ఏజెన్సీలో జోరుగా గుట్కా దందా..
దిశ, వాజేడు: నిషేధిత గుట్కా వ్యాపారం ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలో యధేచ్చగా కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వాజేడు మండలం ఉండడంతో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్ రాష్ట్రం తాళ్లగూడెం నుండి గుట్టుగా గుట్కా ప్యాకెట్లు భారీగా తీసుకువచ్చి, దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. గుట్కా కు అలవాటు పడిన యువత ఎన్ని డబ్బులు అయినా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని వ్యాపారులు రెండింతలు లాభానికి విక్రయిస్తున్నారు. మండలంలో […]
దిశ, వాజేడు: నిషేధిత గుట్కా వ్యాపారం ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలో యధేచ్చగా కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వాజేడు మండలం ఉండడంతో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్ రాష్ట్రం తాళ్లగూడెం నుండి గుట్టుగా గుట్కా ప్యాకెట్లు భారీగా తీసుకువచ్చి, దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. గుట్కా కు అలవాటు పడిన యువత ఎన్ని డబ్బులు అయినా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని వ్యాపారులు రెండింతలు లాభానికి విక్రయిస్తున్నారు. మండలంలో ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. గుట్కా అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ..ఆ ఆజ్ఞలు అమలు కావడం లేదు. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్న కఠినంగా చర్యలు తీసుకోకపోవడంతో యధేచ్చగా విక్రయాలు కొనసాగుతున్నాయి.
గుట్కా ప్యాకెట్లకు విపరీతంగా డిమాండ్ ఉండటంతో వేలల్లో పెట్టుబడులు పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. దీంతో చత్తీస్ ఘడ్ నుండి చెరుకూరు అడ్డాగా భారీస్థాయిలో గుట్కా ప్యాకెట్లు దిగుమతి చేసుకొని, మండలంలోనే కాక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్న వ్యాపారులు అధికమయ్యారు. గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందాగా కొనసాగుతోంది. ఈ అక్రమ వ్యాపారం చేసేవారికి కాసుల పండిస్తూ ఉండగా, గుట్కా మత్తుకు కొన్ని కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. గుట్కాకు బానిసగా మారిన యువత ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో కుటుంబ పోషణ కష్టమై పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా గుట్కా విక్రయం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాజేడు మండల ప్రజలు కోరుతున్నారు.