ఇంకా తేలని లెక్కలు

దిశ, కరీంనగర్: జిల్లాలో జనం అంతా ఆగమాగమైతున్నారు. కారణమేందో తెలిసిపోయింది. కానీ, అసలు లెక్కలు ఇంకా తెలియడంలేదు. ఆ లెక్కలను ఎలా బయటకు తీయాలో అర్థంకావడంలేదు… దీంతో వారంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అదేమిటో మీరే చూడండి… నిజాముద్దీన్ మర్కజ్ మసీదు వద్ద జరిగిన సభలకు తెలంగాణ నుండి హాజరైన వారి గణాంకాలు అంచనాలకు అందడం లేదని తెలుస్తోంది. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారికి కరోనా వ్యాప్తి చెందిందన్న విషయం వెలుగులోకి రాగానే దేశ వ్యాప్తంగా అన్ని […]

Update: 2020-04-03 00:59 GMT

దిశ, కరీంనగర్: జిల్లాలో జనం అంతా ఆగమాగమైతున్నారు. కారణమేందో తెలిసిపోయింది. కానీ, అసలు లెక్కలు ఇంకా తెలియడంలేదు. ఆ లెక్కలను ఎలా బయటకు తీయాలో అర్థంకావడంలేదు… దీంతో వారంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అదేమిటో మీరే చూడండి…

నిజాముద్దీన్ మర్కజ్ మసీదు వద్ద జరిగిన సభలకు తెలంగాణ నుండి హాజరైన వారి గణాంకాలు అంచనాలకు అందడం లేదని తెలుస్తోంది. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారికి కరోనా వ్యాప్తి చెందిందన్న విషయం వెలుగులోకి రాగానే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ సేకరించింది. తెలంగాణ రాష్ట్రం నుండి 1,030 మంది ఢిల్లీ సభలకు హాజరైనట్టు తెలంగాణ సర్కార్ గుర్తించింది. అయితే రోజులు గడుస్తున్నాకొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలకు ప్రభుత్వ లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. దీంతో తెలంగాణ నుండి మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

జగిత్యాల జిల్లా నుండి 25 మంది హాజరైనట్టు మూడు రోజుల క్రితం విడుదలైన జాబితాల్లో అధికారులు పేర్కొన్నారు. కానీ, జగిత్యాల జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన 32 మందిని తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసులు నిలువరించారు. మర్కజ్ కు వెళ్లి వచ్చారని గుర్తించి క్వారంటైన్ కు పంపించిన అక్కడి జిల్లా యంత్రాంగం ఇంకా ఎంతమంది వెళ్లారో తెలుసుకునే పనిలో నిమగ్నం అయింది.

అలాగే కరీంనగర్ జిల్లా నుండి 17 మంది వెళ్లారని మొదట వెల్లడించగా ఇప్పుడు ఆ సంఖ్య 19కి చేరింది. కరీంనగర్ కలెక్టర్ శశాంక కూడా జిల్లా నుండి మర్కజ్ మసీదు సభలకు వెళ్లి వచ్చిన 19 మందిని గుర్తించామని ప్రకటించారు. ఇలా చాలాచోట్ల కూడా మొదట విడుదల చేసిన జాబితాకు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వాస్తవాలకు సంబంధం లేకుండా పోయిందనే చెప్పాలి. అయితే మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చేవారు ఎక్కువగా అర్బన్ ఏరియాల్లోనే ఉంటారని భావించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారని గుర్తిస్తుండడంతో రూరల్ ఏరియాలపై కూడా నజర్ వేయాల్సిన పరిస్థితి అధికారులకు తయారైంది. అధికారులు మొదట తయారు చేసిన జాబితాతో పోలిస్తే ఇప్పుడు బయటకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

అధికారులకు తలనొప్పి…

మర్కజ్ మసీదుకు వెళ్లివచ్చినవారి లెక్కలు తీయడంలో అధికార యంత్రాంగానికి ఇబ్బందిగానే మారిందని చెప్పాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మర్కజ్ మసీదు నుండి వచ్చినవారితోనే అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడంతో అసలు వీరెంతమంది ఢిల్లీ వెళ్లారో జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే చాలామంది ఢిల్లీ వెళ్లొచ్చామని చెప్పేందుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. తమను 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తారోనన్న భయం వల్లే చాలామంది ముందుకు వచ్చి చెప్పడం లేదని సమాచారం. క్వారంటైన్ విషయంలో ప్రజల మధ్య జరుగుతున్న చర్చ కూడా ఇందుకు కారణమని చెప్పాలి. క్వారంటైన్ వెల్లిన వారిని కూడా కరోనా పీడితులుగా భావిస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో క్వారంటైన్ కు వెళ్లినా తమను కరోనా బాధితులుగా భావిస్తారన్న భయం మర్కజ్ మసీదుకు వెళ్లివచ్చినవారిని వెంటాడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే కొంతమంది మర్కజ్ వెళ్లి వచ్చామని స్వచ్ఛందంగా ముందుకు రాలేకపోతున్నారని తెలుస్తోంది. వారి నుండి వస్తున్న సహాయ నిరాకరణ వల్ల అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సఫలం కాలేకపోతోంది. చివరకు ఎక్కువ మంది వెళ్లివచ్చారన్న ప్రాంతాలను గుర్తించి ఈ ఏరియానే క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితి తయారైంది.

Tags: Karimnagar, corona, virus, victims, counts, authorities

Tags:    

Similar News