ఈ-వ్యర్థాలతో ఎన్నో అనర్థాలు..

వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ పరికరాల విస్తరణకు దారితీసింది. దీని ఫలితంగా ప్రమాదకర ఈ-వ్యర్థాలు పెరగడం, అవి పర్యావరణం

Update: 2024-10-25 00:30 GMT

వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ పరికరాల విస్తరణకు దారితీసింది. దీని ఫలితంగా ప్రమాదకర ఈ-వ్యర్థాలు పెరగడం, అవి పర్యావరణం ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావాలను చూపుతున్నాయి. భారతదేశం ప్రపంచ దేశాలలోనే ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో చేరింది. గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020 ప్రకారం, భారతదేశం 2019 సంవత్సరంలో సుమారు 3.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ - వ్యర్థాలను ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం, దాని అభివృద్ధి చెందుతున్న సమాచార, సాంకేతిక రంగం. పట్టణీకరణ కారణంగా ఈ - వ్యర్థాల పెరుగుదల రోజురోజుకి పెరుగుతుంది.

ఇది పెరగడానికి కారణం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో సహా దేశంలోని అన్ని పట్టణ కేంద్రాలు ఆర్థిక వృద్ధి, పట్టణీకరణను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగింది. అంటే ఈ-వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరిగింది. ఇది దేశంలోని సాంకేతిక అభివృద్ధి, ఉత్పత్తుల పట్ల అధిక ఆకర్షణ, మానవ అవసరాలు మారుతున్నట్లు సూచిస్తుంది. డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా డిజిటల్ పరికరాలు, వాటి సేవల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కువ మందికి లాభదాయకంగా ఉండడం, పౌరులు స్మార్ట్‌ఫోన్లు కంప్యూటర్లను కొనుగోలు చేయడం, వినియోగించడంతో ఈ-వ్యర్థాల ఉత్పత్తి పెరగడానికి దారితీసింది.

సుస్థిర భవిష్యత్ కోసం..

భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఈ - వ్యర్థాల సంక్షోభం అనేక సవాళ్లను కలిగి ఉంది. దీనికి తక్షణ చర్యలు అవసరం. గణాంకాల ప్రకారం తెలంగాణలో 2020 సంవత్సరంలో 2.2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈ వేస్ట్ ఉత్పత్తి జరిగింది. ఇటీవల అధ్యయనాల ప్రకారం తెలంగాణలో ఈ వ్యర్థాలు ఉన్న ప్రాంతాల్లో లెడ్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితులను మించి ఉన్నాయి. ఈ - వ్యర్థాలు నిర్వహణ నియమాలు 2016 ఉనికిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారిక రీసైక్లింగ్ కార్యకలాపాలు ఐదు శాతం కంటే తక్కువ ఉన్నందున వాటి అమలు సవాలుగా మిగిలిపోయింది. ఈ ముఖ్యమైన సమస్యను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించాలి. ప్రజలలో అవగాహన కలిగించడం, సుస్థిర విధానాలతో సమాజాన్ని ఉత్తేజ పరచడం, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు రీసైక్లింగ్‌తో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలు ఈ - వ్యర్థాల యాజమాన్యానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. తెలంగాణా టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను పరిగణలోనికి తీసుకుని సుస్థిరమైన ఈ - వ్యర్థాల నిర్వహణ పద్ధతులకు ప్రాధాన్యతనివ్వాలి. అంతిమ లక్ష్యం కేవలం ఈ వ్యర్థాలను నిర్వహించడం నియంత్రించడం మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పునర్వినియోగపరచడం, రీసైకిల్ చేయడం. ఇది మాత్రమే రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్తును నిర్మిస్తుంది.

వినియోగదారీ సంస్కృతి..

వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా నడిచే వినియోగదారుల సంస్కృతి ఎలక్ట్రానిక్ పరికరాలను తరచుగా కొనుగోలు చేయడం, విస్మరించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఈ - వ్యర్థాలు పేరుకు పోవడానికి గణనీయంగా దోహదపడుతుంది. తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ హబ్‌గా, ఈ - వ్యర్ధాలు ఉత్పత్తికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో రాష్ట్రం 2.2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈ - వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. పెరుగుతున్న పట్టణీకరణ, సాంకేతిక అభివృద్ధి కారణంగా ప్రతి ఏటా దాదాపు 10 నుండి 15% వరకు పెరుగుతుందని అంచనా. హైదరాబాద్ నగరంలో అనేక సాంకేతిక సంస్థలు, జనాభా ఉన్న కారణంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తి దాదాపు 60 శాతం హైదరాబాదులోనే ఉంది. అంతేకాకుండా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం తెలంగాణలో 90 శాతం ఈ-వ్యర్థాలు అనధికారిక రంగం ద్వారా ప్రాసెస్ చేయబడుతుందని అంచనా వేయబడింది. దీనికి సరైన భద్రతా చర్యలు, రీసైక్లింగ్ పద్ధతులు లేవు. ఇలాంటి చర్యల వల్ల అనారోగ్య, పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి.

- డా. చిందం రవీందర్

chindamravinder63@gmail.com

Tags:    

Similar News