కేంద్రం నుండి 8 రూపాయలూ రాలే..!

ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణా ప్రజలు విభజన నాటి హామీలు అమలు చేస్తారని ఎంతగానో ఎదురుచూశారు. కానీ కేంద్ర బ‌డ్జెట్ మొత్తంలో తెలంగాణ

Update: 2024-07-25 01:00 GMT

ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణా ప్రజలు విభజన నాటి హామీలు అమలు చేస్తారని ఎంతగానో ఎదురుచూశారు. కానీ కేంద్ర బ‌డ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేక‌పోవ‌డం బాధాక‌రం. తెలంగాణకు ఈసారి కూడా బడ్జెట్‌లో నిధులు ఇవ్వకుండా కేంద్రం తొక్కి పెట్టింది. ఏపీకి మాత్రం లాభం చేకూరింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కీలకమైన విభజన హామీలు, పారిశ్రామిక రంగంలో న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఇంకా కొనసాగుతున్నది.

ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏపీ, బిహార్ బడ్జెట్‌లాగా ఉంది అని విశ్లేషకుల మాట. గతంలో విభజన చట్టంలోని హమీలైన బయ్యారం స్టీల్‌ ప్లాంట్, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీల విషయంలో ఇంతవరకు అతీగతీ లేదు. రైల్‌ కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు ఇప్పటివరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలపైన ఉలుకూ పలుకూ లేదు. పారిశ్రామిక కారిడార్‌‌పై స్పందన లేదు. ఇలా మొత్తంగా రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఇచ్చింది గుండు సున్నా.

తెలంగాణ పదం కూడా ఇష్టం లేదా?

తెలంగాణ బీజేపీ ఎంపీలూ, బీజేపీ కేంద్ర అగ్ర నాయకులూ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నూరు నినాదాలు, హామీలు ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో నిత్యం వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణాకి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా నిధులు దక్కలేదు. అదే ఆంధ్రప్రదేశ్ 16 మంది ఎంపీలతో కేంద్రాన్ని శాసిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధానితో సహా అన్ని రకాలుగా సాయం అందిస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి సీతారామన్ తెలంగాణ మాటే పలకడానికి ఇష్టపడకపోవడం దారుణం.

ఈ ప్రాంతంలో పదేళ్లలో రైల్వేలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. రైల్వే నెట్‌వర్క్‌ విషయంలో మన రాష్ట్రానికి బడ్జెట్‌లో తక్కువ నిధులే వస్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటివరకూ 30 రైల్వే ప్రాజెక్టులు మంజూరైనా అవి కార్యరూపం దాల్చాలంటే కనీసం రూ.85వేల కోట్లు అవసరమని అంచనా. కానీ, గత సంవత్సరం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,418 కోట్లే కేటాయించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్‌పై ఈసారి భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

హామీ ఇచ్చారు... మరిచారు!

తెలంగాణలో లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణాలను రైలుమార్గంతో అనుసంధానిస్తామంటూ గతంలో కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందుతో పోల్చితే తుది లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఇప్పటికీ వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నారాయణపేట వంటి జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేదు. గత పదేళ్లలో రూ.10,912 కోట్ల విలువైన ఐదు ఎఫ్‌ఎల్‌ఎస్‌ ప్రాజెక్టులు మాత్రమే మంజూరయ్యాయి. తెలంగాణ అవసరాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. అలాగే శంషాబాద్‌ - విజయవాడ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ సర్వేకు రైల్వే బోర్డు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. ఇంకా ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ సర్వే జరుగుతోంది. కరీంనగర్‌ - హసన్‌పర్తి మధ్య 62 కి.మీ కొత్త రైలుమార్గం సర్వే నివేదిక 2013లో రైల్వేబోర్డుకు పంపించారు. అప్పట్లో దాని అంచనా వ్యయం రూ.464 కోట్లు. ఇప్పుడు రూ.1,116 కోట్లకు చేరింది. సికింద్రాబాద్‌ - కాజీపేట మార్గంలో ప్రస్తుతం రెండులైన్లు ఉన్నాయి. 85.48 కి.మీ. పొడవున మూడోలైను నిర్మాణం కోసం 2014లో సర్వే పూర్తయితే 2018లో ప్రాథమిక సర్వే నివేదిక తయారైనా ఉలుకూ పలుకూ లేదు. బీబీనగర్‌ - గుంటూరు డబ్లింగ్‌కు నిధులు కేటాయించలేదు. ఎంఎంటీఎస్‌ - 2 విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు నిర్మాణ వ్యయం పూర్తిగా భరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుబంధంగా 564 కి.మీ. రీజినల్‌ రింగ్‌ రైల్‌ లైన్‌ నిర్మించనున్నట్లు కేంద్రం గత సంవత్సరం ప్రకటించింది.. రూ.14 కోట్లు మంజూరు చేసినా, ఇంకా సర్వే మొదలవలేదు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12,408 కోట్లుగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో వీటి ఊసేలేదు.

ఓటర్లను బకరాలను చేసినట్లేనా?

ప్రతి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. ఈ సారి బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చినా అదే వివక్ష. గత ఎన్నికల్లో కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోడీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత వైఖరి దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేయాలనుకోవడం ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమే. ముఖ్యమంత్రి, సహచర మంత్రివర్గం ఇప్పటివరకు ఎన్నోసార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయా న్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు..

తీగల అశోక్ కుమార్

79891 14086

Tags:    

Similar News