ఆకలి సుడిగుండంలో పేదలు..

2024వ సంవత్సరానికి ప్రకటించిన ఆకలి సూచి లో 127 దేశాల్లో 105వ స్థానంలో భారత్‌ నిలవడానికి కారణమేమిటి? కన్‌సర్న్‌ వరల్డ్‌ వైడ్‌, వెల్త్‌ హంగర్‌ లైఫ్‌

Update: 2024-10-24 01:15 GMT

2024వ సంవత్సరానికి ప్రకటించిన ఆకలి సూచి లో 127 దేశాల్లో 105వ స్థానంలో భారత్‌ నిలవడానికి కారణమేమిటి? కన్‌సర్న్‌ వరల్డ్‌ వైడ్‌, వెల్త్‌ హంగర్‌ లైఫ్‌ సంస్థలు సంయుక్తంగా జీహెచ్‌పీ వివరాలను ఏటా ప్రచురిస్తున్నాయి. మన పొరుగునున్న నేపాల్‌, శ్రీలంక, మయ న్మార్‌, పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ కంటే కూడా ఇండి యా వెనుకబడి వుండటం ఆశ్చర్యాన్ని కొలుపుతుంది. ప్రస్తుత నివేదికలో భారత్‌ స్కోర్‌ 27.3 మాత్రమే వుంది. 2016లో 29.3 శాతం ఉంది. అంటే సుమారు ఈ 8 సంవత్సరాలలో 2 శాత మే భారత్ ర్యాంక్ పెరిగింది. నిజానికి మన పాలకులు ఏ రాజ్యాలయితే పేదరికంలో కూరుకుపోయాయని చెపుతున్నారో ఆ చిన్న రాజ్యాలు మనకంటే ముందునుండడం బాధాకరమైన విషయం. భారతదేశాన్ని అత్యున్నతమైన దిశగా మనం చూడాలంటే దేశంలో కుల మత బేధాలు లేకుండా భూమి పంపకంలో, పరిశ్రమల్లో, విద్యా వ్యవస్థల్లో దళిత బహుజనులకు సమానమైన వాటా ‌కావాల్సి ఉంది. 

2002 జూలై 18న ప్రతిపక్షాల చొరవతో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. నాటి రెవెన్యూ మంత్రి అశోక్‌ గజపతిరాజు జవాబుగా, 2002 ఏప్రిల్‌ 1వ తేదీ వరకు 24,43,170 మందికి 43,11,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ మిగులు భూములు, 5.22,351 మంది లబ్దిదారులకు 5,78,728 ఎకరాల సీలింగ్ ల్యాండును పంపిణీ చేసామని, ఇంకా 32,629 ఎకరాల భూమిని పంపిణీ చేయాల్సి ఉన్నదని నమ్మబలికారు. రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు వ్యవసాయ భూమి లేక అల్లాడుతుండగా, 10 శాతం మంది భూస్వాముల ఆధీనంలో 70 శాతం భూములున్నాయని బీజేపీ సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణాలో వేలాది ఎకరాల భూమి ఆక్రమణలకు గురై, బీడుగా మారిందని మిగులు భూములను కొనుగోలు చేసేందుకు ఎస్‌.టి., ఎస్‌.సి, బి.సి, కార్పొరేషన్లు నుంచి నిధులు తీసుకోవచ్చని, ఆ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక గ్రాంటులనిస్తుందని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్నప్పుడు డా.కె.లక్ష్మణ్‌ ఈ ఆరోపణ చేశారు. ఇప్పుడు బీజేపీ పాలన వచ్చిన తరువాత బీజేపీ కార్పొరేట్‌ వ్యవస్థనే నడుపుతోంది కానీ దళితులకు భూమి పంచటం లేదు. ముఖ్యంగా దళిత ద్వేషం పెరిగింది. ముఖ్యంగా దళితులకు పంచాయితీ విధుల్లో ఏ విధమైన కేటాయింపులు లేవు. వారికి కనీసం స్మశాన భూములు కూడా లేవు. శుభ్రమైన నీరు లేదు. మురుగు కాలువల నిర్మాణం లేదు. గ్రంథాలయాలు లేవు. అంతే కాకుండా స్త్రీలకు మరుగు దొడ్ల వసతి లేదు.

దళితుల లక్షలాది ఎకరాలు కబ్జా!

ప్రపంచ సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలంతా తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, రాజు, క్షత్రియ కులాల్లోని దురాక్రమణ చూసి విస్తుబోతున్నారు. దళితులకు బహుజనులకు భూములు పంచకపోగా వారి భూములను ఆక్రమిస్తున్న ధోరణి సమాజం గుండెలకు గాయం చేస్తుంది. దళితుల ఎసైన్డ్‌ భూములను ఆక్రమించి క్షత్రీయులు, కమ్మవారు, ఇంజనీరింగ్‌ కాలేజీలు కట్టుకున్నారు. దళితులను దూరంగా నెట్టివేసి అందులో ఫ్యూన్‌ పని కూడా వారికి ఇవ్వకుండా సొంత కులాలతో నింపుకున్నారు. దళితులకు బ్రిటీష్‌ వారు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములపై సీబీఐ విచారణ గాని మనం వేయగలిగితే కొన్ని లక్షల ఎకరాలు తిరిగి వారికి చెందుతాయి. పైగా రిజర్వేషన్‌ ఫలితాలను పొందుతున్న దళితులూ, బీసీలూ తమ గ్రామాల వైపు తొంగి చూడటం లేదు. వారు పట్టణాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారు అగ్రకుల సంస్కృతిలోకి కొట్టుకుపోతున్నారు. దళితులకు భూముల్లో, పరిశ్రమల్లో, విద్యలో అన్ని ఉత్పత్తి రంగాల్లో సరైన వాటా కల్పించినట్లయితే భారతదేశంలో ఆకలి వుండదని అంబేద్క‌ర్‌ చెప్పాడు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు కుల, మత, వివక్షతో జీవిస్తూ, నటిస్తూ రాజ్యాంగాన్నే ఛాలెంజ్‌ చేస్తున్నా రు. దీనివల్ల దేశంలో ఆకలి, అవిద్యను పెంచటమే తప్ప అభివృద్ధి ఏమి ఉండదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లికి పాలివ్వగలిగిన శక్తి లేదు. ఆమె ఒక గ్లాస్‌ పాలు తాగే పరిస్థితులు లేవు. ఆమె నాటు వేసినా ఆమెకు ఒక సెంటు భూమి లేదు. మగ్గం మీద నేత నేసే స్త్రీకి సరైన వస్త్రం లేదు. చేపలు పట్టే వారికి చేపలు లేవు. పిల్లల్ని చదివించుకోలేక పోతున్నారు. దళిత వర్గాల్లో బాలికల పరిస్థితి దారుణంగా వుంది.

ముందుగా ఊడేది స్త్రీల ఉద్యోగాలే..!

2001 లెక్కల ప్రకారం పురుషులలో అక్షరాస్యత 75.26% వుండగా స్త్రీలలో 53.67% వుంది. గ్రామీణ స్త్రీల అక్షరాస్యత మరీ హీనంగా 13.7% వుంది. దాదాపు ఇండియాలోని 45 జిల్లాలలో మహిళా అక్షరాస్యత 30 శాతం కంటే తక్కువగా వుంది. ఇంచుమించు భారతదేశంలోని 15 రాష్ట్రాల లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌లో దళిత స్త్రీల అక్షరాస్యత 5% కంటే తక్కువగా ఉంది. పాఠశాలలకు వెళ్లే బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్య చాలా తక్కువ. బడిలో నమోదుకాని పిల్లల సంఖ్యల్లో ముప్పాతిక వంతు అమ్మాయిలే. బడి మానివేసే పిల్లలలో కూడా బాలికల సంఖ్యే ఎక్కువ. ప్రాథమిక స్థాయిలో గాని, మాధ్యమిక స్థాయి గాని, ఉన్నత పాఠశాల స్థాయిలో గాని బడిమానేసే అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. సమాజంలోని కార్మిక బలగంలో పావువంతు మహిళలే ఉన్నారు. కాని వారికి పురుషుల కిచ్చే వేతనంలో 60 శాతం మాత్రమే ఇస్తున్నారు. అధిక శ్రమ, తక్కువ జీతం ఇచ్చే పనులలో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో కిక్కిరిసి వున్నారు. 94 శాతం స్త్రీలు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. అందులో 81.4 శాతం వ్యవసాయరంగంలో, 12.6 ఇతర రంగాల్లో ఉన్నారు. అదే సంఘటిత రంగంలో అతి తక్కువ, ఏదైనా ఆర్థిక సంక్షోభం కలిగినప్పుడు అందరికంటే ముందు ఉద్యోగాలూడేవి స్త్రీలవే.

ఆకలి భారత్ వద్దు..!

ప్రజలు ఆకలితో మరణించటం భారతదేశానికి మంచిది కాదు. పాలక వర్గం భూస్వాములకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాయడం మానేసి ఏ ప్రజలు అయితే నీకు ఓటు వేశారో ఆ ప్రజలందరికి ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యం కల్పించి స్వతంత్రంగా, స్వేచ్ఛగా తమ భూ వనరులలో తామే పనిచేసుకుని ఫలసాయం పొంది తమ పిల్లల్ని వెట్టిలోకి పంపకుం డా చదివించుకుని సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితులు కల్పించాలి. పాలకవర్గం అందరికీ సమభావనా చైతన్యాన్ని, భూమి ఉపాధి ఉన్న రోజున స్వాతంత్య్ర ఫలితాలు అందరికీ అందడమే కాకుండా మన ఉత్పత్తి రంగం విస్తరిల్లి ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకుని భారతీయుడు నిలబడే దిశగా మనం గమించాలని ఆనాడే ఆకలి భారతంగా కాక, ఆర్థిక సంపదతో అభ్యుదయ భారతంగా వెలుగొందుతుందని ఆశిద్దాం... అందుకు ప్రారంభ సూచకంగా తక్షణమే దళితులకు భూ పంపిణీ జరగాల్సి ఉంది...ఆ దిశగా నడుద్దాం.

డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 41695

Tags:    

Similar News