జ్వరం, గొంతునొప్పి మాత్రలు కొంటే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే!

దిశ, న్యూస్ బ్యూరో: జ్వరం, గొంతునొప్పి మాత్రలను కొనుక్కోడానికి మనం మందుల షాప్‌నకు వెళ్తే తప్పకుండా మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే. మిగిలిన మాత్రల సంగతి ఎలా ఉన్నా కరోనా వైరస్ లక్షణాలు కలిగిన జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు లాంటి సమస్యలకు మందులషాపులో మాత్రలను కొంటే యజమాని కూడా మనకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాల్సిందే. ఆ బిల్లుపైన మన పేరు, ఫోన్ నంబర్‌ను రాయాలి. అపోలో, మెడ్‌ప్లస్ లాంటి చైన్ దుకాణాలు ఆ విధానాన్ని పాటించడానికి సమ్మతి […]

Update: 2020-04-17 08:39 GMT

దిశ, న్యూస్ బ్యూరో: జ్వరం, గొంతునొప్పి మాత్రలను కొనుక్కోడానికి మనం మందుల షాప్‌నకు వెళ్తే తప్పకుండా మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే. మిగిలిన మాత్రల సంగతి ఎలా ఉన్నా కరోనా వైరస్ లక్షణాలు కలిగిన జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు లాంటి సమస్యలకు మందులషాపులో మాత్రలను కొంటే యజమాని కూడా మనకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాల్సిందే. ఆ బిల్లుపైన మన పేరు, ఫోన్ నంబర్‌ను రాయాలి. అపోలో, మెడ్‌ప్లస్ లాంటి చైన్ దుకాణాలు ఆ విధానాన్ని పాటించడానికి సమ్మతి తెలిపాయి. మిగిలిన షాపుల విషయంలోనూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దీన్ని తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి మాత్రలు కొన్నవారి వివరాలను సేకరించే పనికూడా మొదలైంది. కానీ, ఇకపైన మాత్రం ఇది ఒక షరతుగానే అమలు కానుంది. నగరంలో చాలామంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా మందుల దుకాణాల నుంచి ఇవి కొనుక్కుంటున్నారని, వైద్యసిబ్బందికి వివరాలు ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారని ప్రభుత్వానికి బలమైన అనుమానం రావడంతో ఇప్పుడు ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తోంది. ఫలితంగా వ్యాధి లక్షణాలు ఇతరులకు సోకి కరోనా బారిన పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని నివారించడానికి కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

కంటైన్‌మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు

నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని కంటైన్‌మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు జరుగుతున్నాయి. ఇళ్ళల్లోనివారిని బయటకు వెళ్ళనీయకుండా, బయట వ్యక్తులను కాలనీల్లోకి రాకుండా కాలనీ మొత్తం సీల్ అయింది. ఇంటింటికీ తిరిగి కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారు. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు ఆ విషయాన్ని దాచిపెడుతున్నారని, లక్షణాలు ఉన్నా వైద్య చికిత్స చేయించుకోడానికి ముందుకు రావడంలేదని, వారిని కనిపెట్టడం ప్రభుత్వ వైద్య సిబ్బందికి క్లిష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కంటైన్‌మెంట్ జోన్లలో జరుగుతున్న పనులను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ”జ్వరం, గొంతు నొప్పి సమస్యలతో మందుల షాపు నుంచి మాత్రలను కొన్నవారి వివరాలను సేకరించాలి” అని సూచించారు. అయితే ఇప్పటిదాకా అలాంటి విధానం ఉనికిలో లేనందువల్ల ఇకపైన అది నిర్బంధం కానుంది.

వ్యాధిలక్షణాలను దాచిపెడుతున్నవారిని ప్రభుత్వం ఈ రకంగా గుర్తించనుంది. స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ లాంటివారు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఈ రకంగా కొరడా ఝళిపించనుంది. అజిత్రోమైసిన్ లాంటి మాత్రలు కొన్నా కూడా వారి వివరాలను మందులషాపు నిర్వాహకులు తీసుకోనున్నారు. కచ్చితంగా బిల్లుపై వినియోగదారుల మొబైల్/లాండ్‌లైన్ నెంబర్ విధిగా ఉండేలా చూస్తున్నారు నిర్వాహకులు. ప్రతీరోజూ నగరంలోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఈ పని చేయనున్నారు. జీహెచ్ఎంసీ లేదా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సహకారాన్ని తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం తరచూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, నగరంలోని కెమిస్ట్ / ఫార్మసీ అసోసియేషన్ సభ్యులు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో సైతం ఈ విధానం అమల్లోకి రానుంది.

Tags: Telangana, Corona, Positive, Medical Shops, Fever, Throat Pain, Drugs, KTR, Review

Tags:    

Similar News