిస్క్ తీసుకోవద్దు అనుకుంటున్నారా? అయితే యాంటీ బకెట్ లిస్ట్‌లో చేర్చండి. అలాగే గొడవలు, ఇబ్బందులు, ఒత్తిడి, ఆరోగ్యంపై ప్రభావం (Impact on health) చూపే వ్యసనాలు, ప్రవర్తనలు ఇలా అనేక విషయాల్లో మీరు దేనిని వదులు కోవాలనుకుంటారో దానిని యాంటీ బకెట్ లిస్టులో చేర్చి, ప్రతి రోజూ చెక్ చేయండి. కొంతకాలం తర్వాత ఈ చిన్న టెక్నిక్ మీలో గొప్ప మార్పు తెస్తుందని నిపుణులు అంటున్నారు.