గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతంతే..
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు సైతం డిజిటల్ లెస్సన్స్ టీవీల ద్వారా నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతాయని క్షేత్రస్థాయిలో ఎన్నో సర్వేలు తెలిపాయి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రూపొందించిన తాజా నివేదికలో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ వంద మందిలో 39.83 మందికి మాత్రమే […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు సైతం డిజిటల్ లెస్సన్స్ టీవీల ద్వారా నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతాయని క్షేత్రస్థాయిలో ఎన్నో సర్వేలు తెలిపాయి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రూపొందించిన తాజా నివేదికలో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ వంద మందిలో 39.83 మందికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు, తెలంగాణలో ప్రతీ వంద మంది జనాభాకు 36.63 మందికి నెట్ సౌకర్యం ఉన్నట్లు తేలింది. మిషన్ భగీరథతోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అనే నినాదాన్ని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్తున్నా ఆచరణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఒకటే టెలికామ్ సర్కిల్ ఉండటంతో భౌగోళికంగా ఈ రెండు రాష్ట్రాలకు వేర్వేరు సర్వే జరగలేదు. ఒకే టెలికామ్ పరిధిని పరిగణనలోకి తీసుకుని చేసిన అధ్యయనంలో రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా 36.63% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంత జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో 55.12 మందికి (ప్రతీ వందమంది జనాభాలో) ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, జన సాంద్రత తక్కువగా ఉండటం, ఎక్కువ సిగ్నల్ ట్రాన్సీవర్లను ఏర్పాటు చేయాల్సి రావడం, ఇందుకు టెలికామ్ సంస్థలకు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేకపోవడం తదితర సవాళ్లు ఉన్నాయని, అందువల్లనే రూరల్ ఏరియాల్లో నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నట్లు ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పరిశీలిస్తే ఢిల్లీ (రూరల్)లో 98.97% మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే, హిమాచల్‌ప్రదేశ్‌లో 58.29%, తమిళనాడులో 50.42%, పంజాబ్‌లో 47.49%, కర్నాటకలో 40.74% చొప్పున ఉంది.
ఏటా 3.4% కనెక్షన్ల పెరుగుదల..
ఏటా సగటున 3.4% చొప్పున దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. గతేడాది డిసెంబరు చివరి నాటికి 71.8 కోట్ల కనెక్షన్లు ఉంటే మార్చి 31 నాటికి 74.32 కోట్లకు పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ లెస్సన్స్ నేపథ్యంలో రూరల్ ఏరియాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఆ మేరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఇదే విషయాన్ని లోక్‌సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ సంజయ్ ధోత్రే లిఖితపూర్వకంగా తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్టు దశలవారీగా అమలవుతూ ఉందని, ఈ నెల 4 నాటికి దేశవ్యాప్తంగా 1.43 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బాండ్ (ఇంటర్నెట్) సేవలను కల్పించామని, మిగిలిన గ్రామాలకు సైతం విస్తరింపజేస్తామన్నారు. దేశం మొత్తం జనాభా 135 కోట్లు ఉన్నా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి 74.32 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్ నివేదికలో వెల్లడైంది. ఇందులో 28.6 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే దీనికి సుమారు రెట్టింపు స్థాయిలో 45.72 కోట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది.