మీ కోరికలపై హెచ్ఎండీఏ సర్వే.. సర్వత్రా ఆసక్తి
దిశ, న్యూస్‌బ్యూరో: అన్‌లాక్ 2.0 ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 24న లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజా రవాణా స్తంభించిపోయింది. బస్సులూ, రైళ్లూ నడవడం లేదు. ప్రైవేట్, ఐటీ కంపెనీలు ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోం’ చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం సడలింపులు అమలవుతున్న నేపథ్యంలో ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లేవారి కోసం ప్రజారవాణాను పునరుద్ధరించాలనే డిమాండ్ వస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అన్‌లాక్ 3.0లో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైళ్లకు అనుమతినివ్వకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కట్టడి అనంతరం […]
దిశ, న్యూస్‌బ్యూరో: అన్‌లాక్ 2.0 ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 24న లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజా రవాణా స్తంభించిపోయింది. బస్సులూ, రైళ్లూ నడవడం లేదు. ప్రైవేట్, ఐటీ కంపెనీలు ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోం’ చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం సడలింపులు అమలవుతున్న నేపథ్యంలో ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లేవారి కోసం ప్రజారవాణాను పునరుద్ధరించాలనే డిమాండ్ వస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అన్‌లాక్ 3.0లో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైళ్లకు అనుమతినివ్వకపోవచ్చని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కట్టడి అనంతరం గ్రేటర్ ప్రజలు రవాణా సదుపాయాలు, ఎలాంటి వసతులను కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలి టన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, (హెచ్‌యూఎంటీఏ) సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నాయి. కుటుంబంలో ఎన్ని బైకులు, కార్లు ఉన్నాయో ఆరా తీస్తున్నాయి. లాక్డౌన్ కు ముందు ఇంటి నుంచి ఆఫీస్ వరకూ ఎలా వెళ్లేవారో తెలుసుకుంటున్నారు. బస్, మెట్రో, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్, కార్, కంపెనీ వెహికల్స్ దేనిలో ప్రయాణించేవారో తెలుసుకుంటే ఎక్కువ మంది ఉపయోగించే రవాణా సదుపాయాలపై ఓ అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీస్ ఎంత దూరం? ఆఫీస్ నుంచి బస్టాప్, మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ వరకూ ఎలా చేరుకుంటున్నారు? ప్రజారవాణా సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలూ సర్వేలో ఉన్నాయి.
లాక్‌డౌన్‌కు ముందు.. ఆ తర్వాత
లాక్డౌన్ కు ముందు వారంలో ఆరు రోజులు ఆఫీసులకు, కంపెనీలకు వెళ్లినవారు, ఆ తర్వాత సగం రోజులు మాత్రమే వెళ్తున్నట్టు సర్వేలో తేలింది. కంపెనీ ట్రావెల్ వెహికిల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేకపోవడం ఇందుకు ఒక కారణంగా పేర్కొంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులను ప్రారంభిస్తే, మళ్లీ ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు మెజారిటీగా అవుననే సమాధానం వస్తోంది. ప్రజారవాణా వ్యవస్థలను పునరుద్ధరిస్తే తీసుకోవాల్సిన జాగ్రతల గురించి ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షేరింగ్ ఆటో, క్యాబ్‌ల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు, మాస్క్‌లు ధరించాలనే డిమాండ్ వస్తోంది. కార్లు, బస్, మెట్రోలతో పాటు ఆఫీస్, ఇతర పనుల కోసం వెళ్లేటపుడు సైక్లింగ్ చేస్తున్నారా? సిటీలో సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తే సైకిల్ వాడేందుకు సిద్ధంగా ఉన్నారా అని కూడా అడుగుతున్నారు. రద్దీగా ఉండే సమయాలతోపాటు ఎక్కువగా ఏ ప్రయాణ సాధానాలు వాడుతున్నారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ‘వర్క్ ఫ్రం హోం’ ప్రయోజనకరంగా ఉందా? లాక్డౌన్ ముగిసినా కొనసాగించాలనుకుంటున్నారా లేక కార్యాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలూ సంధిస్తున్నారు.