ఈడీ దర్యాప్తులో ఏం తేలనుంది?

దిశ ఏపీ బ్యూరో: తమిళనాడు అరంబక్కంలోని ఎలవూరు చెక్‌పోస్టు వద్ద ఈనెల 15న కారులో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రూ. 5.27 కోట్ల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తు ఆరంభించింది. మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత బాలినేనిపై ఆరోపణలు రావడంతో ఈ కేసును మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ శుక్రవారం నుంచే దర్యాప్తును ప్రారంభించడంతో ఏపీ రాజకీయ […]

Update: 2020-07-26 09:28 GMT

దిశ ఏపీ బ్యూరో: తమిళనాడు అరంబక్కంలోని ఎలవూరు చెక్‌పోస్టు వద్ద ఈనెల 15న కారులో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రూ. 5.27 కోట్ల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తు ఆరంభించింది. మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత బాలినేనిపై ఆరోపణలు రావడంతో ఈ కేసును మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ శుక్రవారం నుంచే దర్యాప్తును ప్రారంభించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది.

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనలో అక్రమంగా నగదు తరలిస్తున్న కారుపై ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో రాజకీయ దుమారం రేపింది. అధికారపార్టీకి చెందిన నాయకుల అక్రమార్జనే పట్టుబడిందంటూ ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. దీంతో పట్టుబడిన నగదు తనదంటూ బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే స్టిక్కర్‌తో తనకు సంబంధం లేదని, దానిని కారు డ్రైవర్ అతికించాడని వెల్లడించారు. అంతేకాకుండా పట్టుబడిన నగదుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్టుల వద్ద సులువుగా వెళ్లేందుకు మాత్రమే డ్రైవర్ ఆ స్టిక్కర్ పెట్టాడని తెలిపారు. ఇంకోవైపు ఏపీ మంత్రి బాలినేని అనుచరుడే నల్లమల్లి బాలు అనే ఆరోపణలు గుప్పుమనడంతో మంత్రి మీడియా ముందుకు వచ్చి ఆ నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఆ స్టిక్కర్ కూడా తనది కాదని తెలిపారు. దీంతో ఆ స్టిక్కర్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరుతో ఉన్న స్టిక్కర్ జరాక్స్ కాపీగా ఐటీ అధికారులు గుర్తించారు. వెంటనే ఆయన కూడా దీనిపై స్పందిస్తూ, బాలుతో తనకు పరిచయం లేదని ప్రకటించారు. తన స్టిక్కర్ వేసుకున్న బాలుపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.

Tags:    

Similar News