AP MEGA DSC: మెగా డీఎస్సీ ముహూర్తం ఖరారు.. వచ్చే నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

దిశ డైనమిక్ బ్యూరో: ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (ChandrababuNaidu) ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యం కావాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలకపాత్ర అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ప్రజల సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పమన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే ఆదాయం కావాలన్నారు. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని, పరిపాలన ఎంతకాలం కొనసాగిస్తామని ప్రశ్నించారు. 4000 పింఛన్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలకు సక్రమంగా అందజేయాల్సిన బాధ్యత కలెక్టర్లవి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశనం చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ ఉత్తమ విధానాలను అవలంభించడం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.