ముందు తాళం.. వెనుక బేరం…

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ వల్ల సగటు పౌరుడి జీవితం అతలాకుతలం అవుతున్నా ఆ వ్యాపారులకు మాత్రం కనక వర్షం కురిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఆ షాపులకు తాళం వేశామని చేతులు దులుపుకున్న ఎక్సైజ్ అధికారుల మొక్కుబడి చర్యలకు ఆ దుకాణాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనతా కర్ఫ్యూ తరువాత లాక్‌డౌన్ ప్రకటించడంతో మద్యం దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు లిక్కర్‌ను మద్యం షాపుల నుంచి మాయం చేస్తున్నారు. మద్యం ప్రియుల అవసరమే అదనుగా […]

Update: 2020-04-14 02:26 GMT

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ వల్ల సగటు పౌరుడి జీవితం అతలాకుతలం అవుతున్నా ఆ వ్యాపారులకు మాత్రం కనక వర్షం కురిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఆ షాపులకు తాళం వేశామని చేతులు దులుపుకున్న ఎక్సైజ్ అధికారుల మొక్కుబడి చర్యలకు ఆ దుకాణాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనతా కర్ఫ్యూ తరువాత లాక్‌డౌన్ ప్రకటించడంతో మద్యం దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు లిక్కర్‌ను మద్యం షాపుల నుంచి మాయం చేస్తున్నారు. మద్యం ప్రియుల అవసరమే అదనుగా భావించిన వ్యాపారులు తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. ఎమ్మార్పీ ధరకు కంటే ఎక్కవగా వేలాది రూపాయలు పెంచి మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

బండారం బయట పడుతది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చాపకింద నీరులాగా అక్రమంగా మద్యం వ్యాపారం సాగుతున్నది. కానీ, ఎక్సైజ్ అధికారులు మాత్రం.. మద్యం విక్రయించేవారు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంలేదని‌, కొనేవారు చెప్పేందుకు ముందుకు రావడంలేదన్న సాకు చూపుతున్నారు. కానీ, ఎక్సైజ్ రికార్డులను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వైన్ షాపు ద్వారా జరిగే యావరేజి అమ్మకాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతది. లైసెన్స్ షాపుల నుండి మద్యం ఎలా మాయం అయ్యిందో అనేది ఈజీగా పసిగట్టేయవచ్చు. అంతేకాకుండా లిక్కర్ బ్యాచ్ నంబర్లవారీగా ఐఎంఎల్ డిపోల నుంచి వైన్ షాపులకు మద్యం సరఫరా చేస్తారు. వైన్ షాపులకు చేరిన మద్యం బాటిళ్లకు వైన్‌షాపు కోడ్‌తో స్టిక్కరింగ్ చేస్తారు. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని విచారిస్తే వైన్‌షాపుల బండారం బయట పడుతుంది.

లాక్‌డౌన్‌కు రెండు మూడు రోజుల ముందు మద్యం దిగుమతి చేసుకున్న వైన్ షాపుల నుంచి కూడా లిక్కర్ బ్లాక్ మార్కెట్ కు చేరింది. ఒకటి రెండు రోజుల్లో భారీ మొత్తంలో వైన్‌షాపునకు చేరిన మద్యం స్టాక్ కొంతమేరా తగ్గినా మిగతా లిక్కర్ అలాగే ఉండాలి. కానీ, యావరేజి అమ్మకానికి మించి వైన్‌షాపుల్లో మందు మాయం అయిందంటే వ్యాపారులు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని షాపుల్లో అయితే మద్యం స్టాక్ జీరోకు చేరిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా వైన్‌షాపుల నుంచి మద్యం అదృశ్యం అయ్యిందంటే అబ్కారీ నిబంధనల ప్రకారం వైన్ షాపును శాశ్వతంగా సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సల్ చేయవచ్చు. వారిపై లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనతోపాటు మరిన్ని కఠినమైన చట్టాలను అమలు చేయవచ్చు. కానీ, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశామన్న ధీమాతో లిక్కర్ షాపులపై నజర్ వేయకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో దొరికిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్న అధికారులు లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది.

బార్లలోనూ…

లిక్కర్ మాఫియా కారణంగా వైన్ షాపుల్లోని మద్యమే కాదు బార్లలోని మద్యం కూడా నల్లబజారులో చిందులేస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా బార్లు కూడా లిక్కర్ మాయమై మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్నది.

సీఎం ఆదేశాలు బేఖాతర్..

లాక్‌డౌన్ కారణంగా సగటు పౌరునిపై భారం పడొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలను నియంత్రించాలని సుచించారు. ధరలు పెంచినవారిపై పీడీ యాక్ట్ కూడా అమలు చేయాలని కూడా ఆదేశించారు. దీంతో అధికారుల దృష్టంతా కూడా ఓపెన్ మార్కెట్ పై ఉంది. కానీ, అసలు లిక్కర్ దందానే కొనసాగించవద్దన్న నిబంధన ప్రకారం నల్ల బజారులో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నవారిపై పలు సెక్షన్లతో పాటు పీడి యాక్ట్ కూడా పెట్టవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా లిక్కర్ అక్రమ దందాపై కొరడా ఝులిపించాల్సిన అవసరం ఉంది.

విజిలెన్స్ ఏం చేస్తోంది..?

లిక్కర్ అక్రమ దందాను కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ పెట్టేందుకు ఎక్సైజ్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినా.. ఆ విభాగాలు కూడా లిక్కర్ షాపుల మాయాజాలాన్ని కంట్రోల్ చేసేందుకు ఎందుకు రంగంలోకి దిగడం లేదోనన్న విషయం అంతుచిక్కకుండా ఉంది.

ఇప్పటి వరకూ జరిగిన అక్రమ మద్యం దందాతో రిటైల్ షాపులు, బార్లలో లిక్కర్ స్టాక్ పూర్తయితే రానున్న కాలంలో స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేసే అవకాశాలు లేకపోలేదు. లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు, కేంద్రం మే 3 వరకూ పొడిగించడంతో అక్రమ వ్యాపారులు మరింత దోపిడీ చేసే అవకాశం ఉంది.

tags: Karimnagar, liquor sales, authorities, cases, corona

Tags:    

Similar News