మాజీ మేయర్ రవీందర్ సింగ్ నయా స్కెచ్.. TRS పార్టీకి ఓటమి ఖాయం..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త నినాదంతో రవీందర్ సింగ్ ముందుకు సాగే యోచనలో ఉన్నారు. బీసీ బిడ్డ అయిన ఎల్. రమణకు నష్టం వాటిల్లకుండా తన వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. ఒక ఓటు రమణకు, మరో ఓటు నాకు వేయండి అంటూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అభ్యర్థించనున్నారు. బీసీ నేత కావడంతో రమణకు అనుకూలంగా వ్యవహరించినట్టయితే బీసీ సామాజిక వర్గాల నుంచి తనకు సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త నినాదంతో రవీందర్ సింగ్ ముందుకు సాగే యోచనలో ఉన్నారు. బీసీ బిడ్డ అయిన ఎల్. రమణకు నష్టం వాటిల్లకుండా తన వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. ఒక ఓటు రమణకు, మరో ఓటు నాకు వేయండి అంటూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అభ్యర్థించనున్నారు. బీసీ నేత కావడంతో రమణకు అనుకూలంగా వ్యవహరించినట్టయితే బీసీ సామాజిక వర్గాల నుంచి తనకు సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఓటర్లు తనకు పట్టం కడతారని కూడా భావిస్తున్నారు.
లక్ష్యం ఆ సామాజిక వర్గమే..
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గమే టార్గెట్‌గా ముందుకు సాగితే సత్ఫలితం పొందుతామని కూడా అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ సామాజిక వర్గంపై చాలా సామాజిక వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే కనిపిస్తాడని. ఆ తరువాత తమ వైపు కన్నెత్తి కూడా చూడడన్న భావన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా రెండో సారి ఎమ్మెల్సీ అయినప్పుడు మాట ఇచ్చి తప్పాడని కూడా వారు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఆయనపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకుంటే చాలు తన గెలుపు నల్లేరుపై నడేకనన్న అభిప్రాయంతో రవిందర్ సింగ్ ఉన్నారు.
ఆ పార్టీల మద్దతు..
అంతేకాకుండా 330 మంది ఓటర్లు ఉన్న టీఆర్ఎస్ ఏతర పార్టీలకు చెందిన వారు ఉండగా మిగతా ఆయా పార్టీల ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపితే సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఓటర్లలో కూడా ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తే చాలు విజయం వరిస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో రవీందర్ సింగ్ టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. చివరకు మంగళవారం ప్రారంభమైన టీఆర్ఎస్ క్యాంప్ నుంచి కూడా బయటకు వచ్చిన వారిలో చాలా మంది కనీస సౌకర్యాలు లేవంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా తమకు గుడ్‌విల్ ఇచ్చేందుకు అభ్యర్థులు సాహసించడం లేదన్న విషయం తెలిసి లోలోన మదనపడిపోతున్నారు. మొక్కుబడిగా క్యాంప్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అక్కసును వెల్లగక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని తన గెలుపుకు అవసరమైన విధంగా స్కెచ్ వేసుకుంటే సరిపోతుందని రవిందర్ సింగ్ భావిస్తున్నట్టుగా సమాచారం.