మహబూబ్‌నగర్‌లో ఇప్పుడు అది పెద్ద సవాల్!
దిశ, మహబూబ్ నగర్: ఏటా నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే రైతులు విత్తనాల వేటలో పడతారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. నకిలీలను గుర్తించడం రైతులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో ఆశించిన దిగుబడి రాక ఆందోళన చెందుతున్నారు. ఏటా ఉపయోగించే విత్తన కంపెనీ పేరు మీదనే నకిలీలు పుట్టుకొస్తుడడంతో రైతులు మోసపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి విత్తనాల తయారీ ఎక్కువగా జరుగుతుంది. […]
దిశ, మహబూబ్ నగర్: ఏటా నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే రైతులు విత్తనాల వేటలో పడతారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. నకిలీలను గుర్తించడం రైతులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో ఆశించిన దిగుబడి రాక ఆందోళన చెందుతున్నారు. ఏటా ఉపయోగించే విత్తన కంపెనీ పేరు మీదనే నకిలీలు పుట్టుకొస్తుడడంతో రైతులు మోసపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి విత్తనాల తయారీ ఎక్కువగా జరుగుతుంది. అలాగే పంట సాగు కూడా ఎక్కువగా ఉండడంతో అక్రమ వ్యాపారులు నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేయొద్దని అధికారులు ఎంత చెప్పినా తక్కవ ధర, వివిధ రకాల కారణాలు చెప్తూ వ్యాపారులు రైతులను బొల్తా కొట్టిస్తున్నారు.
బీటీ-3 విత్తనాల విక్రయం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు బీటీ-3 రకం విత్తనాలను అంటగడుతుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 248, జోగుళాంగ గద్వాల జిల్లాలో 194, నారాయణపేటలో 130, నాగర్ కర్నూల్లో 120, వనపర్తిలో 123 లైసెన్స్డ్ విత్తనాల విక్రయదారులు వున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే గద్వాల జిల్లాలో 5కేసులు, నారాయణపేట జిల్లాలో 6 కేసులను అధికారులు నమోదు చేశారు.
పత్తి సాగుపై రైతుల మొగ్గు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా పత్తిని ఎక్కువగా సాగు చేయాలని సూచించడంతో చాలా మంది రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లాలో 4లక్షల 64వేల ఎకరాలకు 1లక్ష67వేల ఎకరాల పత్తి సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3లక్షల 38వేల ఎకరాలకు 1లక్ష23వేల ఎకరాలు, వనపర్తిలో 2లక్షల 38వేల ఎకరాలకు 10వేల ఎకరాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 3లక్షల 40వేల ఎకరాలకు 2లక్షల ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 5లక్షల62వేల ఎకరాలకు 4లక్షల50వేల ఎకరాల పత్తిని సాగు చేసేందుకు నిర్ణయించారు.
నకిలీ విత్తనాలు సీజ్..
కాగా, మే 21న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమిస్తాపూర్ గ్రామంలోని విషాల్ అగ్రో సీడ్స్‌లో సుమారు రూ. 65లక్షల విలువ చేసే 13వేల నకిలి బీటి-3 విత్తన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే మే 28వ తేదిన జోగుళాంగ గద్వాల జిల్లాలో పుల్లూరు చెక్ పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 70 కేజీల విత్తనాలను, 29వ తేదిన అదే గద్వాల జిల్లా అయిజ మండలంలో 3క్వింటాళ్ల విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. జూన్ 3వ తేదిన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో రూ.58వేల విలువ చేసే పత్తి విత్తనాలను పట్టకుకోగా 6వ తేదిన అదే జిల్లా మక్తల్ మండలంలో రూ.57వేల విలువ చేసే విత్తనాలను, అదే రోజు కోస్గి మండలంలో రెండు ఫెర్టిలైజర్ షాపులలో రూ.9వేల విలువ చేసే 22 లీటర్ల గ్లెసెల్ పెస్టిసైడ్స్, కాలం చెల్లిన 4లీటర్ల స్లోగన్ పెస్టిసైడ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా అధికారులు దాడులు చేస్తున్నా నకిలీ విత్తన వ్యాపారులు మాత్రం వివిధ మార్గాల్లో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. కాలం చెల్లిన విత్తన ప్యాకెట్లను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు.