టెన్షన్.. టెన్షన్.. డీజేలకు నో పర్మిషన్.. ముందుకు కదలని గణపతులు..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనానికి నిర్వాహకులు నో చెప్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో గణపతులను కదిలించేందుకు నిర్వాహకులు ఒప్పుకోవడం లేదు. నిర్మల్ పట్టణంలో సుమారు మూడు వందలకుపైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఆదివారం రోజున నిమజ్జన కార్యక్రమం ఉండగా.. ముందుగా బుధవార్‌పేట్‌లోని ఒకటో నంబర్ గణేష్ విగ్రహానికి స్థానిక మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్ పూజలు […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనానికి నిర్వాహకులు నో చెప్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో గణపతులను కదిలించేందుకు నిర్వాహకులు ఒప్పుకోవడం లేదు. నిర్మల్ పట్టణంలో సుమారు మూడు వందలకుపైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు.
ఆదివారం రోజున నిమజ్జన కార్యక్రమం ఉండగా.. ముందుగా బుధవార్‌పేట్‌లోని ఒకటో నంబర్ గణేష్ విగ్రహానికి స్థానిక మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టాకే నిమజ్జన రథయాత్ర ప్రారంభం అవుతుంది. నిర్మల్ జిల్లాలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని.. తాము డీజేలను అనుమతించబోమని పోలీసులు తెల్పడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఆదివారం రోజున ఉదయం పది గంటలకే బుధవార్‌పేట్‌లోని ఒకటవ నెంబర్ గణేష్ విగ్రహ నిమజ్జన యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
ఆ తర్వాత దాని వెనకాలే వరుసగా అన్ని గణేషుల నిమజ్జన యాత్ర సాగాలి. ఉదయం పది గంటలకు స్థానిక మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్ అక్కడికి చేరుకోగా.. డీజేలకు అనుమతి ఇస్తేనే తాము నిమజ్జన యాత్ర ప్రారంభిస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో మున్సిపల్ చైర్మన్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని నిమజ్జన యాత్ర ప్రారంభించాలని కోరగా అందుకు నిర్వాహకులు ససేమిరా అన్నారు. డీజేలకు అనుమతి ఇవ్వాలని అప్పుడే నిమజ్జన యాత్ర ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు.
తాము మాత్రం డీజేలకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని ఎస్పీ స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి ఇచ్చేది లేదని బ్యాండ్లతో శోభయాత్ర ప్రారంభించాలని ఎస్పీ కోరినా నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో గణపతులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. నిర్మల్ పట్టణంలోని మిగతా మండపాల నిర్వాహకులు కూడా అందరూ అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీగా జన సమీకరణ అయ్యింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో డీజేలకు అనుమతి ఇచ్చారని.. తమకు ఎందుకు ఇవ్వరని నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. తమ జిల్లాలోనే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటూ పేర్కొంటున్నారు.