చనిపోయిన పదేళ్లకు వాంగ్మూలం!
దిశ ప్రతినిధి, కరీంనగర్: వారి పూర్వీకుల నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటున్నారు. వారసులకు తెలియకుండానే వేరొకరి పేరిట ఆర్వోఆర్ అయింది. రెవెన్యూ రికార్డుల్లో చెక్ చేసి చూసుకోగా తమ పేర్లు లేకపోవడంతో పట్టాదారులు షాక్‌కు గురయ్యారు. తాము అమ్మకుండానే తమ భూమి వేరొకరి పేరున ఎలా మారిందో చెప్పాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. పట్టాదారులు చనిపోయిన పదేళ్ల తరువాత వారి వాంగ్మూలాన్ని కరీంనగర్ రెవెన్యూ అధికారులు సేకరించడం పట్ల తీవ్ర విమర్శలు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్:
వారి పూర్వీకుల నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటున్నారు. వారసులకు తెలియకుండానే వేరొకరి పేరిట ఆర్వోఆర్ అయింది. రెవెన్యూ రికార్డుల్లో చెక్ చేసి చూసుకోగా తమ పేర్లు లేకపోవడంతో పట్టాదారులు షాక్‌కు గురయ్యారు. తాము అమ్మకుండానే తమ భూమి వేరొకరి పేరున ఎలా మారిందో చెప్పాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. పట్టాదారులు చనిపోయిన పదేళ్ల తరువాత వారి వాంగ్మూలాన్ని కరీంనగర్ రెవెన్యూ అధికారులు సేకరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కరీంనగర్ మండలం చింతకుంట శివారులోని 95/ఏ సర్వేనెంబరులో వారసత్వంగా రాచకొండ భూమయ్య, నర్సయ్య, మైసయ్య, కనకయ్యల పేరిట 34 గుంటల పైచిలుకు భూమి వీరి తండ్రి అయిన సాయిలు నుంచి సంక్రమించింది. 1993 వరకు పహాణీ రికార్డుల్లో నలుగురు అన్నదమ్ముల పేరే ఉంది. అనూహ్యంగా 1993లో నలుగురు కొడుకుల స్థానంలో మూడో కొడుకు మైసయ్య, నాలుగో కొడుకు కనకయ్యల పేరిట మొత్తం భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పహణీలో రాసేశారు. అయితే అనూహ్యంగా సాయిలు రెండో కుమారుడు నర్సయ్య కొడుకు రాచకొండ శ్రీనివాస్ వారసత్వంగా వచ్చిన భూమిలో తనకు వాటా రావాలని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఓఎస్ నెంబర్ 449 ప్రకారం 2007లో నలుగురు అన్నదమ్ములకు సమాన వాటాలుగా విభజిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే రెవెన్యూ అధికారులు మాత్రం.. అతడికి రావాల్సిన భూమి 2006లోనే వనపర్తి లచ్చయ్య పేరిట ఆర్వోఆర్ చేసినట్లు తమ రికార్డుల్లో ఉందని చెప్పడంతో శ్రీనివాస్ ఆర్డీవో కోర్టులో అప్పీల్ చేశారు. వనపర్తి లచ్చయ్యకు తప్పుడు ఆర్వోఆర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారని, అక్రమంగా జరిగిన ఈ లావాదేవీని రద్దు చేయాలని కోరారు. అయితే వనపర్తి లచ్చయ్యకు ఆర్వోఆర్ చేసేందుకు తాము మైసయ్య, కనకయ్యలు రాసిచ్చిన సాదా బైనామాను పరిగణనలోకి తీసుకున్నామని రెవెన్యూ అధికారులు చెప్పారు. విచిత్రం ఏంంటంటే 1993 వరకు రెవెన్యూ రికార్డుల్లో నలుగురు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిగా ఉండగా, 1972లో సాదా బైనామా ఉందని, ఆర్వోఆర్‌కు అప్పీల్ చేశారు. కానీ తహసీల్దార్ పహాణీ రికార్డులను పరిశీలించకుండా, పట్టాదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్‌గా అంతిమ పట్టా జారీ చేయడం చేశారు.
పదేళ్ల తర్వాత..
రెవెన్యూ అధికారులు 1996 ఫిబ్రవరి 17న రాచకొండ మైసయ్య చనిపోగా.. అతడి భార్య కొమురమ్మకు 1998లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. మరో వారసుడు నర్సయ్య 1997 మార్చి 27న చనిపోగా ఆయన కొడుకు శ్రీనివాస్ 1998లో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కూడా పొందారు. వీరిద్దరి డెత్ సర్టిఫికెట్లు కరీంనగర్ ఎమ్మార్వో ఆఫీసు జారీ చేయగా, అదే కార్యాలయంలో వారి ఉమ్మడి ఆస్తిని ఆర్వోఆర్ ద్వారా వనపర్తి లచ్చయ్యకు బదిలీ చేసినప్పుడు వీరిద్దరు బతికున్నట్లు 2006లో వాంగ్మూలం తీసుకుని మరీ పట్టాదారు పేరు మార్పిడి చేసేశారు. అంటే దాదాపు పదేళ్ల తరువాత చనిపోయిన వ్యక్తుల వాంగ్మూలాలను కరీంనగర్ రెవెన్యూ అధికారులు సేకరించామని రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. ఈ విషయంపై శ్రీనివాస్ ఆర్డీఓ కోర్టులో అప్పీల్ చేసుకోగా D/5758/2011 ప్రకారం వనపర్తి లచ్చయ్య పేరిట అమలు చేసిన ఆర్వోఆర్ చెల్లదని, ఆ భూమి రాచకొండ సాయిలు వారసులకు చెందినదేనని స్పష్టం చేస్తూ తప్పుడుగా ఇచ్చిన పాస్ బుక్కులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారినికి సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాచకొండ శ్రీనివాస్ కరీంనగర్ కోర్టులో దావా వేశారు. దరఖాస్తును పరిశీలించిన కోర్టు వనపర్తి లచ్చయ్యతో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న రెవెన్యూ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 17/2013 ద్వారా కేసు నమోదు చేసి వనపర్తి లచ్చయ్యను అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. కోర్టు ఆదేశించినా పోలీసులు మాత్రం కేవలం లచ్చయ్యను బాధ్యున్ని చేసి రెవెన్యూ అధికారులపై ప్రత్యేక మమకారం చూపించడం విడ్డూరం.
ఇలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దు..
ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని, తప్పుడు పనులు చేసే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా రెవెన్యూ అధికారులకు గుణపాఠం అవుతుంది. నాకు వారసత్వంగా రావాల్సిన భూమి కోసం 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్న. నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోలేదు. మా కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా నష్ట పరిచిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
-రాచకొండ శ్రీనివాస్, బాధితుడు, చింతకుంట