ప్రతి వ్యక్తి చేతిలో ఒకటి లేదా రెండు మొబైల్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. మొబైల్ శరీరంలో ఒక అవయవమైపోయింది. మొబైల్ వాడకుండా ఒక నెల గడిపితే.. పది లక్షల రూపాయల రివార్డ్ ఇస్తానని ఇటీవల ఓ సంస్థ ప్రకటించింది. అంటే మొబైల్ మనిషి జీవితంలో ఎంత పెనవేసుకుంది అర్థం అవుతుంది.
మొబైల్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని ప్రపంచం సృష్టించబడింది. ఏ నలుగురు మిత్రులు కలిసినా, బంధువులు కలిసినా సంభాషణ బదులు ఎవరి చాటింగ్ వారిదే అన్నట్లు మొబైల్‌లోకి వెళ్ళి పోతున్నారు. తోటి మనిషి చనిపోయినా ఒక్కసారి వ్యక్తిగతంగా కలిసి పరామర్శించే ఓపిక, తీరిక హరించి వేసింది.
తమకేమి పట్టనట్టు..
కృత్రిమ మేథ కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం రోబోలు పని చేయడమే కాదు హావ భావాలు ప్రకటిస్తూ మనుషులతో మాట్లాడేస్తున్నాయి. చెబితే తప్ప మనిషి కాదు మర బొమ్మ అని గుర్తించలేని స్థితిలోకి వెళ్ళాం. కృత్రిమ మేధస్సు వల్ల ఎన్నో రకాల పనులు సులభం అవడమే కాదు ఎన్నో వేల ఉద్యోగులను నిరుద్యోగులను చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి మనుగడ తోటి మనిషితో కాకుండా మర మనిషితోనే అన్నంతగా సాంకేతికత అభివృద్ధి చెందింది.
విద్యార్థులు పుస్తకాలు వీడి టాబ్లు, టాబ్లెట్, మొబైల్ వాడేస్తున్నారు. పుస్తకాల సంచి బరువు తగ్గింది అని సంతోషపడాలో లేదా పొద్దస్తమానం మొబైల్ సర్వస్వంగా పరిసరాలకు, తోటి మిత్రులకు, ఇంట్లో బంధువులకు అతీతంగా ఎవరికీ పట్టనట్లు, ఏమీ పట్టనట్టు తమ లోకమే తమదిగా మారుతున్న బాల్యాన్ని చూసి ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితి ఈనాడు కన్పిస్తుంది. పిల్లలు ఆట స్థలంలో ఆడే ఆటలు మరచిపోయారు. మిథ్యా ప్రపంచం (Virtual World) లోనే ఆటలు ఆడేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, జీవితమూ గడిపేస్తున్నారు.
అమ్మలక్కలు టేవి సీరియల్స్‌కి అంకితం అయిపోగా, యువత ఓటీటీ, ఆన్లైన్ సినిమాలకు అతుక్కుపోతున్నారు. ఏ నలుగురు మిత్రులు కలిసినా, బంధువులు కలిసినా సంభాషణ బదులు ఎవరి చాటింగ్ వారిదే అన్నట్లు మొబైల్ లోకి వెళ్లిపోతున్నారు. చివరికి అమ్మతో మాట్లాడాలన్నా, నాన్నతో మాట్లాడాలన్నా చాటింగే శరణ్యం అయ్యింది. భార్యా భర్తలు బెడ్ ఒకటే అయినా ఎవరి చాటింగ్ వారిదే.. ఒకే ఇంట్లో నివశిస్తున్నా, ఎవరి దారి వారిదే ఎవరి మొబైల్ వారే కుస్తీ పట్టడం చూస్తున్నాం.
బంధాలను మంటగలిపే మర తుపాకులు
వాట్సప్, టెలిగ్రాం, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎన్నో సోషల్ మీడియా సైట్లు కాలాన్ని హరించి వేస్తున్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తిని బయటి ప్రపంచానికి అనుసంధానం చేసే అవధాన ప్రక్రియలే కానీ, ప్రక్కన ఉన్న మనిషితో సంబంధాలు తెంచి మానవ బంధాల అనుబంధాల అర్థాన్ని మంట కలిపే మర తుపాకులు. మొబైల్ సుదూర ప్రాంతాలలో ఉండే బంధువులను కలిపింది కానీ మనిషి మనిషికీ ఉన్న దూరాన్ని పెంచింది, బంధాన్ని తుంచింది.
ఫోన్‌లా పుడితే బాగుండు అనేలా..
కుటుంబంలోని నలుగురి మధ్య ఉన్న బంధాన్ని మొబైల్ తెంపేసింది. ఇటీవల ఓ చిన్నారిని ఓ టీచర్ ప్రశ్నిస్తూ.. నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఏ వరం కావాలని కోరుకుంటావు అంటే.. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ‘మొబైల్ ఫోన్‌లా పుట్టాలని కోరుకుంటా’ అని చెప్పింది అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం అవుతుంది. మొబైల్‌ని అయితే తల్లితండ్రులు ఇరవై నాలుగు గంటలూ అతి జాగ్రత్తగా చూసుకుంటారు అన్న జవాబు మతి పోగొడుతుంది. మొబైల్ మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితికి చేరుకున్నాము.
ప్రపంచం అంతా అరచేతిలో ఏమో గానీ అసలు ప్రపంచాన్ని మరిపించేసింది చేతిలోని మొబైల్. విజ్ఞాన సర్వస్వం అంతా అంతర్జాలంలో నిక్షిప్తమైనది కానీ అంతరాత్మలేని విజ్ఞానులను సృష్టించింది ఆధునిక సాంకేతికత. రానున్న కాలంలో ఎంతటి అద్భుతాలు, అనర్ధాలు జరుగనున్నాయో..
శిరందాస్ శ్రీనివాస్
94416 73339