రైతులను కన్నీరు పెట్టిస్తున్న ‘కాళేశ్వరం’.. ఇంజనీర్ల అంచనా తారుమారు..!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయుధంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రైతుల పాలిట శాపంగా మారింది. దీపం కింద చీకటి అన్న రీతిలో వారి పరిస్థితి తయారైంది. ఏకంగా మూడేళ్ల పాటు ఆరు పంటలు వేసుకోలేని దుస్థితిలో అక్కడి రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. అధికారుల ముందు చూపు లేని తనమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా తెలియదు కానీ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కాలంలో నిన్న మొన్నటి వరకు సిరులు పండించిన […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయుధంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రైతుల పాలిట శాపంగా మారింది. దీపం కింద చీకటి అన్న రీతిలో వారి పరిస్థితి తయారైంది. ఏకంగా మూడేళ్ల పాటు ఆరు పంటలు వేసుకోలేని దుస్థితిలో అక్కడి రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. అధికారుల ముందు చూపు లేని తనమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా తెలియదు కానీ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కాలంలో నిన్న మొన్నటి వరకు సిరులు పండించిన రైతులు వలస కూలీలుగా మారే ప్రమాదం ఉంది.
మల్లారం రైతుల గోస..
మంథని మండలం ఆరెంద మల్లారం రైతులు మూడేళ్లుగా పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే అభ్యంతరాలు చెప్పిన రైతులను బుజ్జగించి, మాయ మాటలు చెప్పిన అధికారులు నేడు వారి గోడును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేసిన పెద్దపల్లి జిల్లా అధికారులు రైతులను నిండా ముంచారనే చెప్పాలి. ఇంజనీర్లు వేసిన అంచనాలు కూడా తలకిందులయ్యాయి. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అయిన కాళేశ్వరం ఇంజనీర్లు అన్నారం బ్యాక్ వాటర్‌తో ఎదురయ్యే సమస్యను ఎందుకు పట్టించుకోలేదో అంతు చిక్కకుండా పోయింది. తెలంగాణ అంతా సస్యశామలంగా మారాలన్న సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం వల్ల బ్యారేజీల సమీపంలోని గ్రామాల రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
ఇక్కడే ఎందుకో..?
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మానేరు నది నీరు అన్నారం బ్యాక్ వాటర్‌లో మల్లారం వద్దే వచ్చి చేరుతోంది. దిగువ నుంచి ఎత్తిపోసిన నీటితో నిండి ఉండే అన్నారంలోకి ఓ వైపున మానేరు నది వచ్చి చేరుతుండటం, మరో వైపు నుంచి గోదావరి వరద కూడా కలుస్తుండటంతో వాటర్ జంక్షన్‌లా మల్లారం శివారు మారిపోయింది. దీంతో, గోదావరి వరద నీరు, అన్నారం బ్యాక్ వాటర్‌తో మానేరు మీదుగా వచ్చే నీటిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీంతో మానేరు నీరు అంతా కూడా మల్లారం శివారులోని పంటపొలాలను ముంచేస్తున్నాయి. 450 ఎకరాల భూములు మూడేళ్లుగా మునిగిపోతూనే ఉన్నాయి.
మరో వైపున అన్నారం నుంచి ఎగువ ప్రాంతానికి తరలించేందుకు నిలువ ఉంచిన నీరు కూడా మల్లారం పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు నష్ట పరిహారం ఇప్పించండి మహా ప్రభో అంటూ వేడుకుంటే 2018 ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఒక్క సారి కౌలు చెల్లించి ఆ తరువాత చేతులు దులుపుకుంది. గతంలో మానేరు నదిలో ఇక్కడి రైతులు ఏకమై బోర్లు వేసుకుని ఏటా రెండు పంటలు పండించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు తమ కళ్ల ముందే అన్నారం నీటిలో పంటలు మునిగిపోతుంటే కన్నీరు కారుస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అన్నారం నీటిలో ఈ రైతుల కళ్ల నుంచి వస్తున్న నీరు కలిసిపోయి అధికారులకు, ప్రభుత్వానికి కనిపించకుండా పోయిందని ఇక్కడి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ప్రత్యామ్నాయాలు ఎన్నో..
మల్లారం రైతులకు జీవనాధారం అయిన పంట పొలాలు మునిగిపోతున్నాయని తమకు కూడా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అయితే, తమ కుటుంబాలను పోషించుకునేందుకు పెద్ద దిక్కయిన పంట పొలాలన్నీ ముంపునకు గురవుతున్నందున తమ ఇళ్లకు కూడా పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తాము వేరే ప్రాంతాలకు వలస వెళ్లి బ్రతుకుతామని అభ్యర్థిస్తున్నారు. అయితే, అధికారులు పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని భావించి మల్లారం గ్రామ పొలాలు మునిగిపోయే అవకాశం లేదని ప్రభుత్వానికి నివేదించడమే ఇంత దూరం తెచ్చిందని అంటున్నారు.
అన్నారం వాటర్ మల్లారం వైపునకు రాకుండా రూ. కోట్లు వెచ్చించి కరకట్టను నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. మోటర్ల సాయంతో నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. మరో వైపున అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయాలని సర్వే చేశారు. ఇవన్నీ చేసినా చిన్న పాయలా వెళ్లే మల్లారం నీళ్లు.. పొలాల్లో వచ్చి చేరడంతో నీరు నదుల్లో కలిసే అవకాశమే లేదని రైతులు అంటున్నారు. వరద ఉధృతి కారణంగా ఆ నీరు పైపులైన్లు, కాలువల ద్వారా తిరిగి మల్లారానికే చేరుకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తొందరపడి ఇచ్చిన నివేదికను సవరించుకునేందుకు అధికారులు సాహసించకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించి సర్కారుపై అదనపు భారాన్ని మోపుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపలేకపోతున్నారని స్థానిక రైతులు అంటున్నారు.
శాశ్వత పరిష్కారం చూపండి : విస్సన్న మల్లారం రైతు
అన్నారం బ్యారేజ్‌తో మా పంట పొలాలన్ని నిండా మునిగిపోతున్నాయి. దీంతో ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మా కుటుంబాల్లో కొత్తవెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నీటి వనరులు ఉన్న ప్రాంతంలో జీవనం సాగిస్తున్నామని సంబురపడిపోయాం. కానీ ఇప్పుడు అవే నదులు మమ్మల్ని పుట్టి ముంచుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి వృథా ప్రయాస పడటమే అవుతోంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలంటే పరిహారం ఇవ్వడమే అసలైన న్యాయం.