కరోనా మృతుల అంత్యక్రియలకు 'ఫీడ్ ద నీడీది' హెల్పింగ్
దిశ, క్రైమ్ బ్యూరో : కరోనాతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. మనుషుల మధ్య అంతరాలనూ మరింత పెంచుతోంది. కరోనాతో మరణించిన కన్న తల్లిదండ్రులను కూడా ఖననం చేయలేని దౌర్భాగ్యంలో నేటి సామాజిక పరిస్థితులు నెలకున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడం ఖరీదుగా మారింది. దీంతో అభాగ్యులు మరింత మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ తరహా సమకాలీన సామాజిక పరిస్థితులకు చలించిన 10 మంది ఐటీ ఉద్యోగులు […]
దిశ, క్రైమ్ బ్యూరో : కరోనాతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. మనుషుల మధ్య అంతరాలనూ మరింత పెంచుతోంది. కరోనాతో మరణించిన కన్న తల్లిదండ్రులను కూడా ఖననం చేయలేని దౌర్భాగ్యంలో నేటి సామాజిక పరిస్థితులు నెలకున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడం ఖరీదుగా మారింది. దీంతో అభాగ్యులు మరింత మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ తరహా సమకాలీన సామాజిక పరిస్థితులకు చలించిన 10 మంది ఐటీ ఉద్యోగులు లాస్ట్ రైడ్ పేరుతో అంబులెన్స్ సేవలను ఉచితంగా ప్రారంభించారు. అంత్యక్రియలను సైతం నిర్వహిస్తూ పలువురి చేత శభాష్ అన్పించుకుంటున్నారు.
ఫోన్ చేస్తే చాలు..
నగరానికి చెందిన ఎన్జీఆర్ఐ మాజీ డెరెక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. భర్తకు కరోనా రావడంతో భార్య హోం క్వారంటైన్ కావాల్సి వచ్చింది. పిల్లలిద్దరూ అమెరికా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నారు. ప్రపంచం అంతటా కరోనా మరణ మృదంగమే ఉన్నందున అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె రాలేని పరిస్థితి. దీంతో ఆ మాజీ డైరెక్టర్ పిల్లలిద్దరూ వైద్యులతో సంప్రదింపులు చేశారు. అతను బతికే పరిస్థితి లేదని, వెంటిలేటర్ పై ఉన్నాడని, అర్ధగంట ముందుగా అంబులెన్స్ సిద్దం చేసుకోవాలని అమెరికాలోని పిల్లలకు వైద్యులు చెప్పారు. దీంతో లాస్ట్ రైడ్ సర్వీస్ నిర్వహించే ఫీడ్ ద నీడీ సంస్థకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బిల్ సెటిల్మెంట్ కాగానే, అర్ధగంట ముందుగా ఆస్పత్రి ఎదుట అంబులెన్స్ సిద్ధంగా ఉండటంతో ఆ మాజీ డైరెక్టర్ కు వెంటిలేటర్ తొలగించడంతో ప్రాణాలు పోయాయి. ఆయనకు అందరూ ఉన్నా ఫీడ్ ద నీడీ సభ్యులు అనాథలా అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.
అలాగే నగర శివారు మేడిపల్లికి చెందిన ఒక దినసరి కూలీ కుటుంబంలో ఉన్న ముగ్గురు సభ్యులకూ కరోనా పాజిటివ్ అని తేలింది. అందులో ఇంటి పెద్దాయన వ్యాధితో చనిపోయాడు. ఆ కుటుంబ సభ్యులు ఫీడ్ ద నీడీ సంస్థకు ఫోన్ చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఎలాగైనా ఆదుకోవాలని వేడుకున్నారు. హృదయ విదారకంగా ఉన్న ఆ పరిస్థితులను గమనించిన ఫీడ్ ద నీడీ సభ్యులు ఆ భౌతికదేహానికి అంత్యక్రియలకు అన్ని ఖర్చులు వాళ్లే భరించి నిర్వహించారు. ఇలా హైదరదాబాద్ మహానగరంలోని ఏ కరోనా మృతునికైనా అంత్యక్రియలు చేసేందుకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నది ఫీడ్ ద నీడీ సంస్థ. అందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు అంబులెన్స్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగరంలో ఏ ప్రాంతంలో కరోనా మృతులైనా లేదా సాధారణ మృతులైనా నిరుపేదలకు అంత్యక్రియలు చేసేందుకు ఈ అంబులెన్స్ సేవలను నిర్వహిస్తున్నారు.
స్వానుభవం నుంచే లాస్ట్ రైడ్..
నగరంలోని పలు కంపెనీలలో అంకిత్ రాజ్, అనుమోద్ థామస్, ప్రదీప్ గాడిచర్ల, ప్రశాంత్ మామిడాల, రమన్ జిత్ సింగ్, శ్రీనివాస్ బెల్లం, సాయితేజ కాట్రగడ్డ, సురేంద్ర ఉప్లాంచివార్, విద్యాసాగర్ జగదీశన్, వినయ్ వంగాల ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కరోనా ఆపత్కాలంలో నిరుపేదలకు అండగా ఉండాలని భావించిన వీరంతా లాక్ డౌన్ పీరియడ్ లో ఆకలితో అలమటించే అన్నార్తులకు తమ సొంత ఖర్చులతో సుమారు 50 వేల ఆహార ప్యాకెట్ లను పంపిణీ చేశారు. ఆ తర్వాత 35 వేల మందికి నిత్యావసరాలు అందించారు. ఈ సమయంలోనే ఫీడ్ ద నీడీ సంస్థను నెలకొల్పారు. అన్ లాక్ డౌన్ తర్వాత ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయాల్సిన అవసరం ఉందంటూ చర్చించారు. ఈ క్రమంలోనే టీమ్ సభ్యుల్లో ఒకరైన రమన్ జిత్ సింగ్ తల్లి కరోనాతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. ఆ సమయంలో ఆస్పత్రి వాళ్లు అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు సాహసించలేదు. ఆ తల్లి మృతదేహాన్ని 9 కిలోమీటర్లు తరలించేందుకు పాతిక వేలు వెచ్చించాల్సి వచ్చింది.
సమాజం పట్ల అవగాహన కలిగిన తమకే అంబులెన్స్ దొరకని అనుభవం ఎదురైతే.. ఇక సామాన్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయోనంటూ అంబులెన్స్ సేవలను ఉచితంగా అందించాలని భావించారు. జూలై 4వ తేదీన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ సేవలను జూలై 27 నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, ఆగస్టు 8వ తేదీ నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాస్ట్ రైడ్ పేరుతో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మొదట్లో ఒక్కో ఖననానికి దాదాపు పాతిక వేలు ఖర్చు అయ్యేవి. మృతదేహాలను కూడా ఖననానికి స్మశాన వాటికలకు అనుమతించని నేటి ప్రత్యేక పరిస్థితుల్లో వీరి సేవా గుణానికి ముగ్ధులైన ఈఎస్ఐ స్మశాన వాటిక నిర్వాకులు వీరికి సహకరిస్తున్నారు. జూలై 4 నుంచి ప్రారంభమైన లాస్ట్ రైడ్ ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్ లోని 40 మృత దేహాలను శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. అందులో 3 మాత్రమే సాధారణ మరణాలు. మిగతావన్నీ వివిధ ఆస్పత్రుల నుంచి తీసుకెళ్లిన కరోనా మృతదేహాలే ఉన్నాయి.
అంబులెన్స్ సేవలు విస్తరిస్తాం: సాయితేజ కాట్రగడ్డ, ఫీడ ద నీడీ సభ్యులు
సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. అత్యధిక ప్రజలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఫోన్ నెంబరును సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాం. కరోనాతో అసలే ఆర్థిక సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో అభాగ్యుల, నిరుపేదల కుటుంబాలకు మేము అందిస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో ఏ మూలకైనా మా సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. వాహనాలకు రథ సారథిగా పనిచేస్తున్న డ్రైవర్లకు వేతనంతో పాటు జీవిత బీమా కూడా ఏర్పాటు చేశాం. ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం.