పెండింగ్ డీఏలకు మోక్షమెప్పుడో..?

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అన్నది ప్రభుత్వం ఎప్పుడు ఆర్భాటంగా ప్రకటించే కానుక కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాస్తవ వేతనాలు పడిపోకుండా

Update: 2024-10-25 01:00 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అన్నది ప్రభుత్వం ఎప్పుడు ఆర్భాటంగా ప్రకటించే కానుక కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాస్తవ వేతనాలు పడిపోకుండా ఇచ్చే పరిహారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ డీఏలను విడుదల చేస్తామనే హామీని పది నెలలు గడిచిన నూతన ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? రైతన్నలకు, నిరుద్యోగులకు, మహిళా సంఘా లకు ప్రభుత్వ విద్యకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వివక్ష ఎందుకు చూపిస్తుంది. అంటూ సగటు ఉద్యోగి ఆవేదన చెందుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టడం పట్ల చిన్నాచితక ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్‌లో ఐదు డీఏలు..

డీఏను ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు ఇస్తుంది. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో రెండవది జూలై నెలలో ఉంటుంది. గత ప్రభుత్వం మూడు డీఏలను పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణ మే మూడు డీఏలు చెల్లిస్తామని అలాగే ఫస్ట్ తారీఖున వేతనాలు అందజేస్తామని, పీఆర్సీ ఇస్తామని, సీపీఎస్ విధానం రద్దు చేస్తామని, 317 జీవోను సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ నూతన ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క జీతాల సమస్య తప్ప మిగతా హామీలు‌ నెరవేర్చలేకపోయింది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతభత్యాలలో గుణాత్మక మార్పు లేకపోవడమే కాకుండా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ప్రకటించాల్సిన కరువు భత్యంను గత రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయుల జీవన వ్యయం నిరంతరాయంగా పెరుగుతున్నది. 2022 జనవరి కరువు భత్యంను గత ప్రభుత్వం 2023 జూన్ నెలలో ప్రకటించింది. 2022 జూలై డీఏ 2023 జనవరి, జూలై డీఏలు అలాగే 2024 జనవరి, జూలై మొదలైన 5 డీఏలకు సంబంధించిన 18.20 శాతం కరువు భత్యంను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

డీఏ ప్రభుత్వాల దయ కాదు..!

రాష్ట్ర ప్రభుత్వం డీఏను, కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్(CPI-IW) ఆధారంగా నిర్ణయిస్తుంటుంది. గత మూడేళ్లు గా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. పండగల సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంతో చిన్న స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయు లు నానాయాతన పడుతున్నారు. మంచి నూనె ధరలు లీటర్‌పై రూ. 20-45 వరకు పెరిగాయి. అల్లం కిలో రు.100 నుంచి రు.150, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360, ఎండుమిర్చి రూ. 200 నుంచి రూ. 250, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.175, పెసరపప్పు రూ. 120 నుండి రూ. 150, మినప్పప్పు రూ.135కు చేరింది. ఉల్లి ధరలు రూ.60 నుంచి కిందకు దిగడం లేదు. కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఇలా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెరగక ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వక ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరువు భత్యంను ప్రకటించడం ప్రభుత్వాల దయగా మారింది. ఉద్యోగుల హక్కు ఆయన కరువు భత్యం కోసం కొట్లాడవలిసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గత దశాబ్ద కాలంగా పోరాటాలు మర్చిపోయాయి. పెండింగ్ డీఏల గురించి ప్రశ్నించలేకపోతున్నాయి. నూతన సంవ త్సరం, రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, దసరా దీపావళి పండుగల కానుకగా సీఎం మంజూరు చేస్తారంటూ ఎప్పటికప్పుడు సంఘాలు మభ్య పెట్టడమే తప్ప గట్టి ప్రయత్నం చేయడం లేదు. ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రభుత్వాలు నిజవేతనాన్ని భర్తీ చేసే కరువు భత్యాన్ని మాత్రం ఎగ్గొట్టడం ప్రభుత్వం చేతగానితనం అవుతుం ది. కావున పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకోవాలి. 

- అంకం నరేష్

63016 50324

Tags:    

Similar News