రైతుల కోసం కొత్త టెక్నిక్.. ఇలా చేస్తే ఓకేసారి రెండు పంటలు

దిశ, ఫీచర్స్ : ఎక్కువ దిగుబడి కోసం రెండు రకాల మేలైన విత్తనాల సంకరీకణం ద్వారా హైబ్రిడ్ వంగడాలను సృష్టించడం గురించి తెలిసిందే. కానీ ఒకే చెట్టుకు రెండు రకాల కూరగాయలను పండించడం గురించి వినడం అరుదు. తాజాగా వారణాసిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (ICAR-IIVR) శాస్త్రవేత్తలు వంకాయలు, టొమోటాలు రెండింటినీ పండించగల మొక్కలను పెంచేందుకు కొత్త టెక్నిక్‌ కనుగొన్నారు. వీటికి ‘బ్రొమాటో’గా నామకరణం చేసి […]

Update: 2021-10-24 01:29 GMT

దిశ, ఫీచర్స్ : ఎక్కువ దిగుబడి కోసం రెండు రకాల మేలైన విత్తనాల సంకరీకణం ద్వారా హైబ్రిడ్ వంగడాలను సృష్టించడం గురించి తెలిసిందే. కానీ ఒకే చెట్టుకు రెండు రకాల కూరగాయలను పండించడం గురించి వినడం అరుదు. తాజాగా వారణాసిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (ICAR-IIVR) శాస్త్రవేత్తలు వంకాయలు, టొమోటాలు రెండింటినీ పండించగల మొక్కలను పెంచేందుకు కొత్త టెక్నిక్‌ కనుగొన్నారు. వీటికి ‘బ్రొమాటో’గా నామకరణం చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ విధానం ద్వారా సెమీ అర్బన్, అర్బన్ ఏరియాల్లో కిచెన్ గార్డెన్స్ వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువ కూరగాయలను పండించే అవకాశం ఉంది. అంతేకాదు ఇది కూరగాయల లభ్యతను మెరుగుపరుస్తుందని.. కార్మికులు, నీటి అవసరాలతో పాటు రసాయన మందులపై పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుందని భావిస్తున్నారు. కాగా ఒక్కో ‘బ్రొమాటో’ మొక్క.. 3 – 4 కిలోల వంకాయలు, 2-3 కిలోల టొమాటో దిగుబడిని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే IIVR.. గతంలో బంగాళాదుంపలు, టొమాటోలు కలిపి పండించే ‘పొమాటో’ అనే మొక్కను కూడా విజయవంతంగా అంటుకట్టగలిగింది. కాగా ఈ బ్రొమాటో మొక్క.. డ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ ఒకే మొక్క జాతికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ ‘సియాన్స్’ను.. ఒకే మొక్క ద్వారా ఒకటి కంటే ఎక్కువ కూరగాయలను పండించేందుకు అంటుకడతారు. కాగా బ్రొమాటోకు చెందిన మాతృ మొక్కలు(పేరెంట్ ప్లాంట్స్) ‘కాశీ సందేశ్’ అని పిలువబడే హైబ్రిడ్ వంకాయ.. ‘కాశీ అమన్’ అనే మెరుగైన రకానికి చెందిన టొమాటో నుంచి అభివృద్ధి చేయబడినవి. ఇవి IC 111056 అని పిలువబడే వంకాయ వేరు కాండంలో అంటుకట్టబడ్డాయి.

ఎలా అభివృద్ధి చేయబడింది?

25-30 రోజుల వయసుగల వంకాయ మొక్కలు, 22-25 రోజుల వయసుగల టొమోటా మొక్కలను అంటుకట్టేందుకు తీసుకున్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. గ్రాఫ్టింగ్(అంటుకట్టుట) అనేది కణజాల పునరుత్పత్తి ద్వారా మొక్కల భాగాలను కలపడం. ఇందులో భాగంగా ఒక మొక్క భాగం మరొక మొక్క కాండం, వేరు లేదా కొమ్మపై అంటుకట్టబడుతుంది. మూలాన్ని అందించే భాగాన్ని స్టాక్ అని, జోడించే భాగాన్ని సియాన్ అంటారు. బ్రొమాటో విషయంలో అంటుకట్టిన వెంటనే, మొలకలను నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఉంచారు. ఉష్ణోగ్రత, తేమతో పాటు కాంతిని 5-7 రోజుల పాటు అవసరమైన స్థాయిలో ఉంచి ఆ తర్వాత మొలకలను పాక్షిక నీడలో ఉంచుతారు. ప్రాథమికంగా అంటుకట్టడం పూర్తయిన తర్వాత 15-18 రోజులకు పొలంలో నాటుతారు.

ప్రయోజనాలు..

ఒకే మొక్క నుంచి రెండు కూరగాయలను ఉత్పత్తి చేసే ఈ కొత్త పద్ధతి.. సాగుకు సరిపడా స్థలం లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే పోషక, ఉత్పాదకత సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుందని ICAR-IIVR డైరెక్టర్ డాక్టర్ T.K బెహెరా తెలిపారు. ‘ఇంతకుముందు, ఇది పువ్వులు లేదా పండ్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ మేము దాన్ని కూరగాయలకు విస్తరించాం. పోషకాహార భద్రతలో బ్రొమాటో సహాయకారిగా ఉంటుంది. కూరగాయల ధరలు పెరిగినందున దేశీయ పోషకాహారాన్ని నిర్ధారించడానికి ఇది ఉత్తమ పద్ధతి కాగా సాగు ఖర్చులతో పాటు రసాయన అవశేషాలను కూడా తగ్గిస్తుంది. దీన్ని కేవలం రూ. 10-11 ఖర్చుతో ఒక నెల వ్యవధిలో అభివృద్ధి చేయవచ్చు. అధిక నీటి ఎద్దడిని అలాగే కరువు వంటి దృశ్యాలను తట్టుకోగలదు’ అని బెహెరా వెల్లడించారు.

Tags:    

Similar News