పింక్ సిటీలో.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్స్

దిశ, ఫీచర్స్ : కొద్ది కాలంగా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇందుకోసం ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదు కదా.. ‘స్నోవీ ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్, మనీ హీస్ట్ ఫొటోషూట్, డబుల్ డెక్కర్ ఫొటోషూట్’ వంటి పలు భిన్నమైన థీమ్స్‌తో ఒకరిని మించి మరొకరు ఫొటో షూట్స్ నిర్వహించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌‌లోని సుందరమైన, చారిత్రాత్మక ప్రదేశాల్లో ఫొటోషూట్ నిర్వహించుకోవాలనుకునే వారి కోసం అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది. రాజస్థాన్ […]

Update: 2021-02-05 03:43 GMT

దిశ, ఫీచర్స్ : కొద్ది కాలంగా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇందుకోసం ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదు కదా.. ‘స్నోవీ ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్, మనీ హీస్ట్ ఫొటోషూట్, డబుల్ డెక్కర్ ఫొటోషూట్’ వంటి పలు భిన్నమైన థీమ్స్‌తో ఒకరిని మించి మరొకరు ఫొటో షూట్స్ నిర్వహించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌‌లోని సుందరమైన, చారిత్రాత్మక ప్రదేశాల్లో ఫొటోషూట్ నిర్వహించుకోవాలనుకునే వారి కోసం అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది.

రాజస్థాన్ రాజధానిగా, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్‌.. రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం కాగా జంతర్ మంతర్, అమెర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్, బిర్లా మందిర్, జైగా ఫోర్ట్‌లతో పాటు మరెన్నో చారిత్రక, సందర్శక ప్రదేశాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం జైపూర్‌లోని చారిత్రక కట్టడాలతో పాటు మ్యూజియమ్స్‌లోనూ ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్లను చేసుకోవడానికి తాజాగా అనుమతిచ్చింది. పింక్ సిటీ స్మారక చిహ్నాల దగ్గర ఫొటో షూట్ నిర్వహించాలనుకునే వాళ్లు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఆఫీస్ టైమ్‌లో షూట్ చేస్తే.. ప్రతి రెండు గంటలకు రూ. 5,000/-, అదే కార్యాలయ సమయానికి ముందు లేదా తరువాత షూట్ చేస్తే గంటకు రూ. 15,000/- చెల్లించాల్సి ఉంటుందని పురావస్తు, మ్యూజియం విభాగం డైరెక్టర్ ప్రకాష్ చంద్ర శర్మ అన్నారు.

జైపూర్‌లోని అంబర్ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్, జంతర్ మంతర్, హవా మహల్, నహర్‌గర్, విద్యాధర్ కా బాగ్, సిసోడియా రాణి కా బాగ్, ఇసర్లాట్ తదితర ప్రదేశాల్లో ఫొటో షూట్స్ నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఫొటో షూట్ నిర్వహించే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పురాతన వస్తువులు దెబ్బతినకుండా చూసుకోవాలి. అంతేకాదు ప్రజల మనోభావాలను దెబ్బతీసే లేదా మతపరమైన భావాలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, అలాంటి చిత్రాలను చిత్రీకరించవద్దని నిబంధనల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News