బిల్లులు చెల్లించం.. వర్క్ ఎక్కడుంటే మీరెక్కడ చేశారు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇష్టారాజ్యంగా పనులు సాగుతున్నాయన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విచిత్రంగా సాగుతున్న ఈ వింత పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు కాబోలు. అన్నింటా అభివృద్ధి చేసి చూపిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకవర్గం టెక్నికల్‌గా జరుగుతున్న తప్పిదాలను సవరించకపోవడం విస్మయం కలిగిస్తోంది. మంజూరు ఓ చోట.. కార్పొరేషన్‌లోని వివిధ ప్రాంతాల్లో 69 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు కూడా చేశారు. కాంట్రాక్టర్లు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇష్టారాజ్యంగా పనులు సాగుతున్నాయన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విచిత్రంగా సాగుతున్న ఈ వింత పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు కాబోలు. అన్నింటా అభివృద్ధి చేసి చూపిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకవర్గం టెక్నికల్‌గా జరుగుతున్న తప్పిదాలను సవరించకపోవడం విస్మయం కలిగిస్తోంది.
మంజూరు ఓ చోట..
కార్పొరేషన్‌లోని వివిధ ప్రాంతాల్లో 69 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు కూడా చేశారు. కాంట్రాక్టర్లు పనులు చేపట్టేప్పుడు మార్కింగ్ పెట్టేప్పుడు ఇంజినీరింగ్ అధికారులు నిమ్మకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలని ఎంబీల్లో రికార్డ్ చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు కరీంనగర్ కమిషనర్ వల్లూరి క్రాంతి. పనులు మంజూరు అయిన చోట కాకుండా వేరే చోట పనులెలా చేస్తారని ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కాంట్రాక్టర్లు తమ పనులకు బిల్లులు ఇవ్వండంటూ బల్దియా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సీఎంఏ నిధులే..
చీఫ్ మినిస్టర్ అస్యూరెన్స్ గ్రాంట్ (సీఎంఏ) కింద నగరంలోని వివిధ డివిజన్లలో 69 చోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ పనుల కోసం సుమారు రూ. 60 కోట్లు కేటాయించారు. అయితే టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తైన తరువాత బిల్లులు ఇచ్చే విషయం వచ్చే సరికి నో అని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు కాంట్రాక్టర్లు.
తప్పెవరిది..?
సీఎంఏ నిధులతో చేపట్టిన ఈ పనులు ప్రారంభించేటప్పుడు మేయర్ లేదా సంబంధిత కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఉంటుంది. ఆ తరువాత ఇంజినీరింగ్ అధికారులు పనికి సంబంధించిన మెజర్ మెంట్స్, ఎస్టిమేట్‌కు అనుగుణంగా మార్కింగ్ చేస్తారు. దీంతో కాంట్రాక్టర్ పనులు చేపడతారు. స్టేజీ వైజ్‌గా పనుల తీరును ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ పూర్తి చేయిస్తారు. ఈ తంతు అంతా కావడానికి ఒకటి రెండు రోజులు కాదు నెలల కొద్దీ సమయం పడుతోంది.
ఎవరూ గుర్తించలేదా?
అంతా అధికారుల కనుసన్నల్లోనే సాగే కాంట్రాక్టు పనులు పూర్తయ్యే వరకు మంజూరు చేసిన చోట కాకుండా మరో చోట పనులు చేస్తున్నారన్న విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఇన్ని రకాలుగా స్టెప్ బై స్టెప్ పనులు జరిపి పూర్తయిన తరువాత ఇప్పుడు కొర్రీలు పెట్టడం ఏంటన్నది అంతుచిక్కకుండా తయారైంది. ఇంజినీర్లు ఎంబీలు రికార్డ్ చేసినప్పుడు మంజూరు అయిన లెటర్, వర్క్ ఆర్డర్, అగ్రిమెంట్లను పరిశీలిస్తారు. అయితే ఇప్పుడు ఫైనల్ బిల్లు కోసం పంపిన ఫైల్‌లో తప్పు జరిగిందని గుర్తించి కాంట్రాక్టర్లను బలి చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇంజినీరింగ్ వింగ్ చేసిన తప్పిదాలకు కాంట్రాక్టర్లు శిక్ష అనుభిస్తున్నట్లు తయారైంది. పనులను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా విజిట్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో కూడా పనులు వేరే చోట జరుగుతున్నాయని గుర్తించకపోవడం ఏమిటో అధికారులకే తెలియాలి.
కాంట్రాక్టర్ల ఆందోళన..
రెండేళ్ల క్రితం చేపట్టిన పనుల విషయంలో బిల్లులు మంజూరు చేసే సమయానికి తప్పుడు పనులు జరిగాయని అడ్డుకోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పనులకు వెచ్చించిన రూ. కోట్లు తమ చేతుల్లోకి రావని కలత చెందుతున్నారు. కమిషనర్ అప్రూవల్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసేందుకు అనుమతి కోసం సెక్రటరీకి ఫైలును పంపిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు.
యంత్రాంగం తప్పు లేదా?
పనులు పూర్తైన తరువాత ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బల్దియా అధికారులు అవి ప్రారంభించినప్పటి నుంచి ఏం చేశారన్నదే అర్థం కాకుండా పోతోందని అంటున్నారు. శంకుస్థాపన చేసిన రోజు నుంచి చివరి వరకూ పట్టించుకోకుండా, చెక్ మేజర్, ఫైనల్ ఎంబీ రికార్డ్ చేసిన తరువాత అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరం.