ఇక నుంచి ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తా: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఇక నుంచి ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు......
దిశ, వెబ్ డెస్క్: ఇక నుంచి ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Dharmavaram Former Mla Kethireddy Venkatrami Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కేతిరెడ్డి కారుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేతిరెడ్డి కారును ఆపకుండా అక్కడి వెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన కేతిరెడ్డి... తనకు టైమ్ వస్తుందని, అప్పుడు తనేంటో చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు.
‘‘ప్రతి లెక్కాసారాన్ని సరి చేస్తా. కొత్త వాళ్లు వస్తుంటారు. పోతుంటారు. గొడవలు వద్దని తమ నాయకులు, కార్యకర్తలను కట్టడి చేశా. ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నా. కానీ గొడవలను ప్రోత్సహిస్తున్నారు ధర్మవరంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ పోయింది. పీఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడతాం.’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.