రిజర్వేషన్‌ను అడుక్కోవడం మానేసి..అడగడం నేర్చుకోవాలి..!
బీసీలకు రాజ్యాధికారం, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, మా వాటా మాకే, బీసీల కులగణన వంటి పతాక శీర్షికలతో మన దేశంలోని ప్రముఖ
బీసీలకు రాజ్యాధికారం, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, మా వాటా మాకే, బీసీల కులగణన వంటి పతాక శీర్షికలతో మన దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా సంస్థలు, విద్యావేత్తలు, ఉన్నత విద్యావంతులు, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగులు, కవులు, రచయితలు తదితరులు చేస్తున్న భావ ప్రకటనలు, సామాన్య ప్రజల మధ్య చర్చలు ఎనిమిది దశాబ్దాలకు చేరువలో ఉన్న స్వాతంత్ర్య భారతాన్ని నేడు తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడం నిర్వివాదాంశం.
ప్రపంచానికి భారతదేశం ఓ ఆశాకిరణం అంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ, బీసీ డిక్లరేషన్ అంశాలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వంటి దేశ నాయకులు సైతం నేటి భవిష్యత్తు భారతంలో బీసీ సమాజం పాత్ర కీలకమని విశ్వసిస్తున్నారు. దాదాపు దేశ జనాభాలో 50 శాతం పైగా వున్న బీసీలు కొన్ని దశాబ్దాలుగా కొంతమంది నాయకుల స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలతో విద్యా, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడి వున్నారని, ప్రజాస్వామ్య, లౌకిక భారతంలో సమాన అవకాశాలు పొందలేకపోయారని గణాంకాలతో సహా కొంతమంది మేధావులు, ప్రజాప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.
రాజ్యాధికారం ద్వారానే మార్పు సాధ్యం!
చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అవసరమని, మా హక్కుల కోసం మా పోరాటం అంటూ బీసీల పోరుబాట ప్రారంభమైంది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా భారత్ లాంటి దేశంలో ప్రజల జీవితాల్లో మార్పు కేవలం రాజ్యాధికారం ద్వారానే సాధ్యపడుతుందని, కొన్ని దశాబ్దాలుగా రాజ్యాధికారం కొంతమంది చేతుల్లోనే ఉందని, ఆ తీరు మారి ప్రజల తీర్పుల్లో మార్పు రావాలనే ఆలోచనలు బలంగా వ్యాపిస్తున్నాయి. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులుగా బీసీలు ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, దేశ ప్రధానమంత్రులుగా వున్నప్పుడే ఆశించిన మార్పు బీసీల జీవితాల్లో కనిపిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఇస్తూనే, ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహం అందిస్తే మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారుతుందని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
మేమూ పాలకులమే..!
1970లో అనంతరామన్ కమిషన్ నివేదిక, 1982 లో మురళీధరరావు ఏకసభ్య కమిషన్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బి.యస్ రాములు నేతృత్వంలోని తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ వంటివి ఎన్నో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలు చాలా వెనుకబడి వున్నారని వివరించాయి. నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచే బీసీల రాజకీయ చైతన్యం కొత్త మలుపులు తిరుగుతోంది. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో, అసెంబ్లీ, లోక్‌సభల్లో బీసీల గొంతుకలు వినిపించడం లేదు. మనమంతా కలిసి దేశంలో సగం భాగమై వున్నా కూడా "మన పాలన" ఏమయ్యిందంటూ కారణాలు వెతుక్కుంటున్నారు బీసీలు. ఇన్నాళ్లూ కేవలం పనివాళ్లు గానే వుంటూ పాలించే వారిగా ఎదగలేకపోయామని, కనీసం మన పిల్లల భవిష్యత్తులను మార్చుకుందామని అనుకుంటున్నారు.
ఐక్యతే భవిష్యత్తుకు పునాది!
కొన్ని దశాబ్దాల పరిణామ క్రమం గమనిస్తే కొంతమంది బీసీ నాయకులే తమ స్వార్థ పూరిత రాజకీయ పదవుల కోసం కొంతమం ది అగ్రకులాల రాజకీయ నాయకుల వద్ద బీసీ జెండా వాడుకున్నారని, కుల సంఘాలను త్యాగం చేశారని తెలుస్తోంది. బీసీ కుల సంఘాల్లో కూడా కొన్ని కులాలకు చెందిన కొంతమంది నాయకుల ఆధిపత్య ధోరణే నేటి బీసీల అనైక్యత, వర్గపోరుకు కారణమని మేధావులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ స్థాయి అధికారులు వంటివారు సైతం అభిప్రాయపడుతున్నారు. అడుక్కోవడం మానేసి అడగడం నేర్చుకోవాలంటున్నారు. కనీసం ఇప్పటినుంచైనా ఎన్ని జెండాలు మన మధ్య వున్నా "బీసీల ఎజెండానే బీసీల రాజ్యాధికారం" కావాలని తమ సందేశాలను వినిపిస్తున్నారు. బీసీల సంఘటితమే నేడు చారిత్రాత్మక అవసరమని, బీసీల ఐక్యత ఓటు రూపమై బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం కావాలని బీసీల అభ్యున్నతికై పాటుపడే వ్యక్తులను నాయకులుగా మార్చాలని ఆశిస్తున్నారు.
ప్రశ్నించే గళాలు కావాలిప్పుడు..!
దేశవ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ వేదికల ద్వారా "మేము మాత్రమే పాలించగలం" అంటున్న కొంతమంది అగ్రకులాల నాయకులకు "బహుజనులం.. మేమేం తక్కువ కాదని చూపాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఒక దగ్గర "ఆకలితో వున్న నలుగురు వ్యక్తులకు పది మందికి సరిపడా భోజనం ఇచ్చి, ఇంకో దగ్గర ఆకలితో ఉన్న ఇంకో 52 మందికి 25 మందికి సరిపడే భోజనం ఇచ్చి ఆకలి తీర్చుకోమంటే ఎలా? అని ప్రశ్నించే కలాలు, గళాలు కావాలిప్పుడు నేటీ బీసీల జీవితాల్లో మార్పు కోసం..! ఆకలి బాధ అందరికీ ఒక్కటే అయినప్పుడు న్యాయం జరగాలి.
జనాభా ప్రాతిపదికన అవకాశాలు..
ప్రస్తుత తరుణంలో బీసీల కులసంఘాల నాయకులు వారి రాజకీయపార్టీల కతీతంగా ఏకాభిప్రాయానికి రావాలి. గంటలు గంటలు చర్చలు, రాజకీయ నాయకులపై విమర్శలు మాని, గతాన్ని వదిలేసే మౌనంగా బీసీలు ఐక్యమయ్యే పనులు చేస్తూ పోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీల వాణి ఓటు రూపమై ప్రతిధ్వనిస్తే బీసీల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో త్వరలోనే ఈ దేశం చూస్తుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వారి రాజకీయ, సామాజిక చైతన్యం, సంఘటితం వంటి అంశాలను బీసీలు ఆదర్శంగా తీసుకొని జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కోసం అడుగులు వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో బీసీలంటే కేవలం కొన్ని కులాల సమూహాలు కావు..! కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన అవకాశాలు పొందలేకపోయి వివక్షతకు గురైన స్వాతంత్ర్య భారతంలోని ఓ మెజారిటీ ప్రజల వర్గం. బీసీల పోరాటమంటే కొన్ని అగ్రకులాల అవకాశాలకు వ్యతిరేకం కాదు. కనీసం తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలని న్యాయబద్ధంగా కదిలిన కొన్ని కోట్ల మంది తల్లిదండ్రుల అంతరంగపు ప్రయత్నం.
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536