ధాన్యం కొనుగోల పట్టదా?
రైతులు కష్టపడి పండించిన పంటలు సకాలంలో అమ్ముడు కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయపడతాం. పంటను కంటికి రెప్పలా
రైతులు కష్టపడి పండించిన పంటలు సకాలంలో అమ్ముడు కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయపడతాం. పంటను కంటికి రెప్పలా కాపాడుకుని పైసలు ఇంటికి తెచ్చుకోవడానికి ఎన్ని అడ్డంకులు దాటుకుని రావాలో రైతులకే తెలుసు.. విత్తు వేసే దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. పూర్వకాలంలో ఇంట్లో ధాన్యం నిండుగా ఉంచి సంక్రాంతి బాగా జరుపుకునే అనవాయితీ. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఆపైన యాంత్రీకరణ రైతును కుంగదీస్తున్నది.
రైతులు అంతా బాగుందనుకునేలోపు అకాల వర్షాలు పంటను కబళిస్తున్నయి. ఇప్పటికే 80 శాతం పంటలు పొలాల నుంచి కళ్లాలకు చేరాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల కోతలు పూర్తికాగా, కొన్నిచోట్ల కొనసాగుతున్నాయి. కొనుగోలు విషయంలో ఉమ్మడి జిల్లాలకు ఐఏఎస్‌లను నియమించినా ఎలాంటి మార్పు లేదు. రైతులు కళ్లాలు, మార్కెట్ యార్డుల దగ్గర రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. వరి కోతలు పూర్తయినా కొనుగోలు మాత్రం ఒక్క అడుగు ముందుకెళ్లడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
మిల్లర్లు చేతులెత్తేస్తే దిక్కేంటి?
పంటల కోతలు ప్రారంభం నుంచే కొనుగోళ్లకు సన్నహాలు చేయాల్సిన సర్కార్ కోతలు పూర్తయినా వేగం పంజుకోవడం లేదు. దీంతో కళ్లాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి దాపురించింది. జిల్లా కలెక్టర్లతో, పౌర మంత్రిత్వ శాఖాధికారులతో మంత్రి సమీక్ష చేసినా కొలిక్కి రాలేదు. కళ్లాలు, మార్కెట్ యార్డుల్లో సరైన సౌకర్యాలు లేవు. రైతులకు సర్కార్ సరఫరా చేయాల్సిన టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు. రైతు ధాన్యం విక్రయించాక దాని బాధ్యత సర్కారుదే. అక్కడి నుంచి రవాణా చేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ధాన్యం కొనలేమని మిల్లర్లు చేతులెత్తేస్తే ఇటు వ్యవసాయ శాఖ, అటు పౌరసరఫరాలశాఖ ఏం చేస్తున్నట్లు? యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? తగినంత యంత్రాంగం ఏర్పాటు చేయాల్సింది ఎవరు సర్కారు కదా..?
రైతుకు చివరి దాకా కష్టం, నష్టమే
ఇప్పటికే రైతులకు పెట్టుబడులు అందక ప్రయివేట్ వడ్డీలు తెచ్చి ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షాలు ఓ వైపు, కొనుగోలులో ఆలస్యం మరోవైపు రైతును ఇబ్బంది పెడుతున్నాయి. మన దేశం వ్యవసాయ దేశం, వ్యవసాయ రాష్ట్రంలో రైతులు తమ పంటను అమ్ముకోవడంలో పడే అవస్థలు చాలా దారుణం. రాష్ట్రంలోని 276 యార్డుల ద్వారా ఏడాదికి రూ.120 కోట్లు వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆయా యార్డుల్లో ధాన్యం నిల్వ కోసం గోదాములు లేవు. స్థలాలు ఉన్నా నిర్మాణం కనుమరుగవుతోంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పొకొచ్చిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే దారిలో వెళ్తున్నారు. కొన్నిచోట్ల అయితే వే బ్రిడ్జిలు లేవు. మరికొన్ని చోట్ల ఉన్నా పనిచేయడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉన్నా పని జరగకపోతే రైతుకు మేం మేలు? తొలిసారిగా 91.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ సర్కార్ గొప్పగా చెబుతోంది కానీ అందుకు మాత్రం ఆచరణ కనిపించడం లేదు.
సర్కార్ నిర్ణయం మంచిదే కానీ..
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతుకు ఆశ పుట్టించడమే కానీ ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చడం లేదు. ప్రభుత్వాలు రైతులకు చేయాల్సింది చాలా ఉంది. కానీ ఉన్నవాటిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు. పండిన ప్రతి గింజ కొంటామని చిలుక పలుకులు ప్రదర్శిస్తున్నారు కానీ అందుకు అవసరమైన సన్నాహాలు, ఏర్పాట్లు చేయడం లేదు. గత సర్కార్ లోపాలే రైతులకు ఇప్పుడు శాపాలంటున్న కాంగ్రెస్ సర్కార్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేదే లేదని చెప్పడం సంతోషమే. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ? అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు చేస్తామన్న పౌరసరఫరాల మంత్రి ఇప్పటికీ కొనుగోలు వేగాన్ని పెంచడంలో విఫలమయ్యారు. రైతుల ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
- పట్ట హరనాథ్
87908 48009