రెండవ ప్రపంచ యుద్ధంతో ప్రపంచాన్ని ఏలాలన్న హిట్లర్ ఆలోచనలను ఎద్దేవా చేస్తాడు. హిట్లర్ రూపంలో మంగలి పాత్రను సృష్టించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందిస్తాడు. తర్వాత చాప్లిన్ సర్కస్, వర్ద్రాక్స్, లైం లైట్, ఎ కింగ్ ఇన్ న్యూయార్క్, చాప్లిన్ రివ్యు లాంటి సినిమాలు తీసాడు. వర్ద్రాక్స్ సినిమా తరువాత చాప్లిన్‌ను అమెరికా నుంచి బహిష్కరించారు. 'కింగ్ ఇన్ న్యూయార్క్' సినిమాను నిషేధించారు. 1972లో తిరిగి అమెరికన్ పౌరసత్వం ఇచ్చారు. 1975లో బ్రిటన్ నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. అవార్డులు, ప్రశంసలు ఎలా ఉన్నా తన సినిమాలతో చార్లీ ప్రపంచవ్యాప్తంగా తన ముద్రను వేశాడు. 'విశ్వ కళాకారుడిగా' నిలిచిపోయాడు.
ప్రపంచం ప్రకటిత యుద్ధాన్ని చూస్తున్నది, అనుభవిస్తున్నది. కనిపించని అప్రకటిత యుద్ధాలనూ భరిస్తున్నది. ఆ నేపథ్యంలో చార్లీ చాప్లిన్ తన 'గ్రేట్ డిక్టేటర్' సినిమాలో మంగలి పాత్రతో చేసిన ప్రసంగం నేటికీ పూర్తిగా రెలెవెంట్. అంతటి గొప్ప ప్రసంగం మరే సినిమాలోనూ కనిపించదు. అన్ని కాలాలకూ అన్వయించే సినిమాలను సృజించిన చాప్లిన్ చిరస్మరణీయుడు. ఆ ఉపన్యాసంలోని కొంతభాగం ఇలా ఉంటుంది.
'సైనికులారా ఆలోచించండి. దుష్టుల పక్షాన, దుర్మార్గుల పక్షాన నిలబడవద్దు. మీకు తిండిపెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. మీ ఆలోచనలను, మీ అనుభూతులను శాసించే హక్కు ఎవ్వరికీ లేదు. మీరు పశువులు కారు. గడ్డిపోచలు కాదు. మానవ యంత్రాలకు దాసోహమనేది లేనే లేదు. యాంత్రిక మేధస్సులు, మాంత్రిక హృదయాలూ గల కృత్రిమ యంత్రాలు వాళ్లు. మీరు యంత్రాలు కాదు, మనుషులు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. ఎదుటివారిని ప్రేమించగల గొప్ప హృదయం ఉంది.
ఎవరిచేతా ప్రేమించబడని కొద్దిమంది యంత్ర-మానవులు మాత్రమే అసహజంగా, అసహ్యంగా, కృత్రిమంగా ప్రవర్తిస్తారు. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. మీలో ఒక మహత్తర శక్తి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సుఖప్రదంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకోగల శక్తి ఉంది. యంత్రాలను సృష్టించగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. దాన్ని బయటికి లాగండి. ఇంకా ఆలస్యమెందుకు? రండి, ప్రజాస్వామ్యం పేరిట ఏకమై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం. ప్రతివాడికీ పని, యువతకు మంచి భవిష్యత్తు, వృద్ధాప్యానికి భద్రత గల ఒక మంచి సమాజాన్ని సృష్టిద్దాం. అబద్ధాలూ, మాయమాటలూ చెప్పి అవినీతిపరులంతా, అహంకారులంతా గద్దెలెక్కుతున్నారు. వాగ్దానాలను నిలబెట్టుకున్నవారు ఇంతవరకూ లేరు. ఇప్పుడు మనకై మనమే వాటిని సాధిద్దాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం స్వేచ్ఛకు అడ్డుగోడలను తొలగిద్దాం. దురాశ, దు:ఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించే ప్రగతి వైపు పయనిద్దాం రండి. అందరం ఏకమవుదాం'
వేదనను చిత్రిక పట్టి
చార్లీ చాప్లిన్ అత్యంత మానవీయ, కళాత్మక హృదయమున్న చలన చిత్రకారుడు. నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో అంతటి మహనీయ సినీ సృజనకారుడు ఇప్పటివరకు జన్మించలేదు. స్వేచ్ఛ, సమానత్వం, మానవీయత ఆయన ప్రధాన ఇతివృత్తాలు. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులలో ఒకేసారి హాస్యాన్నీ, దు:ఖాన్నీ పండించగలిగాడు. చాప్లిన్ సినిమాలు తన కాలంలోనే కాదు, నేటికీ అత్యంత ఆదరనీయంగానూ, అభిమానంగానూ వుంటాయి. అటు పిల్లలనూ ఇటు పెద్దలనూ ఏకకాలంలో అలరించిన ఘనత చాప్లిన్‌దే. ఎక్కడ ఏ విషయంలో మానవ వేదన వున్నా ఆయన స్పందించాడు. అత్యంత హృద్యంగా తన సినిమాలలో ధ్వనింపజేసాడు.
ఆయన సినిమాలు చూస్తూ వుంటే మొదట హాస్యంతో నవ్వుతాం, మరుక్షణం వేదనతో కళ్లు తడి అవుతాయి. ఇంకో క్షణంలో ఆలోచనలలో పడతాం. ఇదీ చాప్లిన్ సాధించిన ఘనత. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ప్రేక్షకులను ఇంతగా ప్రభావితం చేసిన చలన చిత్రకారుడు మరొకరు లేరన్నది అక్షర సత్యం. అందుకే చాప్లిన్ సినిమాలు 'లాంగ్ షాట్‌లో హాస్యాన్నీ, క్లోజ్ అప్‌లో వేదననీ' సంతరించుకుంటాయి. చాప్లిన్ సృష్టించిన 'ట్రంప్' పాత్ర అనితర సాధ్యం. మరే ఇతర సినీ పాత్రతో పోల్చలేని వైవిధ్యభరితం. డర్బీ హ్యాటు, లూజు ప్యాంటూ, పెద్ద బూట్లు, టూత్ బ్రష్ మీసాలు చిత్ర విచిత్రమైన ప్రత్యేక నడక, చేతిలో కర్ర ఇలా వెండి తెరపై రూపొందించబడిన ప్రత్యేక పాత్ర అది. దాని ద్వారా చాప్లిన్ మనుషుల సమస్త ప్రతిస్పందనలనూ పలికించాడు. 'రెడ్ ఆంట్ రిసెస్' అన్న సినిమాలో మొదటిసారిగా ఈ ట్రంప్ పాత్రను సృష్టించాడు చాప్లిన్.
బాల్యం కడు దయనీయం
చార్లీ చాప్లిన్ 16 ఏప్రిల్ 1889న పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. పుట్టగానే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. పది సంవత్సారాల వయసులోనే నటనని వృత్తిగా తీసుకున్నాడు. అత్యంత బాధాకర, దయనీయ బాల్యాన్ని గడిపాడు. తల్లి పిచ్చిదైపోయింది, తండ్రి చనిపోయాడు. ఆ స్థితిలో లండన్ నగర వీధులలో పెరిగాడు. 15 ఏళ్ల వయసులోనే 'షెర్లాక్ హోమ్స్'లాంటి పాపులర్ నాటకాలలో వేషాలు వేసాడు. 1910లో నాటక కంపెనీతో అమెరికాకు వలస వచ్చాడు. 1913 నుంచి 1917 దాకా సినిమాలలో నటించాడు. రెడ్ ఆంట్ రిసెస్, ద ఫ్లోర్ వాకర్, టి ఇమ్మిగ్రెంట్స్, ద పాన్ షాప్, ద క్యూర్, ద ఈసీ స్ట్రీట్, ద ఇమిగ్రెంట్, ద జెంటిల్మాన్ ట్రంప్ లాంటివి గొప్ప హిట్ సినిమాలుగా నిలిచాయి.
1919లో చార్లీ హాలీవుడ్‌లో తన సొంత స్టూడియో నిర్మించాడు. అప్పుడే 'ఫోల్డర్ ఆర్మ్' సినిమాను రూపొందించాడు. 1921 లో 'ద కిడ్' తీసాడు. నిజానికది చాప్లి తన బాల్యాన్ని ఆవిష్కరించుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇందులో ట్రంప్‌కీ, తనకీ ఏ పనీ వుండదు. తిండికే ఉండని స్థితిలో మరొక అనాథ బాలుడిని దత్తత తీసుకుంటాడు. అప్పుడు అద్దాలు బాగు చేసే పనిలో ఉంటాడు. ముందు పిల్లాడు అద్దాలు పగులగోడుతూ వెళతాడు. ఆ వెనకే ట్రంప్ అద్దాలు బాగు చేస్తాం అంటూ బయలుదేరతాడు. ఇదంతా గమనించి ఓ పోలీసు వీరి వెంట పడతాడు. ఇక చూడాలి చాప్లి ఆవిష్కరించిన హాస్యం. దాని వెనకే కనిపించే ఆ ఇద్దరి దయనీయ స్థితి. ఇది చాప్లిన్ సృజనకు పెద్ద కొలబద్ద.
హిట్లర్‌ను గేలిచేసి
1925 లో చాప్లిన్ 'గోల్డ్ రష్' సినిమా తీసాడు. ఇందులో బంగారం కోసం అమెరికన్ల వెంపర్లాటను అద్భుతంగా చూపిస్తాడు. రాత్రికి రాత్రి పెద్ద ధనవంతులమైపోవాలనే వారి దుగ్ధను గేలి చేస్తాడు. 1931 లో తీసిన 'సిటీ లైట్స్' చాప్లిన్ తొలి టాకీ. అందమైన గుడ్డి అమ్మాయి పట్ల తనకున్న ప్రేమను చూపిస్తూ హృద్యంగా సాగుతుంది. చాలా గొప్ప సినిమా. ఇందులో సంభాషణల కంటే సౌండ్ ఎఫెక్ట్స్ గొప్పగా ఉంటాయి. చాప్లిన్ సృజనాత్మక ప్రతిభను ఆవిష్కరిస్తుంది. ఇక 'మాడర్న్ టైమ్స్' చాప్లిన్ మాస్టర్ పీస్‌గా చెప్పొచ్చు. 1936లో వచ్చిన ఈ సినిమాలో 'మనిషి యాంత్రిక సంస్కృతికి ఎలా బానిసైపోతున్నాడు, పర్యవసానంగా ఎలా తనని తాను కోల్పోతున్నాడు' అన్నది ప్రధాన అంశం. తినడానికి సమయం వృథా అవుతోందని, తినిపించే యంత్రాన్ని కనుగొంటాడు. తానే దానికి ఎలా బలి అయిపోతాడో చూపించే దృశ్యం గొప్ప హాస్యాన్ని సృష్టిస్తూనే వాస్తవికతను ఆవిష్కరిస్తుంది.
తరవాత తీసిన 'ద గ్రేట్ డిక్టేటర్' పూర్తి టాకీ సినిమా. ఇందులో నియంత హిట్లర్‌ని గేలి చేస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం తో ప్రపంచాన్ని ఏలాలన్న హిట్లర్ ఆలోచనలను ఎద్దేవా చేస్తాడు. హిట్లర్ రూపంలో మంగలి పాత్రను సృష్టించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందిస్తాడు. తర్వాత చాప్లిన్ సర్కస్, వర్ద్రాక్స్, లైం లైట్, ఎ కింగ్ ఇన్ న్యూయార్క్, చాప్లిన్ రివ్యూ లాంటి సినిమాలు తీసాడు. వర్ద్రాక్స్ సినిమా తరువాత చాప్లిన్‌ను అమెరికా నుంచి బహిష్కరించారు. 'కింగ్ ఇన్ న్యూయార్క్' సినిమాను నిషేధించారు. 1972లో తిరిగి అమెరికన్ పౌరసత్వం ఇచ్చారు. 1975లో బ్రిటన్ నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. అవార్డులు, ప్రశంసలు ఎలా ఉన్నా తన సినిమాలతో చార్లీ ప్రపంచవ్యాప్తంగా తన ముద్రను వేశాడు. 'విశ్వ కళాకారుడిగా' నిలిచిపోయాడు.
వారాల ఆనంద్
94405 01281