చిల్లర గాళ్లతో మొరిగిస్తే భయపడను : కేసీఆర్‌కు ఈటల మరో సవాల్..!
దిశ, జమ్మికుంట: కిరాయి మనుషులకు డబ్బులు ఇచ్చి చిల్లర ఆరోపణలు చేయిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హెచ్చరించారు. ‘ప్రజాదీవెన’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఇల్లందకుంట మండలం గడ్డి వాడిని పల్లిలో మాట్లాడారు. ఇన్నిరోజులు తన కిరాయి మనుషులతో విమర్శలు చేయించిన కేసీఆర్ తాజాగా బీజేపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుతో తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘నా భార్య ఇప్పటికే సవాల్ చేసిందని, మా దగ్గర ఒక్క ఎకరం భూమి అక్రమంగా […]
దిశ, జమ్మికుంట: కిరాయి మనుషులకు డబ్బులు ఇచ్చి చిల్లర ఆరోపణలు చేయిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హెచ్చరించారు. ‘ప్రజాదీవెన’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఇల్లందకుంట మండలం గడ్డి వాడిని పల్లిలో మాట్లాడారు. ఇన్నిరోజులు తన కిరాయి మనుషులతో విమర్శలు చేయించిన కేసీఆర్ తాజాగా బీజేపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుతో తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘నా భార్య ఇప్పటికే సవాల్ చేసిందని, మా దగ్గర ఒక్క ఎకరం భూమి అక్రమంగా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని’’ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే తమ ఉసురు తగిలిపోతారన్నారు. నేను రుషిని కాదు శపించడానికి, కానీ ధర్మమంటూ ఒకటి ఉందని వ్యాఖ్యానించారు.
‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే నాతో కొట్లాడు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా’ అని సీఎం కేసీఆర్‌కు ఈటల మరోసారి సవాల్ విసిరారు. ఆనాడు నయీం లాంటి గూండాలతో చంపించాలని చూసినా నేను భయపడలేదని మరోమారు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై గంటలకొద్ది పడుకున్నోళ్లం, ఎక్కడ తిన్నమో, ఎక్కడ పడుకున్నమో, మా మీద ఎన్నికేసులున్నవో తెలంగాణ ప్రజలకు తెలియదా..? ఆనాడు ధీరులమని పొగడి, నీకు తమ్ముళ్లమని చెప్పి.. అంతలోనే ఎందుకు దయ్యమయ్యాను. ఏం తప్పు చేసాను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని, ఫించన్లు ఇవ్వాలని చెప్పడమే తప్పా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హుజురాబాద్‌లో కేసీఆర్ అహంకారానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని పునరుద్ఘాటించారు. మీ ఫొటోలు ఫ్లెక్సీల మీద ఉంటే నా ఫొటోలు ప్రజల గుండెల్లో ఉంటాయని ఈటల చెప్పుకొచ్చారు.