సింగరేణిలో నయా రూల్స్
గతంలో గనుల్లో ఏమైనా ప్రమాదాలు, పొరపాట్లు జరిగితే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యాజమాన్యం విచారణ జరిపేది.
గతంలో గనుల్లో ఏమైనా ప్రమాదాలు, పొరపాట్లు జరిగితే అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యాజమాన్యం విచారణ జరిపేది. కానీ ఇప్పుడు సింగరేణి యాజమాన్యం రెండు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం, కార్మికులు, ఏదైనా పొరపాటు చేస్తే ఎల్లో, రెడ్ కార్డులు మంజూరు చేస్తారు. దీని ప్రకారం వారిపై చర్యలుంటాయి.
అయితే సింగరేణి, ఈ చట్టాన్ని గుర్తింపు కలిగిన, ప్రాతినిధ్య సంఘాలతో యాజమాన్యం చర్చలు జరపకుండానే అమలు చేసింది. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సర్కులర్ల పేరుతో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
ఇకపై విచారణలు ఉండవు..
బొగ్గు గనిలో కార్మికుడు తప్పు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా మొదట ఎల్లో కార్డు పేరుతో కార్మికుడి సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపిస్తారు. ఇలా రెండు, మూడు సార్లు ఎల్లో కార్డు మెసేజ్ తర్వాత రెడ్ కార్డ్ మెసేజ్ వస్తుంది. ఆ తరువాత కార్మికుడిపై యాజమాన్యం చర్యలకు సిద్ధం చేస్తారు. ఇక కార్మికుడికి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. సెల్ ఫోన్‌కు ఎల్లోకార్డు మెసేజ్ వస్తే... శిక్ష అనుభవించటానికి కార్మికులు సిద్ధంగా ఉండాల్సిందే.
గతంలో వలే కార్మికుడు గనిలో తప్పు చేస్తే విచారణ జరిపి, తప్పు చేసినట్టు నిరూపణ అయితే, మొదట చార్జిషీట్ ఇచ్చేవారు లేకపోతే మరో చర్య తీసుకునేవారు. కొన్నిసార్లు డీజీఎం.ఎస్. విచారణలు కూడా జరిగేవి. ప్రస్తుతం నూతన చట్టం ప్రకారం ఇలాంటి విచారణలకు యాజమాన్యం స్వస్తి పలికింది.
మానసికంగా వారిని హింసిస్తూ..
సింగరేణిలో పనిచేసే కార్మికులు ఎక్కువ మంది నిరక్షరాస్యులే. సెల్ ఫోన్‌లో మెసేజీలు చదువుకోవటం రాకపోయినా... అక్షరాస్యులైతే ఒక్కొక్కసారి మెసేజీలు చూసుకోకపోతే యాజమాన్యం చర్యలు తీసుకునే వరకు కార్మికుడికి విషయం తెలియని పరిస్థితి నెలకొంది. పనిస్థలాల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, రక్షణ పరికరాలు అందించకుండా, తప్పు చేసిన కార్మికుడిపై ఎల్లో, రెడ్ కార్డులు తీసుకురావడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్పత్తి, ఉత్పాదకతే లక్ష్యంగా సింగరేణి సంస్థ ముందుకు సాగుతూ... కార్మికులపై నల్ల చట్టాలను అమలు చేస్తూ... మానసికంగా వారిని హింసిస్తున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా యాజమాన్యం అమలు చేస్తున్న నూతన సర్క్యులర్లతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో కేవలం ఒక నెలలోనే 34 మందికి రెడ్, ఎల్లో కార్డులు జారీ చేశారంటే...మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఎంతమందికి జారీ చేసే ఉంటారో తెలియడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉంది.
కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడంతో..
కార్మికులకు సక్రమంగా బూట్లు, హెల్మెట్లు తదితర రక్షణ పరికరాలు సకాలంలో అందించడం లేదని, కాలం చెల్లిన యంత్రాలతో పనులు చేస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. ఇలాంటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి దానికి కార్మికుడిని బాధ్యుడిని చేయటం ఎంతవరకు సమంజసం అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
అధికారుల ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులను బలి పశువులు చేస్తున్నారు. రెడ్ కార్డు అందుకున్న ఉద్యోగికి చార్జిషీట్‌తో పాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్‌లో కోత, చివరకు డిస్మిస్ వంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలకు యాజమాన్యం సిద్ధమవుతున్నది. ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ సంఘాలు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని టీబీజీఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి ఆరోపిస్తున్నారు. వెంటనే ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని రద్దు చేయాలనీ, లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇవి ఏమైనా గేమ్‌లా..?
కార్మికుడు, అధికారి తప్పులు చేస్తే స్టాండింగ్ ఆర్డర్స్, మైన్స్ యాక్టులు, డిసిఎంఎస్ విచారణలు అనేక పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎల్లో, రెడ్ కార్డుల పద్ధతులు తీసుకురావటం ఏంటి ఇదేమైనా ఫుట్ బాల్, హాకీ గేమ్‌లా తమాషాగా ఉందా? ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత కార్మికుడికి ముందు చార్జిషీట్ ఇవ్వాలి. ప్రాథమిక విచారణ జరపాలి. ఇలాంటి చట్టాలన్ని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ చేతకానితనం అనైక్యత వల్లే యాజమాన్యం ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నది.వెంటనే ఈ దుర్మార్గపు చట్ట చర్యలు ఆపాలి. ఈ విషయమై సింగరేణి సీఎండీ తగిన చర్యలు తీసుకోవాలి. మరి కార్మికుల ఈ న్యాయమైన కోర్కెల విషయంలో యాజమాన్యం ఏ చర్యతీసుకుంటుందో వేచిచూడాలి.
డా. కిశోర్ ప్రసాద్
98493 28496