నిర్మాణాలపై సీక్రెట్ దందా.. ఆయనదే కీ రోల్..?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అక్కడో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది. తమ కలల సౌథం నేడో, రేపో పూర్తి కాబోతోందన్న సంతోషంతో ఆ ఇంటి యజమాని కలలు కంటున్నాడు. అంతలో రయ్ మంటూ ఓ వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పర్మిషన్ తీసుకున్నది ఎప్పుడు? అనుమతికి సంబంధించిన వివరాలు చూపండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్పటివరకు సంతోషంలో తేలియాడుతున్న ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురై వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. వారిలో […]

Update: 2021-02-14 21:11 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అక్కడో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది. తమ కలల సౌథం నేడో, రేపో పూర్తి కాబోతోందన్న సంతోషంతో ఆ ఇంటి యజమాని కలలు కంటున్నాడు. అంతలో రయ్ మంటూ ఓ వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పర్మిషన్ తీసుకున్నది ఎప్పుడు? అనుమతికి సంబంధించిన వివరాలు చూపండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్పటివరకు సంతోషంలో తేలియాడుతున్న ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురై వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. వారిలో ఒకరు.. పర్మిషన్ కాపీలతో వెళ్లి ఫలానా వారిని కలవండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. నిత్యకృత్యంగా మారిన ఈ వ్యవహారంలో కేవలం ప్రైవేటు వ్యక్తులే కాదు.. బల్దియా యత్రాంగం కూడా ఇన్ వాల్వ్ అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అడ్డుకునే వారేరీ..?

ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కలిసిన ఆయా గ్రామాల్లో విచ్చలవిడిగా ఈ తంతు సాగుతోందని అడ్డుకునే వారే లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న సైన్యం బల్దియాకు సంబంధం లేకున్నా తనిఖీలు చేయడం ఏంటో అంతుచిక్కక సగటు పౌరులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీ పరిధిలో అయితే జీ ప్లస్ వన్ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉండగా అదనపు అంతస్తులకు వరంగల్ రీజినల్ కార్యాలయం నుంచి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

యజమానులకు వార్నింగ్

ఇటీవలె కార్పొరేషన్ పరిధిలో విలీనం అయిన ఆయా పంచాయతీల్లో జరుగుతున్న భవన నిర్మాణాలపై డేగకళ్లతో నిఘా వేస్తున్న సెపరేట్ సైన్యం ఇంటి యజమానుల వద్దకు వెళ్లి వార్నింగ్‌ ఇస్తున్నారు. దీంతో యజమానులు వారు చెప్పిన వారి వద్దకు వెళ్లి కలిస్తే తప్ప ఇంటి నిర్మాణం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇంటి యజమానులు కలవకపోతే రెండో సారి నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు కూడా సాహసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నగరంలో కూడా ఇదే విధంగా కొంతమంది బల్దియా సిబ్బంది దాడులు చేస్తూ చివరకు వారు చెప్పిన సదరు వ్యక్తిని కలిసి వస్తేనే ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండడం లేదని తెలుస్తోంది. నగరంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న తీరు స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.

రూల్స్ అతిక్రమిస్తే చర్యలేవి..?

ఇంటి నిర్మాణంలో భాగంగా సెల్లార్‌లు నిర్మించుకున్నా, అదనపు అంతస్థులు వేసుకుంటున్న వారిపై ప్రత్యేక నిఘా వేస్తున్నప్పటికీ వారి పనులకు ఆటంకం కలిగినా ఆ తరువాత ఎందుకు చల్లబడిపోతున్నారోనన్న చర్చ సాగుతోంది. కేవలం తమ ప్రాపకం పొందితే చాలు అన్నట్లుగా జరుగుతున్న ఈ తంతుపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కూడా ఈ విషయంపై బల్దియా అధికారులను నిలదీసినట్లు సమాచారం.

కీ రోల్ పర్సన్ చేతిలోనే..

మున్సిపాలిటీలో అత్యంత కీ రోల్ పోస్టులో ఉన్న ప్రముఖుని కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా సాగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ పర్సన్‌కే సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

విచారణ చేస్తే వెలుగులోకి వాస్తవాలు..

కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న ఈ దాడుల తరువాత బల్దియా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడం విడ్డూరం. నామమాత్రంగానే వారిని పిలిచి, పంపించడం వెనక ఏమైనా ఆంతర్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో రహస్య ఒప్పందాలు సాగుతున్నాయన్న ప్రచారం కూడా జోరందుకుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు పలువురు.

Tags:    

Similar News