ఎంపీ ఉన్మాదిగా మారితే ఎలా?
వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ విషయంపై 21 మంది లోక్‌సభ సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్
వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ విషయంపై 21 మంది లోక్‌సభ సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉన్మాద ప్రవర్తన దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై గాజు సీసా ముక్కను విసరడం తీవ్రంగా పరిగణించవలసిన విషయం. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ ఎంపీ అబిజిత్ గంగోపాధ్యాయతో ఘర్షణకు దిగి, గాజు సీసాను పగలగొట్టి, జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ పైకి విసరడం ఉన్మాద చర్యే! ఇలా ప్రవర్తించడం తప్పు కాదని డీఎంకే ఎంపీ ఏ రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సిగ్గు విడిచి మాట్లాడి, వారి స్థాయిని దిగజార్చుకున్నారు.
పార్లమెంట్ కమిటీలలో నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతాయి. గతంలో ఏర్పాటు చేసిన జేపీసీ సమావేశాలలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఏనాడూ చోటు చేసుకోలేదు. కమిటీ సభ్యులు ఎంతో హుందాగా, సంస్కారయుతంగా ప్రవర్తించి, భవిష్యత్తు తరాల ఎంపీలకు మార్గదర్శకంగా నిలిచారు. గతంలో సదరు ఎంపీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్‌పై వ్యంగ్యంతో కూడిన మిమిక్రీ చేయడం, పార్లమెంట్ సభ్యులు, ప్రజలు ఆయన ప్రవర్తనా తీరుపై విమర్శలు గుప్పించడం దేశ ప్రజలు ఇంకా మరిచిపోనేలేదు. సదరు ఎంపీ చర్యకు ప్రతిచర్యగా బీజేపీ ఎంపీలు బరితెగించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం! ఈ విషయంలో జేపీసీలోని బీజేపీ సభ్యులు సంయమనాన్ని పాటించి, పరిస్థితి విషమించకుండా సర్దుబాటు చేశారు. దేవుడి దయవల్ల ప్రాణాపాయం నుండి తాను బయటపడినట్లు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ మీడియా ముందు ప్రకటించడం బట్టి చూస్తే కమిటీ సమావేశంలో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో స్పష్టం అవుతుంది.
లౌకికత్వమంటే హిందుత్వ వ్యతిరేకతేనా?
వాస్తవంగా బీజేపీ మనుగడను లౌకికవాద ముసుగు వేసుకున్న రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకోవు. ఇందుకు కారణం లేకపోలేదు. హిందుత్వ విషయాలను దేశ ప్రజల ముందు ఉంచి, బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఈ దేశంలో హిందుత్వం మనుగడను, హిందుత్వ ఆలోచనలను ముస్లింలు, క్రైస్తవులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. విగ్రహారాధకులైన హిందువుల గురించి వారి మత గ్రంథాలలో చొప్పించిన అసంగత విషయాలే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు! హిందుత్వ సంస్థలను, హిందుత్వ పార్టీని, హిందువుల ఆచార సాంప్రదాయాలను తూలనాడితే ముస్లింలు, క్రైస్తవులు తమ వైపు ఉంటారని లౌకికవాద పార్టీల నాయకులు తలపోస్తారు. ముస్లింల, క్రైస్తవుల ఓట్లు గుండుగుత్తగా తమకే పడతాయని అన్ని లౌకిక వాద పార్టీల నాయకులు ఆశతో ఉంటారు.
సాటి ఎంపీపై ఇంత ద్వేషమెందుకు...!
ఈ దేశంలో ముస్లింలకు హజ్ యాత్రకు సబ్సిడీలు ఇవ్వడం, రంజాన్ మాసంలో ముస్లిం మత చిహ్నాలు ధరించి, ఇఫ్తార్ విందులు ఇవ్వడం లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ రాజకీయ నాయకులకు ఇది ఒక విన్యాసంగా మారింది. గ్రామాలకు గ్రామాలు క్రైస్తవీకరించబడుతున్నా, రాజ్యాంగ నియమాలకు భంగం వాటిల్లుతున్నా వీరు నోరు మెదపకపవడానికి కారణం ఇదే! కులాల వారీగా చీలిపోయిన హిందువులను సంఘటితపరిచి, హిందూ ఓటు బ్యాంకును నిర్మించుకున్న బీజేపీని ద్వేషించకుండా, దూషించకుండా ఈ లౌకికవాద పార్టీల నాయకులు ఉండలేరు. జగదాంబికా పాల్‌పై జరిపిన దాడి ఈ కోవలోనిదే. సాటి పార్లమెంట్ సభ్యుడిపై దాడి మామూలు విషయం కానే కాదు. కసి, పగ, ద్వేషం ఈ విషయంలో స్పష్టంగా కనబడుతుంది.
బీజేపీది సంపూర్ణ వైఫల్యం
ఇక వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని రూపొందించడానికి బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు అంగీకరించరు గాక అంగీకరించరు. ఈ విషయంలో ముస్లిం సమాజం రెచ్చిపోయేటట్లు, హింసాత్మక చర్యలకు పూనుకునేటట్లు, రోడ్ల మీది కొచ్చి, శాంతిభద్రతలకు భంగం కలిగేలా తయారు చేయడానికి రాజకీయ పార్టీల నాయకులు సదా సిద్ధమైనారు. ముస్లింల ఓట్లను గుండుగుత్తగా కైవస చేసుకోవడం ఈ రాజకీయ పార్టీల నాయకులకు అవసరం. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ముస్లిం సమాజాన్ని రోడ్ల మీదికి తోలారు. వాస్తవంగా పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇబ్బందులు ఎదుర్కొని, భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులకు పౌరసత్వాన్ని ఇవ్వడానికి నిర్దేశించిన చట్టమది. ఈ చట్టం స్వరూప, స్వభావాలను దేశంలోని సామాన్య ప్రజలకు వివరించడంలో హిందుత్వ వాదులు, బీజేపీ వ్యూహకర్తలు, బీజేపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో ముస్లిములను రెచ్చగొట్టడంలో హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీల నాయకులు సఫలమయ్యారు.
వక్ఫ్ బోర్డుపై సక్రమ చర్యలకూ నో..
ఇక చివరగా వక్ఫ్ బోర్డు నిర్వహణ పారదర్శకంగా, జవాబుదారిగా, ఈ బోర్డు ఆస్తులను అక్రమార్జన చేసిన వారిని శిక్షించడంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు చాలామంది ముస్లిం ప్రతినిధులు అనుకూలంగా ఉన్నారు. బోర్డు ఆస్తులను డిజిటలైజ్ చేయడం, బోర్డులో షియా మతస్తులకు స్థానం కల్పించడం, ఆస్తులు ఎలా సంక్రమించాయి అనే విషయం పైన లీగల్ నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలపై బీజేపీ ప్రభుత్వం పైన ముస్లిం సమాజ ప్రతినిధులు కారాలు మీరాలు నూరుతున్నారు. ఇలాంటి పరిస్థితిని లౌకికవాద హిందూ రాజకీయ పార్టీల నాయకులు బాగా సొమ్ము చేసుకుంటారనేది అక్షర సత్యం.
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877